మూసాపేట, జనవరి 4 : పాలమూరు, వనపర్తి, నారాయణపేట మూడు జిల్లాలోని పలు మండలాలకు కల్పతరువు అయిన కర్వెన ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు మాట్లాడుతున్న మాటలను బట్టి వింటే పనులు పూర్తవుతాయా లేదా అన్నట్లుగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో ఒక సంవత్సరంలో పను లు పూర్తి అవుతాయని ప్రజలందరూ భావించారు. కానీ రెండుళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పనులు సాగుతూ.. ఆగుతూ అక్కడే నిలిచిపోవడంతో దీంతో ప్రజల ఆశలు ఆవిరి అవుతున్నాయి.
ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మం త్రి హరీశ్‌రావు ఇచ్చిన పీపీఆర్లో బీఆర్ఎస్ పాలనలోనే వరకే 96.38 శాతంకు పైగా పనులు పూర్తి అయ్యాయని ఆధారాలతో చూయిస్తూ ప్రకటించారు. కానీ 2023లో వచ్చిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాకు చెందని వ్యక్తి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఇక్కడి ప్రజలంతా త్వరగా ప్రాజెక్టుల పనులు, ప్రాజెక్టు నుంచి కాల్వల పనులు పూర్తి అవుతాయని భావించారు. కానీ పిలిచిన కాల్వల టెండర్లు రద్దు చేసినట్లు తెలుస్తున్నది. ప్రాజెక్టు పనులు కూడా నిలిచిపోయాయి. ఇప్పుడు కాకుంటే మరింత ఆలస్యం అవుతాయని రైతులంతా చెప్పుకోస్తున్నారు. ఏది ఏమైనా పనులు త్వరగా పూర్తి చేసి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.
నాటి వలస పాలకుల నిర్లక్ష్యంతో పాలమూరు పల్లెల్లో పంటలు పండే భూములన్నీ తుమ్మలు, తంగేళ్లు మొలిచాయి. సో యిలేని నేతలు, వలస పాలకుల ప్రభుత్వాలతో ఉమ్మడి పాలమూరు ప్రజలు కరువు కోరళ్లో చిక్కుకొని కొట్టుమిట్టాడారు. పట్టెడన్నం కోసం బతుకు జీవుడా అంటూ పాలమూరు ప్రజలు వలసబాట పట్టెటోళ్లు. పిల్లాపాపలను వదిలి నాటి కష్టాల పయనమై కన్నీళ్లతో వలసలు వెళ్లి గడిపిన రోజులను పాలమూరు ప్రజలకు ఎప్పటికీ మరిచిపోలేని విషాధజీవితం. పాలమూరు జిల్లాలోనే ఎక్కువ కిలో మీటర్లు కృష్ణమ్మ ప్రవహిస్తున్నా.. సాగునీటి మా ట పక్కన పెడితే కనీసం తాగునీరు కూడా అందక విలవిలలాడిన రోజులు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు సైతం పాలమూరు ప్రజలకు అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి మేలు జరిగేలా కృష్ణానదికే గండి కొట్టి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ప్రారంభించారు.
మరో వైపు గ్రామాలు కూడా అభివృద్ధికి నోచుకోక సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న పా లమూరుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదేండ్ల్లనే కనీవిని ఎరుగని రితీలో పల్లె ప్రజల బతుకులనే మార్చేసింది. నాడు వలస జిల్లాగా పేరుగాంచి పాలమూరుకు నేడు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా తదితర రాష్ర్టాల నుంచి పాలమూరుకు వలస వచ్చి వేల మందికి బతుకున్నారు. అన్నమో రామచంద్రా.. అనే స్థితి నుంచి బతుకుదెరువు చూయించే స్థాయికి ఎదిగిన ఘనత మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. కేసీఆర్ హయాంలో తెలంగాణలోనే మొదటి ప్రాజెక్టుగా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి దేవరకద్ర నియోజకరవ్గంలోనే శ్రీకారం చుట్టారు.
అందుకు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కూడా ఎంతో కృషి చేశారు. తక్కువ సామర్థ్యంతో ఉన్న ప్రాజెక్టును అనుభవజ్ఞులైన ఇంజినీర్ల సూచనల మేరకు సామర్థ్యం పెంచి ప్రాజెక్టు పనులకు 2015 జూన్ 11న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆ ప్రాజెక్టులలో ప్రధానమైనది (కర్వెన)కురుమూర్తిరాయ ప్రాజెక్టు కావడంతో అక్కడే పైలాన్ ప్రారంభించారు. కానీ ఆ రీడిజైన్ చూసిన ఆంధ్ర పాలకులు కొంతమంది పాలమూరుకు కృష్ణాజలాలు రావడం జీర్ణించుకోలేని కొన్ని పార్టీల స్థానిక నాయకులతోనే కోర్టులలో వందల సంఖ్యలో కేసులు వేయించారు. అడుగడునా కేసులు వేస్తూ పనులు ముందు సాగకుండా అడ్డుపడుతూ వచ్చిన విషయం అందిరికీ తెలుసు.
కానీ పట్టువదలని విక్రమార్కుడిలా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అలుపెరగకుండా ఎప్పటికప్పుడు వారి కుట్రలను పసిగట్టి ఒక్కోక్కటిగా కేసులు గెలుచుకుంటూ వ చ్చారు. దీంతో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం ఎప్పుడో పూర్తి కావల్సిన ప్రాజెక్టు పనులు కేసుల కారణంగా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదని చెప్పు కోస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తు న్న పాలమూరు ప్రజల జీవితకాల ఆకాంక్షను నేరవేర్చేందుకు త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు వస్తున్నట్లు సమాచారం.
కురుమూర్తిరాయ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం మొత్తం 19 టీఎంసీలు. అందుకు ప్రభుత్వం 6724 ఎకరాలు భూసేకరణ చేసినట్లు సమాచారం. భూ మిని ఇచ్చిన రైతులకు ప్రభుత్వం వెంటనే డబ్బులు కూడా చెల్లించింది. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో కేవలం నాలుగు తండాలు మాత్రమే ముంపునకు గురి అయ్యాయి. భూత్పూర్ మండలంలోని 1) బోరోనిగుట్ట తండా, 2) ఎక్కులగుట్ట తండా, 3) బట్టుపల్లి తండాలతోపాటు తిమ్మాజిపేట మండలంలోని 4) చింతగట్టు తండా మాత్రమే ముంపునకు గురయ్యాయి. వారికి కూడా నష్టపరిహారం చెల్లించడంతోపాటు పునరావసం కూడా ఏర్పాటు చేయించారు.
ప్రాజెక్టు కట్ట పొడవు సూమారు 16 కిలోమీటర్లు ఉంటుంది. ప్రాజెక్టు కట్ట నిర్మాణం భూమి భా గంలో 420 మీటర్లు ఉంటే 1300 ఫీట్ల వెడల్పుతో కట్ట పనులు ప్రారంభించారు. కట్ట ఎత్తు 61.5 మీట ర్ల ఎత్తు ఉంటుంది. పైభాగంలో కట్ట వెడల్పు మొత్తం 6 మీటర్లు ఉంటుంది. కర్వెన ప్రాజెక్టు పూర్తి అయితే మొత్తం 1,51,094 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. పరోక్షంగా మరో 50 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంతో ఆ తండాల వారి భూములు ఇచ్చి ఇండ్లు కోల్పోయి అన్నీ కోల్పో యి చేసిన త్యాగం వృథా అవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పనులతోపాటు కాల్వల పనులు పూర్తి అయితేనే వారికి నిజమైన సంతోషం కలుగుతుంది.
కురుమూర్తిరాయ రిజర్వాయర్‌తో మూడు జిల్లాలకు సాగు, తాగు నీరు అందనుంది. వట్టెం నుంచి 13వ ప్యాకేజీ కురుమూర్తిరాయ రిజర్వాయర్ వరకు 10 కిలోమీటర్ల పొడవునా గ్రావిటీ కెనాల్ ద్వారా నీరు వస్తుంది. కర్వెన నుంచి నారాయణపేట వరకు ప్రధాన కాల్వ ఉండేవిధంగా రూపొందించారు. ఆ కాల్వ 113.550 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. అందు కు రూ.387.82 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తూ, టెండర్లు కూడా అప్పట్లో ఆహ్వానించినట్లు తెలుస్తుం ది. అదేవిధంగా ప్రధాన కాల్వ నుంచి మం డలాల వారీగా సాగునీరు అందించేందుకు 55 అనుబంధ కాల్వలు కూడా ఉండేవిధంగా డిజైన్ చేశారు.
విద్యు త్ మోటర్ల వినియోగం లేకుండానే మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట జిల్లాలను అనుసంధానం చేస్తూ కాల్వను రూపకల్పన చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో దేవరకద్ర నియోజకవర్గంలో 36,339 ఎకరాలకు, మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 9,758 ఎకరాలకు, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలోని 2,512 ఎకరాలకు, నారాయణపేట జిల్లాలో మక్తల్ నియోజకవర్గంలో 66,457 ఎకరాలకు, నారాయణపేట నియోజకవర్గంకు 36,028 ఎకరాలకు సాగు, తాగు నీరు అందవిధంగా అధికారులు సర్వేలు నిర్వహించి డిజైన్ చేశారు. ఈ కాల్వల పనులు పూర్తి అయ్యి ఉంటే వాటి ద్వారా మొత్తం 13 మండలాలకు సాగునీరు పుష్కలంగా అందనుంది.
మరో వైపు ఎలాంటి విద్యుత్ వినియోగం లేకుండానే ఉద్దండాపూర్ రిజర్వాయర్‌కు 9 కిలోమీటర్ల పొడవున టన్నల్ ద్వారా సాగునీరు అందించేందుకు పనులు మొదలు పెట్టా రు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మారిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ప్రాజె క్టు పనులను పక్కన పెట్టింది. ప్రధాన కాల్వల టెండర్లు రద్దు చేసినట్లు సమాచారం. పనులపై ఎలాంటి స్పందన లేకపోవడంతో గుత్తేదారులు కూడా పనులు వదిలేశారు. దీంతో నాడు వేగంగా పనులు సాగుతూ కళకళలాడిన కర్వెన ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పనులు చేసే వారు లేక, పర్యవేక్షణ చేసే వారు లేక దాదాపుగా పూర్తి అయిన కర్వెన ప్రాజెక్టు పనులు పడావు పడినట్లు అయ్యిందని స్థానిక రైతులు వాపోతున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కురుమూర్తిరాయ రిజర్వాయర్ నిర్మాణానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రూ. 3,265 కోట్లు మంజూరు చేసింది. పనులు వేగంగా కావాలనే సంకల్పంతో ప్రభుత్వం ఆ ప్రాజెక్టు పనులను 3 భాగాలుగా విభజించారు. 13వ ప్యాకేజీ కింద 0 నుంచి 4.5 కిలోమీటర్ల పొడవు వరకు ఉండగా ఇప్పటి వరకు మొత్తం 98 శాతం పనులు పూర్తి అయినట్లు, 2వది 14వ ప్యాకేజీ కింద 4.5 కిలో మీటర్ల నుంచి 8 కిలో మీటర్ల పొడవు వరకు 90 శాతం పనులు పూర్తి అయినట్లు, అక్కడి నుంచి 15వ ఫ్యాకేజీ కింద 8 కిలో మీటర్ల నుంచి 14.125 కిలో మీటర్ల వరకు 85 శాతం పనులు పూర్తి అయినట్లు సమాచారం. అందుకు బీఆర్ఎస్ హయాంలోనే రూ.27 వేల కోట్లకు పైగా బిల్లులు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ పనులు జరిగినట్లు ఎవరు వెళ్లి పరిశీలించినా కండ్లకు కనిపిస్తుంది. కానీ కొం దరూ పనిగట్టుకొని పాలమూరు-రంగారెడ్డి పనులు ఆపాలనే లక్ష్యంతో పనులు జరగలేదని మాయ మాటలు చెబుతున్నా రు. కర్వెన ప్రాజెక్టు నుంచి ఉదండాపూర్ ప్రాజెక్టుకు నీళ్లు వెళ్లేందుకు సోరంగం ద్వారా పనులు మొదలు పెట్టారు. ఆ పనులు మాత్రం 50 శాతం మాత్రమే పూర్తి అయినట్లు సమాచారం.