వనపర్తి, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : అత్యంత పటిష్టంగా ఉన్న తెలంగాణ గురుకుల వ్యవస్థకు గడ్డురోజులు దాపురిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేశంలోనే ఇక్కడి గురుకుల వ్యవస్థకు పతాకస్థాయిలో పేరొచ్చిం ది. అయితే.. గత రెండేళ్లుగా గురుకుల విద్యాలయాల్లో అనేక ఘటనలు చోటు చేసుకోవడమే గందరగోళానికి కారణంగా చెబుతున్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, పర్యవేక్షణ లోపంతో బయటకు వెళ్లిన విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకోవడం, ఫుడ్పాయిజన్ ఘటనలు, చివరకు ఎలుకలు కరిచి దవాఖానల పాలవ్వడం వరకు చూ స్తే.. వరుస ఘటనలు గురుకులాల్లో విద్యాభ్యాసం చేస్తున్న పిల్లల తల్లితండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని గురుకులాల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు భరోసా లేకుండా పోతుంది.
పకడ్బందీగా విద్యను అందించాల్సిన ఈ వ్యవస్థ క్రమంగా గాడి తప్పుతున్నది. ఒకటి కాదు.. రెండు కాదు వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో మరోసారి వీటిపై ప్ర త్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రధానంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు మెరుగైన విద్యను అందించాలన్న లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నూతనంగా గురుకుల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఉన్నత పాఠశాలలతోపాటు ఇంటర్, డిగ్రీ కళాశాలలను ఇందులో కొనసాగిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం బోధనలతోపాటు నాణ్యమైన పౌష్టికాహారంను అందిస్తూ వచ్చిన గురుకుల వ్యవస్థ క్రమంగా బలహీనపడడం పై ఆందోళన వ్యక్తమవుతుంది. ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రభుత్వం గురుకుల వ్యవస్థ కొనసాగిస్తున్నది. జిల్లా పరిధిలో బీసీ పరంగా ఆరు గురుకులాలుంటే 2200 మంది విద్యార్థులు, అలాగే మైనార్టీలకు ఆరు గురుకులాల్లో 1600 మంది, ఎస్సీలకు 6 గురుకులాల్లో 3,840 మంది, ఎస్టీలకు 2 గురుకులాలుంటే 1360 మంది విద్యార్థులు చదువుతున్నారు.
జిల్లాలోని వివిధ గురుకులాల్లో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా ఈ విద్యాలయాల్లో గందరగోళం కనిపిస్తుంది. గత నవంబర్లో మదనాపురం ఎస్సీ గురుకులంలో ప్రవీణ్ అనే 5 తరగతి విద్యార్థి పట్టపగలు ఉదయం వేళలోనే డార్మెటరి గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బడిలో అందరూ ఉన్నప్పటికీ విద్యార్థి మానసిక పరిస్థితిని కనీసం కూడా గుర్తించలేని క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నదని అప్పట్లో తీవ్ర విమర్శలు వెలువడ్డాయి.
అలాగే 2024 జూలైలో వీపనగండ్ల ఎస్సీ గురుకులంలో(కొత్తకోటలో ఉన్నది) సంతోష్ అనే ఇంటర్ విద్యార్థి పాము కాటుకు గురై కోమాలోకి వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. గత సెప్టెంబర్లో గోపాల్పేట మండలం బుద్ధారంలోని ఎస్సీ బాలికల గురుకులంలో ఎలుకలు కరిచి పలువురు విద్యార్థులు దవాఖానల పాలయ్యారు. ఈ ఘటన సం దర్భంగా పరిశీలనకు వెళ్లిన వారంతా అక్కడి పరిస్థితులు చూసి అవాక్కయినంత పనైంది. అత్యంత దుర్గంధ భరితం గా గురుకుల నిర్వహణ ఉండటంతో అనేక విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే.. తమ గురుకులంలో నెలకొన్న సమస్యలను ఏకంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రహరీని దాటి ఓ 20 మంది విద్యార్థులు వనపర్తివైపు వస్తుండగా, గుర్తించి నిలువరించిన చిట్యాల బీసీ గురుకులం ఘటన సెప్టెంబర్ 10న చోటు చేసుకుంది. ఇక ఇటీవల కొత్తకోటలోని మైనార్టీ గురుకులం ఇంటర్ విద్యార్థి నవీన్ ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లి భీమా కాల్వలో శవమై కనిపించాడు. ఇవి కాకుండా ఫుడ్ పాయిజన్ల ఘటనలు సహితం అక్కడక్కడ చోటు చేసుకున్నాయి. ఇలా వరు సఘటనలతో జిల్లా గురుకులాల్లో ఏం జరుగుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గురుకుల వ్యవస్థలో జరుగుతున్న సంఘటనలు ప్రధానంగా పర్యవేక్షణ లోపం కారణంగానే చోటు చేసుకుంటున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కొన్నిచోట్ల ప్రిన్సిపాళ్లు స్థానికంగా ఉండకపోవడం.. పకడ్బందీగా నిర్వహణ చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బందిపై వదిలేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్నట్లు విద్యార్థుల తల్లితండ్రులు తల్లడిల్లుతున్నారు. వారు వచ్చి పోవడానికే సమయం సరిపోతుంది. ఇంత పెద్ద వ్యవస్థలో నిరంతరాయంగా పర్యవేక్షణ ఉంటే తప్పా అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఉండదు. ఎప్పుడు పోవాలి.. ఎప్పుడు తిరిగి వెళ్లాలంటూ గడియారం వైపు చూసినంత కాలం పరిస్థితులు ఇలాగే ఉంటాయన్న విమర్శలు వెలువడుతున్నాయి. అయితే సెలవు రోజుల్లో కొన్ని గురుకులాల్లో కేవలం వంట చేసే సిబ్బందికి బాధ్యతలు అప్పగించి వెళ్తున్నట్లు కూడా ఆరోపణలు లేకపోలేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పటిష్టంగా కొనసాగిన తెలంగాణ గురుకుల వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన పరుస్తున్నది. గడచిన రెండేళ్లుగా అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా వనపర్తి జిల్లాలోని గురుకుల విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనికంతటికి సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమే కారణం. గత ప్రభుత్వంలో ఇదే గురుకులాల్లో సొంత పిల్లలుగా చూసుకునే వ్యవస్థ కొనసాగింది. నేడు గురుకుల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.
– హేమంత్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు, వనపర్తి
గురుకులాల్లో వరుస మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వ వైపల్యమే కారణం. ప్రభుత్వం గురుకులాలపై శ్రద్ధ పెట్టడం లేదు. రెండేళ్లుగా మెరుగైన విద్య లేదు.. పౌష్టికాహారం అసలుకే లేదు. పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. అందువల్లే విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయి. అనేక చోట్ల పుడ్ పాయిజన్లతో విద్యార్థులు దవాఖానల పాలవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేక చొరవ తీసుకొని పేద విద్యార్థుల ప్రాణాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి.
– కృష్ణానాయక్, మాజీ ఎంపీపీ, ఖిల్లాఘణపురం