మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి గత ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దీంతో మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఏర్పడింది. ఎదిగిన చేపల విక్రయం ద్వారా ప్రత్యక్షంగా వేలాది మందికి ఉపాధి చేకూరింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్యకారులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని చెప్పి ఆ పథకాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్నది. అందులో భాగంగానే ప్రతి ఏడాది ఏప్రిల్లో నిర్వహించాల్సిన టెండర్ల ప్రక్రియను ఆగస్టులో ప్రారంభించినా వాటిని నేటికీ పూర్తి చేయకపోవడంతో చేపల పంపిణీ ప్రక్రియపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
– వనపర్తి, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ)
గత పదేండ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులను నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ కారణంగా వారి ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ముఖ్యంగా మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఉచితంగా చేప పిల్లల పంపిణీని అప్పటి సీఎం కేసీఆర్ విజయవంతంగా అమలు చేశారు. కానీ నేడు ప్రభుత్వం ఇప్పటి వరకు ఉచిత చేపపిల్లలను పంపిణీ చేసేందుకు టెండర్ల ప్రక్రియనే ఆలస్యంగా చేపట్టడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మత్స్యకారుల కుటుంబాలు అధికంగా ఉన్నాయి. అయితే,ఆయా జిల్లాల వారీగానే మత్స్యకార సహకార సంఘాలను బలోపేతం చేస్తూ గత పదేండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కాగా ఉచిత చేపపిల్లల పంపిణీని అమలు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన అనంతరం రెండేళ్లుగా చేపపిల్లల పంపిణీకి ప్రాధాన్యత తగ్గిపోయింది. గత ప్రభుత్వానికి ఈ పథకంపై ఉన్న ఉత్సాహం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదు. గత ఏడాది సహితం ఉచిత చేపపిల్లల పం పిణీని మమ అనిపించింది. ఇక ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు అతీగతీ లేకపోవడంతో చివరకు ఉచి త చేపపిల్లల పథకానికి రేవంత్రెడ్డి సర్కార్ మంగళం పాడుతున్నదా అన్న అనుమానాలను మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నారు.
టెండర్ల నిర్వహణలో జాప్యం..
చేపపిల్లల పంపిణీ కోసం టెండర్ల ప్రక్రియనే కీలకం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియనే పూర్తిగా డీలా చేసింది. రెండు నెలల కిందటే టెండర్లు నిర్వహించి ఆగస్టులోనే పంపిణీకి శ్రీకారం చుట్టాలి. అలాంటిది ఆగస్టులో టెండర్ల ప్రక్రియను ప్రారంభించినా ఈప్రక్రియ అగ్రిమెంట్ దశకు కూడా చేరుకోలేదు. ఇదంతా జరిగి చేపపిల్లలు రావాలంటే మరో పక్షం రోజులు తప్పనిసరి అవసరం. ప్రస్తుతం వర్షాకాల సీజన్ ముగిసే దశలో ఉన్నది.
గడచిన మూడు నెలలుగా వర్షాల ప్రభావం అధికంగా ఉంది. ఏ చెరువులు.. కుంటలు చూసినా నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. కానీ, ఉచిత చేప పిల్లల పంపిణీని మాత్రం ప్రభుత్వం నిండుగా నిర్లక్ష్యం చేస్తున్నదన్న విమర్శలు వెలువడుతున్నాయి. ఇలా ఆలస్యంగా చేపపిల్లలను వదలడం ద్వారా మత్స్యకారులకు పెద్దగా ప్రయోజనం చేకూరదన్న వాదనలున్నాయి. కనీసం ఆరు నెలలైనా సమ యం ఇవ్వనిదే చేప ఎదుగుదలకు అస్కారం ఉండదని, ఒకకిలో సైజ్లో చేప లేనిదే ఎవరు ఇష్టపడరన్న అభిప్రాయం కూడా ఉంది. ఇలా ఈ పథకాన్ని ఆలస్యం చేయడం వల్ల మత్స్యకారులకు అనేక సమస్యలు తలెత్తడం తప్ప ప్రయోజనం ఉండదన్న విమర్శలు మత్స్య సహకార సంఘాల నాయకులు వెల్లడిస్తున్నారు.
50వేల మంది సభ్యులుంటే…
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మత్స్య పరిశ్రమను నమ్ముకున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ మత్స్యవృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలున్నాయి. జిల్లాల్లో ఆయా మత్స్య సహకార సంఘాల వారీగా చూస్తే… మహబూబ్నగర్లో 256 మత్స్య సహకార సంఘాలుంటే 12వేల మంది స భ్యులున్నారు. అలాగే నాగర్కర్నూల్లో 235 సంఘాలుంటే..14,160 మంది సభ్యులు, వనపర్తిలో 146 సంఘాలుంటే 13, 600 మంది సభ్యులుండగా, గద్వా ల జిల్లాలో 113 సంఘాల్లో 8,140 మంది, నారాయణపేటలో 146 సంఘాలుంటే 12,000 మంది సభ్యులున్నారు.
3 వేలకు పైగా చెరువులు.. కుంటలు..
ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా చెరువులు, కుంటలున్నాయి. చేపల పెంపకానికి అనువుగా ఉండడం వల్ల మత్స్యకార కుటుంబాలకు మేలు జరుగుతుంది. సుమారు 3 వేలకు పైగా ఉన్న చెరువులు, కుంటల ఆధారంగా మత్స్యకారులు చేపల పెంపకాన్ని చేపడుతున్నారు. వీటికి అదనంగా దాదాపు 20కిపైగా రిజర్వాయర్లున్నాయి. వీటన్నింటినీ మించి 200 కిలో మీటర్లమేర కృష్ణానది ఉం డడం ద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. గ త కాంగ్రెస్ పాలనలో చెరువుల వ్యవస్థ నిర్వీర్యమైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీ య ద్వారా చెరువులన్నింటికీ మరమ్మతులు చేసిన సంగతి విదితమే. వీ టన్నింటిలోనూ మత్స్యకారులు చేపలు విరివిగా పెంచుకునేందుకు ప్ర భుత్వం అప్పట్లో అవకాశం కల్పించిం ది. వీటికి తోడు చేపలు విక్రయించేందుకు మార్కెట్ కేంద్రాలు, వాహనాలు కూడా సమకూర్చి మత్స్యకారులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచింది. కాంగ్రెస్ మాత్రం వారి పొట్టగొతుందన్న విమర్శలు వస్తున్నాయి.
మత్స్యకారులకు తీరని నష్టం
ఉచిత చేపపిల్లల పంపిణీని ఆలస్యం చేయడం వల్ల మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఉచితంగా ఇచ్చిన ప్రతిఫలం కూడా దక్కకుండా పోతుంది. వర్షాకాల సీజన్ దాటిపోతున్నది, ఇప్పటికే పిల్లల విడుదల ప్రక్రియ జరగాల్సి ఉంది. ఇంకా మొదలు కాలేదు.. ఎప్పుడు అవుతుందో స్పష్టత కూడా లేదు. గడువును మించి పంపిణీ చేస్తే.. పేరుకు పంపిణీ చేసినట్టవుతుంది తప్పా మత్స్యకారులకు పెద్దగా ప్రయోజనం ఉండదు.
– పుట్టా బాలరాజు, అధ్యక్షుడు, మత్స్య సహకార సంఘం, వనపర్తి