జడ్చర్లటౌన్, జూన్ 11 : సాధారణంగా మారుమూల ప్రాంతంలో ఓ ఎకరం భూమి ప్రభుత్వం ధర రూ.లక్ష నుంచి రూ. 3లక్షలు దాకా ఉండేది.. కాంగ్రెస్ సర్కారు భూముల ధరలు పెంచినాక వాటి ధర రెండింతలయ్యింది. గతంలో ఉన్న ప్రభుత్వ ధరకు రెండింతలు ధరలు పెంచటంతో భూ రిజిస్ట్రేషన్ల ఫీజులు సైతం పెరిగడంతో రిజిస్ట్రేషన్ చేసుకునే వారిపై అధిక భారం పడింది. తద్వారా భూ విక్రయలావాదేవీలపై తీవ్ర ప్రభావం పడింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల తాసీల్దార్ కార్యాలయంలో గత నెల రోజుల వరకు ప్రతినిత్యం దాదాపు 30 రిజిస్ట్రేష న్లు జరిగేవి.
ఇప్పుడేమో సగానికి పైగా రిజిస్ట్రేషన్లు జరగటం లేదు. ఈనెల 6వ తేదీ నుంచి పెరిగిన భూ రిజిస్ట్రేషన్లు ఫీజులతో మొదటి రెండు, మూడు రోజుల్లో ఒక్కొక్కటి చొప్పున రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ నెల 8నుంచి 10వ తేదీల్లో కేవలం 10 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం జడ్చర్ల తాసీల్దార్ కార్యాలయంలో భూ రిజిస్ట్రేషన్లకు 11స్లాట్స్ బుకింగ్ అయినట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల కిందట తాసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల కోసం సందడిగా ఉండేది.. ఇప్పుడేమో కార్యాలయమంతా వెలవెలబోయింది.
పెద్దపెద్ద నగరాల్లో లేఅవుట్లు చేసి అమ్ముకునే వారు ఎలాగోలా అదనపు ఖర్చులను భరించి ప్లాట్ల విక్రయాలు చేసి ఆ భారాన్ని ప్రజల నుంచి వసూలు చేసుకుంటారు. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న చిన్న,సన్నకారు రైతులు భూము లు కొనుగోలు చేయాలంటే అధిక రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించడం ఆర్థికంగా ఇబ్బందులేనని పలువురు రైతులు వాపోతున్నారు. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు ఉన్న చోట్ల భూములను ఒకరినొకరూ పేరు మార్పిడిలు చేసుకోవాలంటే పెరిగిన ధరలతో రిజిస్ట్రేషన్లు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు భూముల ధరల పెంపుతో వెంచర్లపై ప్రభావం పడింది. దీంతో ప్లాట్ల కొనుగొళ్లు రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. ఇప్పటికే ప్లాట్ల అగ్రిమెంట్లు చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ ఖర్చుల భార ంతో లబోదిబోమంటున్నారు.