రేషన్ కార్డుదారులకు సంక్రాంతి నుంచి సన్నబియ్యమంటూ ఒకసారి, ఉగాది నుంచి సన్నబియ్యమంటూ మరోసారి, లేదులేదు ఫలానా రోజు నుంచి అంటూ ఇంకోసారి రాష్ట్ర మంత్రులు ప్రకటనలమీద ప్రకటనలు గుప్పించారు. గత నవంబర్‌లో మొదలైన ఈ ప్రకటనలు, ఉన్నతాధికారుల మాటలు నేటికీ అంతులేని కథలా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ కార్డుదారులు మాత్రం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ‘సన్నబియ్యం సంగతి కాదు.. ముందు ఉన్న బియ్యాన్ని సమయానికి ఇవ్వండి’ అంటూ డిమాండ్ చేస్తున్నారు.
సన్నబియ్యం ప్రకటనలను ముందుపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా అందజేసే రేషన్ బియ్యాన్ని ఇంత వరకూ చౌక దుకాణాలను సరఫరా చేయలేదు. ఖమ్మం జిల్లాకు చేరాల్సిన కోటా ఇప్పటికీ చేరనేలేదు. మండలస్థాయి గోడౌన్లలో బియ్యం లేకపోవడంతో బియ్యం సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. మూడు నెలలుగా ఇదే తంతు జరుగుతున్నా, కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నా, డీలర్లు సమస్యలను ఎదుర్కొంటున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ప్రతి నెలా 1వ తేదీనే పంపాల్సిన బియ్యాన్ని 7వ తేదీ వచ్చినా సరఫరా చేయలేదు. అసలు చౌక ధరల దుకాణాలకే బియ్యం రాకపోవడంతో రేషన్ డీలర్లు కూడా చేతులెత్తుతున్నారు. -ఖమ్మం, మార్చి 6
ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీకి 8 మండలస్థాయి గోడౌన్లు ఉన్నాయి. ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, నేలకొండపల్లి, వైరా, మధిర, సత్తుపల్లి, ఏన్కూరు, కల్లూరుల్లోని ఈ స్టాక్ పాయింట్ల నుంచి ప్రతి నెలా జిల్లాలో ఉన్న 748 రేషన్ షాపులకు బియ్యం సరఫరా అవుతాయి. షాపులకు వచ్చిన వెంటనే కార్డుదారులకు డీలర్లు పంపిణీ చేస్తారు. సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కార్డుదారులకు బియ్యం పంపిణీ జరుగుతుంది. 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మండలస్థాయి స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా కావాలి. కానీ గడిచిన మూడు నెలలుగా ఈ సరఫరాలో జాప్యం జరుగుతున్నది. ఫలితంగా బియ్యం పంపిణీ ఆలస్యమవుతున్నది.
తద్వారా కార్డుదారులకు ఇబ్బంది కలుగుతున్నది. అయితే, ఈ మార్చి నెలకు సంబంధించి ఆయా రేషన్ షాపుల్లో నిల్వలు పోను 6,434 మెట్రక్ టన్నుల బియ్యం సరఫరాల కావాల్సి ఉంది. కానీ గురువారం నాటికి జిల్లాలో 500 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా కావడం గమనార్హం. అంటే, ఇంకా 5,934 మెట్రిక్ టన్నులు సరఫరా కావాలి. గత నెలలో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లలో స్టాక్ ఉన్న 359 మెట్రిక్ టన్నులు కొత్తగా వచ్చిన బియ్యం కలిపి కొన్ని రేషన్ షాపులకు మాత్రమే సరఫరా చేశారు. జిల్లాలోని ఎఫ్‌సీఐ గోడౌన్లలోగానీ, వేర్‌హౌజ్ గోడౌన్లలోగానీ బియ్యం నిల్వలు లేవు. దీంతో రేషన్ షాపులకు సరఫరా జరగలేదు. అయితే, ఫౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు మాత్రం మార్చి నెలకు సంబంధించిన 6,434 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నల్లగొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుంచి పంపిస్తామని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఇంతవరకు గింజ కూడా జిల్లాకు రాలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ బియ్యం సక్రమంగా అందడం లేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి నెలా 1న బియ్యం పంపిణీ మొదలుపెట్టి 15 నాటికి పూర్తి చేసేవారు. ఇప్పటి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అలా ఇవ్వలేకపోతున్నది.
-నందిగామ గోవిందమ్మ, శ్రీనివాసనగర్, ఖమ్మం
సన్నబియ్యమిస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి అనేక మాటలు చెప్పారు. ఇప్పుడు దొడ్డు బియ్యమే సమయానికి ఇవ్వడం లేదు. ఇక సన్నిబియ్యం ఇస్తారా? కేసీఆర్ ఉన్నప్పుడే కచ్చితంగా 1వ తేదీన రేషన్ బియ్యం అందేవి.
-గుమ్ముల ఉమారాణి, ప్రకాశ్‌నగర్, ఖమ్మం
మార్చి నెల కేటాయింపు ఆలస్యమైంది. గత శనివారం నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించాం. పది రోజల్లోపు రేషన్ బియ్యాన్ని చౌక దుకాణాలకు సరఫరా చేస్తాం. ఆ వెంటనే కార్డుదారులకు పంపిణీ చేస్తాం. ఇందుకోసం గడువు పెంచుతాం.
-శ్రీలత, డీసీఎస్వో, ఖమ్మం