గద్వాల, మే 1 : పంట నష్ట పరిహారం విషయంలో రైతులకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేస్తే పంట చివరి దశలో అకాల వర్షాలు కురియడంతో రైతులకు అపార నష్టం సంభవించింది. నష్టపోయిన రైతులకు భరోసా కల్పించడంలో అటు అధికారులు, ఇటు పాలకులు విఫలమయ్యారనే చెప్పవచ్చు.
పంటనష్టం జరిగిన సమయంలో అధికారులు క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారే తప్పా పరిహారం మాత్రం అందడం లేదు. ఇటు రైతులకు యాసంగికి సంబంధించి రైతు భరోసా అందక, అటు పంట నష్టపరిహారం రాకపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో రైతన్నలు ఉన్నారు. ఈ నెలలో వరి, మామిడి, బొప్పాయి తదితర పంటలు చేతికి వచ్చే సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడడంతో సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పంట కోసం చేసిన అప్పులు ఎలా కట్టాలని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
రైతులకు చెల్లించాల్సిన పంట నష్టపరిహార విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ఈ నెల 4వ తేదీన కురిసిన ఈదురు గాలులు వర్ష బీభత్సానికి గద్వాల మండలం కొండపల్లి, శేషంపల్లి గ్రామంలో బొప్పాయి తోట చెట్లు విరిగిపడ్డాయి. సుమారు 80 ఎకరాల్లో నష్టం సంభవించింది. అదే విధంగా వరి, మిరప పంటలు దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన వరి వర్షానికి నేలకొరగడంతో రైతులు ఆందోళన చెందారు. సుమారు 200 ఎకరాల్లో అప్పుడు వరి పైరుకు నష్టం వాటిళ్లింది.
మిరప పంట కోసి కల్లాల్లో ఆరబెట్టగా అకాల వర్షానికి తడిచి ముద్దయిపోయింది. ఈ పంటలకు సంబంధించి పరిహారం రైతులకు ఇప్పటి వరకు రాలేదు. ఆదివారం ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షానికి కేటీదొడ్డి మండలం కొండాపురంలో మామిడి కాయలు అన్ని రాలిపోయాయి. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో చేతికి వచ్చిన వరి పైరు నేలవాలింది. ఆదివారం కురిసిన వర్షానికి వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం 294 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిళ్లింది.
వీటితోపాటు 35 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిందని, ఇతర పంటలు ఏడు ఎకరాల్లో నష్టం వాటిల్లిందని జిల్లాలో మొత్తం 336 ఎకరాల పంటనష్టం వాటిళ్లిందని అంచనా వేశారు. అధికారుల అంచనాకు వాస్తవ పరిస్థితికి చాలా తేడా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. కాగా వ్యవసాయశాఖ అధికారులు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు తడిసిపోయినా, ఆరు బయట ఆరబెట్టిన మిర్చి, పొ గాకు తడిసి పోతే దానిని పంట నష్టపరిహారం కింద అంచనా వేయలేదు. ఈ నెల 4వ తేదీ, 27వ తేదీల్లో కురిసిన భారీ వర్షానికి అన్ని పంటలు కలుపుకొని సుమారు 1,100 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. దీంతో అదికారుల అంచనాకు రైతులు చెప్పే నష్టానికి పోలికే లేకుండా పోయింది.
పంట నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు పంటనష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నామని చెబుతున్నారని అయితే పరిహారం మాత్రం అందడం లేదని వాపోతున్నారు. ఇటు యాసంగికి సంబంధించి రైతులకు ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వక, అటు పరిహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తుండండతో ప్రభుత్వ తీరుపై రైతులు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయిలో నష్టపరిహారాన్ని అంచనా వేసి రైతులకు త్వరగా పరిహారం అందిచేలా చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.