అలంపూర్ చౌరస్తా, ఏప్రిల్ 26 : ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత హామీలను మరిచి రాష్ర్టాన్ని భ్రష్టు పట్టిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్వీ ఫీజు పోరుబాట పోస్టర్‌ను ఎమ్మెల్యే విజయుడు, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురవ పల్లయ్య ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్న ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో పై తరగతులకు వెళ్లడానికి, అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి బడా కాంట్రాక్టులకు, కమిషన్ ఇచ్చే కాంట్రాక్టులకు బిల్లులు చెల్లిస్తుంది కానీ 13లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ కోసం రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నిరసనలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారం వచ్చి రెండున్నర ఏండ్లు దాటినా ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో విద్యార్థులు మానసిక క్షోభకు గురై సరైన విద్యను పొందలేకపోతున్నారన్నారు. కొన్ని యాజమాన్యాలు ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా కౌంటర్ వేయకపోవడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చని చెప్పడం వల్ల ఫీజు భారం విద్యార్థి మీద పడి ఉన్నత విద్యకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, విద్యార్థులు, ప్రజలను అనేక ఇబ్బందులు గురి చేస్తుందని రాష్ట్రం అభివృద్ధికి అమడదూరం వెళ్లిపోయిందన్నారు. కేసీఆర్ హయాంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు, ప్రజలకు అన్ని వర్గాల వారికి అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ఈనెల 27వ తేదీన కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు, 28న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లక్ష పోస్టుకార్డుల ఫిర్యాదు, 29న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల బంద్ నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, కిశోర్, గోపాల్, రఘురెడ్డి, నర్సింహ, మాధవ్, ఆనంద్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.