వనపర్తి, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలు సమస్యల ఒడిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులకు సంక్షేమ పథకాలను అందిస్తామని జనవరి 26న అట్టహాసంగా మండలానికో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇలా వనపర్తి జిల్లాలో 15 గ్రామాలను పథకాలు ముందస్తుగా అమలు చేసేందుకు ఎంచుకున్నారు. అయితే ఇప్పటి వరకు నాలుగు పథకాల్లో రెండింటిలోనే కదలిక ఉండగా, మరో రెండు అటకెక్కాయి. దీంతో ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లకు ఆశపడ్డ వారంతా రోడ్డున పడ్డారు.
వనపర్తి మండలం అప్పాయిపల్లి, పెద్దమందడి మండలం మంగంపల్లి, అమరచింత మండలం చింతారెడ్డిపల్లి, ఆత్మకూరు మండలం దేవరపల్లి, ఘణపురం మండలం సల్కెలాపురం, గోపాల్పేట మండలం చెన్నూరు, మదనాపురం మండలం దంతనూరు, పాన్‌గల్ మండలం మాధవరావుపల్లి, పెబ్బేరు మండలం ఈర్లదిన్నె, శ్రీరంగాపురం మండలం నాగసానిపల్లి, రేవల్లి మండలం తల్పునూరు, వీపనగండ్ల మండలం సంపత్‌రావుపల్లి, ఏదుల మండలం చీర్కపల్లి, చిన్నంబావి, కొత్తకోట మండలం రామానంతపురం గ్రామాలను ప్రత్యేకంగా గుర్తించారు. ఈ నాలుగు సంక్షేమ పథకాలను ఈ గ్రామాల్లో వందశాతం అమలుకు శ్రీకారం చుట్టారు.
వనపర్తి మండలం అప్పాయిపల్లి గ్రామం నాలుగు సంక్షేమ పథకాల అమలుకు ఎంపికైంది. ఈ మేరకు అప్పట్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే మేఘారెడ్డి ఈ పథకాలను గ్రామంలో ప్రారంభించారు. అయితే ఈ గ్రామంలో 559 మంది రైతులుంటే.. అందరికీ రైతు భరోసా అందింది. వీరికి రూ.45,96,498 రైతు ల ఖాతాల్లో జమయ్యాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం 119 మందికి ప్రొసీడింగ్స్ అందించారు. 40 మందికి కొత్త రేషన్‌కార్డులు మంజూరైనా లబ్ధిదారులకు ఇంకా అందించలేదు. అలాగే ఆత్మీయ భరోసా పథకంలో 27 మందిని గుర్తించారు. వీరికి 27 మందికి వీరికి 1.62 లక్షలు జనవరిలోనే పడినట్లు గ్రామ కార్యదర్శి నర్మద వెల్లడించారు.
అప్పాయిపల్లి గ్రామంలో 119కి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు జనవరి 26న ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ముందుగా నిరుపేదలను గుర్తించి ఈ ఎంపికలను చేశారు. అయితే, ప్రొసీడింగ్స్ తీసుకున్న వారంతా నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. అనేక దఫాలు ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి పలుమార్లు చెప్పినా ముందుకు రావడం లేదు. అధికారుల ప్రయత్నాలన్నీ వృథా అవుతున్నాయి. చివరకు ఇండ్లు కట్టుకోని పక్షంలో రద్దవుతాయ ని హెచ్చరిస్తున్నా.. ముందుకు రాకపోవడంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై మాత్రం నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎట్టకేలకు 12 మంది మాత్రం ముందుకు రాగా.. సోమవారం నిర్మాణాలకు ముగ్గు పోసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సక్రమంగా నిధులు ఇవ్వడం లేదన్న ఆలోచనతోనే ఇలా ఇండ్లకు ముందుకు రావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కొత్త రేషన్ కార్డులు మంజూరైన వారు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి అడుగుతున్నారు. పై అధికారులు చెప్పే సూచనలనే మేం చెబుతున్నాం. మీ సేవ ద్వారా కొత్త కార్డులను పొందే అవకాశం ఉందని, అక్కడి నుంచే తీసుకోవాలని చెబుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజే 12 మందికి ముగ్గులు పోశాం. ఎక్కువ మంది ప్రోసీడింగ్స్ పొందినా నిర్మాణాలకు అంతగా మొగ్గు చూపడం లేదు.