అలంపూర్, మార్చి 21 : కాంగ్రెస్ పాలనలో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. వడ్డించేటోడు మ నోడైతే బంతిలో ఏ చివరన కూర్చున్నా మన వాటా మ నకు దక్కుతుందన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాడికే ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆరోపణలు బలంగా ఉన్నాయి. గత జనవరి 26 వ తేదీన ప్రభుత్వం లాంఛనంగా ప్రజా సంక్షేమ పథకాలను మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ప్రకటించిన విషయం విధితమే.
అ ర్హులను ప్రకటించిన మొదటి రోజు గ్రామ సభలోనే అర్హుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ అప్పట్లో గం దరగోళం నెలకొన్నది. ప్రకటించిన జాబితాలో పేర్లు లేని అర్హులైన వారిని మభ్య పెట్టేందుకు అధికారులు మరోసారి దరకాస్తులు స్వీకరించారు. జాబితాలు సిద్ధం చేసి 50 రో జులు పూర్తవుతున్నా నేటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అలంపూరు మండలం గుందిమల్ల గ్రామం మొదట ఈ గ్రామాన్ని ఎంచుకుని ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారు. గ్రామంలో మొత్తం 391 ఇండ్లకు గానూ 1433 మంది జనాభా ఉన్నారు.
వారిలో 1320 మంది ఓటర్లు ఉండగా అందులో 650 మంది పురుషలు, 670 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నాలుగు పథకాల్లో అర్హుల జాబితా ప్రకారం అత్మీయ భరోసా పథకంలో 67మందిని గుర్తింగా 5 మంది దరఖాస్తులు రిజెక్ట్ కాగా 61మందిని ఫైనల్ చేశారు. రైతు భరోసా పథకంలో 745 హెక్టార్లకు గానూ 329 మంది రైతులను గుర్తించారు. రేషన్ కార్డుల కోసం 61 మంది దరఖాస్తులు చేసుకోగా వారిలో 42మందిని గుర్తించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 391 దరఖాస్తులు రాగా వారిలో 379కుటుంబాలను సర్వే చేశారు. వారిలో లిస్టు 1లో 69మంది, లిస్టు-2లో 3 , లిస్టు-3లో 14 మందిని మొత్తం 86 మందిని అర్హులుగా గుర్తించారు.
అధికారులు అధికార పార్టీకి తలొగ్గి అర్హులకు కాకుండా అనర్హులకే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రామ శివారులో ఉన్న 199 సర్వే నెంబర్లో దేవుడి మాన్యం భూముల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ముగ్గులు పోశారు. ఇంటి స్థలాలు ఉన్న వారిని గుర్తించకుండా అధికార పార్టీ వారికే లిస్టులో పేరుంది. దేవుడి మాన్యాలను కాపాడలని అధికారులను కోరాం. నిజమైన అర్హులకు న్యాయం చేయాలని కోరాం.
-రఫీ, గుందిమల్ల, అలంపూర్ మండలం
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అర్హులుగా గుర్తించిన వారికి ప్రభుత్వం కొత్తగా ఇంటి స్థలాలు ఇవ్వకుండా గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయ మాన్యం భూముల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అధికారులు మార్కింగ్ వేయిస్తున్నారు. దీంతో గ్రామస్తులు మాన్యం భూమిలో ఇండ్ల నిర్మాణాలు ఎంటీ.. అని వాటి నిలుపుదల కోసం అధికారులను సంప్రదించాం. మాన్యం భూములను కాపాడాలని వినతి పత్రాలు సమర్పించాం.
-లక్ష్మణ్నాయుడు, గుందిమల్ల, అలంపూర్ మండలం
ప్రజా సంక్షేమ పథకాల్లో వీలైనంత వరకు నిజమైన అర్హులకే న్యాయం చేస్తాం. ఎక్కడైనా అనుకోకుండా తప్పిదాలు జరిగి ఉంటే గ్రామస్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జాబితాను సరి చేసే ప్రయత్నం చేస్తాం. పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి న్యాయ పరంగా సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తాం.
– ఎంపీడీవో పద్మావతమ్మ