గద్వాల, మార్చి13 : సొంతింటి కల నెరవేర్చుకుందామనుకుంటున్న ఇందిరమ్మ లబ్ధిదారులకు అడుగడున అవాంతరాలు ఎదురవుతున్నాయి. సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకుందామని ఉన్న గుడిసెను కూల్చి వేసి నిర్మాణం చేసుకుందామంటే ఓ వైపు బిల్లులు రాక, మరో వైపు ఇసుక సరఫరా లేకపోవడంతో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఏమి చేయాలో తోచడం లేదు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ విషయంలో అధికారులు చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితికి పూర్తి విరుద్ధంగా ఉంది.
రెండు నెలలు ఇసుక సరఫరా నిలిచి పోయిన విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్తే అవునా సరఫరా బంద్ అయిందా ఇది మా శాఖ పరిధిలోకి రాదు మైనింగ్ శాఖ అధికారుల దగ్గరకి వెళ్లండంటూ మాట దాటివేస్తున్నారు. మైనింగ్ అధికారిని కలవాలంటే ఆయన ఎప్పుడు డ్యూటీకి వస్తాడో ఎప్పడు వెళ్తాడో ఎవరికీ తెలియని పరిస్థితి. ఎవరు ఫోన్ చేసిన ఆయన లిఫ్ట్ చేయడు, సమాధానం చెప్పడు దీంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.
జోగుళాంబ గద్వాల జిల్లాకు ప్రభుత్వం 7వేల ఇండ్లు మంజూరి చేసింది. ఇందులో మార్కవుట్ అయిన ఇండ్లు 5,362 కాగా వివిధ దశల్లో 4,025 ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇందులో కొన్ని ఇండ్ల నిర్మాణాలు బీఎల్ లెవల్ వరకు పూర్తికాగా మరి కొన్ని ఇండ్లు చెత్తు లెవల్ వరకు, మరి కొన్ని శ్లాబ్ పూర్తి చేసుకున్న ఇండ్లు ఉన్నాయి. వీటన్నింటికి ప్రస్తుతం ఇసుక ఎంతో అవసరం కానీ బుక్ చేసుకొని రెండు నెలలు కావస్తున్నా ఇసుక సరఫరా లేకపోవడంతో లబ్ధిదారులు ఇసుక కోసం ఎదురు చూస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం తక్కువ ధరకు ఇసుక సరఫరా చేస్తుంది. ఇందిరమ్మ ఇండ్లకు సరఫరా చేసే ఇసుక తుమ్మిళ్ల రీచ్ నుంచి సరఫరా చేసే వారు.అయితే తుంగభద్ర నదిలో నీరు ఇంకి పోవడంతో లబ్ధిదారులకు ఇసుక కష్టాలు మొదలయ్యాయి. గతంలో నది మధ్యలో నుండి ఇసుక తీసి పడవల ద్వారా ఒడ్డుకు ఇసుక తీసుకొస్తే ఇసుకను నది సమీపంలో డంప్ చేసి లబ్ధిదారులకు సరఫరా చేసే వారు.
అయితే నదిలో నీరు ఇంకి పోవడంతో ఇసుక తీయడానికి రాక పోవడంతో ఇసుక కొరత ఏర్పడింది. నీరు ఉన్న సమయంలో ఇక్కడి అధికార పార్టీనేత, ఇసుక రీచ్ టెండర్ పొందిన కాంట్రాక్టర్ మధ్య కమీషన్ పంచాయితీ వల్ల ఇసుకను అనుకున్న స్థాయిలో ఒడ్డుకు చేరవేయకపోవడంతో ప్రస్తుతం లబ్ధిదారులకు ఇసుక కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం నదిలోకి టిప్పర్లు ఇసుక తీసుకొచ్చే పరిస్థితి లేదు. గతంలో గద్వాలకు ఒక టిప్పర్ ఇసుక సరఫరా చేస్తే లబ్ధిదారుడు రూ.18,500 చెల్లించే వారు. ప్రస్తుతం ఇసుక దొరకక పోవడంతో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఒక టిప్పర్ రూ.35వేల నుంచి రూ.45 వేల వరకు విధి లేని పరిస్థితిలో లబ్ధిదారులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. మన ఇసుక -మన వాహనం ద్వారా బుకింగ్ చేసుకుందామంటే బుకింగ్ కావడం లేదు.
ఎప్పుడు సర్వర్ బిజీ వస్తుండండతో లబ్ధిదారులకు ఏమి చేయాలో తోచడం లేదు. బుక్ అయినా ట్రాక్టర్ ఇసుకకు రూ.5,870 చెల్లించాల్సి వస్తుంది. ట్రాన్స్ పోర్టు చార్జీలు పెరుగుతున్నాయి. లబ్ధిదారులు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఇసుక బుక్ చేసుకుందామని లబ్ధిదారులు వెళ్తే అక్కడి అధికారులు లబ్ధిదారులకు బుకింగ్ కావడం లేదని చెబుతున్నారు. లబ్ధిదారులకు ఇసుక విషయంలో ప్రత్యామ్నాయం చూపడంలో విఫలం కావడంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్ కలుగ చేసుకొని ఇసుక సరఫరా అయ్యేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.