వనపర్తి, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ) : యాసంగికి క్రాప్ హాలిడే ఇవ్వడం ప్రభుత్వ అసమర్థతనేనని, సమృద్ధిగా వర్షాలు.. వరదలు వచ్చిన ఈ ఏడాదిలోనే రెండో పంటకు సాగునీరు నిలుపు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లా పరిధిలోని ఆత్మకూరు మండల కేంద్రంలో మక్తల్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి నిరంజన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి మాట్లాడుతూ యాసంగిలో క్రాఫ్ హాలిడే ప్రకటించడం సిగ్గుచేటని, పాలమూరు బిడ్డను అని చెప్పుకునే సీఎం ఇం తలా వరదలు వచ్చిన సమయంలో రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నారన్నారు.
పంటలకు క్రాప్ హాలీడే కాదని, మీ ప్రభుత్వ పాలనకు హాలీడే ప్రకటించుకోవాలని నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎగువన కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ఒక టి లేదా రెండు టీఎంసీల నీటిని విడుదల చేయించుకుంటే రెండో పంటను పండించే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో పరిహాసమాడుతుందన్నారు. రైతులపాలిట అన్ని విషయాలలో రేవంత్ సర్కార్ అట్టర్‌ప్లాఫ్ అయిందని, షాప్‌లో యూరియా ఇవ్వడానికి చేతకాని ప్రభుత్వం యాప్‌లో ఇస్తామంటూ పేర్కొనడం దుర్మార్గమన్నారు. రెండేళ్లుగా కనీస అవగాహన లేకుండా అబద్ధాలను మాట్లాడటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
లక్షా 10 వేల ఎకరాల జూరాల ఆయకట్టుతోపాటు జూరాలపై ఆధారపడ్డ ఎత్తిపోతల పథకాలకు కూడా నీళ్లివ్వల్లేని దుస్థితి ఉన్నప్పుడు.. జూరాల మీదనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు తలలో మెదడు లేనట్లేనన్నారు. జూరాల ఆధారంగా ఎక్కువ సాగునీటి వినియోగం ఉన్న ప్రాజెక్టును ఏర్పాటు చేయలేని పరిస్థితిని ఎందుకు అర్థం చేసుకోవడం లేదని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు ఎత్తిపోతల ఉండగా, శ్రీశైలంలో అట్టడుగుస్థాయిలో రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని వాడుకునేందుకు చేస్తున్న ఏపీ ప్రయత్నాలపై కోర్టుకు వెళ్లి నిలుపు చేశామని, దీనిపై మాత్రం కాంగ్రెస్‌కు నోరు మెదపడం చేతకాదన్నారు.
జూరాల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి 33 ఏండ్లు పట్టిందని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కృష్ణానది 308 కిలో మీటర్లు పొడవునా పారుదల ఉందని, ఎగువ నుంచి దిగువ వరకు కట్టాల్సిన ప్రాజెక్టులను కట్టకుండా గత ఏపీ ప్రభుత్వం నిర్మూలించిండం వల్లే నేడు సాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నా మన్నారు. అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర లెప్ట్ కెనాల్లు కోల్పోయామని, 174 టీఎంసీల నీటి కెపాసిటీ ఉన్న ప్రాజెక్టులను ఉమ్మడి పాలమూరు కోల్పోయిందన్నారు. సీఎంగా అంజయ్య ఉన్నప్పుడు శంకుస్థాపన జరిగిన జూరాల 17.8 టీఎంసీలతో మొదలెట్టి 13 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యంగా చూపించి 9 టీంసీలకు మాత్రమే పరిమితం చేశారన్నారు.
ఇందులోనూ చివరకు ఆరున్నర టీఎంసీల నికర నిల్వ సామర్థ్యం ఉండేలా మాత్రమే జూరాలను పరిమితం చేశారన్నారు. లక్ష పది వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు 33ఏళ్లు పట్టిందని, 2001లో గులాబీ జెండా వచ్చిన అనంతరమే కదలిక వచ్చిందని ఆయన గుర్తు చేశారు. కర్ణాటకు చెల్లించాల్సిన ముంపు పరిహారం చెల్లించకుండా కాలయాపన చేశారని, దీనిపై కేసీఆర్ నోటి నుంచి జూరాల వ్యవహారం వెలువడిన తర్వాతే పరిహారం చెల్లించి సాగునీరిచ్చారని చెప్పారు.
జూరాల ఎడమ కాల్వ ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలంటే ప్రత్యేక కెనాల్‌ను కేఎల్ఐ ద్వారా ఏర్పాటు చేయాలని కేసీఆర్ దృష్టికి తీసుకెళితే అప్పట్లో సానుకూలంగా స్పందించి మంజూరు చేశారని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సింగోటం రిజర్వాయర్ నుంచి గోపాల్దిన్నె రిజర్వాయర్‌కు లింకు కెనాల్‌ను ఏర్పాటు చేస్తే 360 రోజులు నీరు సమృద్ధిగా ఉంటుందని తాను, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి కేసీఆర్‌కు వివిరిస్తే.. వెంటనే ఆమోదం తెలిపారన్నారు.
150 కోట్లతో ఈ లింకు కెనాల్‌ను మంజూరు చేసి టెండర్లు పూర్తి చేసి పనులు కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఈ పనుల బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటై రెండేైైళ్లెనా ఈ పనుల్లో కదలిక లేకపోగా, మంత్రి జూపల్లి అర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.