గద్వాల : తరుగు పేరుతో ధాన్యం పండించిన రైతులను సెంటర్ల నిర్వాహకులతో కలిసి కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం దోపిడి చేస్తుందని బీఆర్ఎస్వీ నాయకులు (BRSV leaders ) కురువపల్లయ్య ( Pallaiah ) ఆరోపించారు. సోమవారం రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. జిల్లాలో 69 ధాన్యం కొనుగోలు కేంద్రాలు( Paddy Centres ) ఏర్పాటు చేశారని, ప్రతి సెంటర్లో కాంగ్రెస్ నాయకులు నిర్వాహకులతో కుమ్మకై రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
తరుగు పేరుతో క్వింటాల్‌కు రెండున్నర కేజీలు తరుగు తీస్తూ రైతులను నష్టపరుస్తారని విమర్శించారు. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదని వాపోయారు. వాస్తవంగా కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు బస్తాకు 40 కేజీలు బరువు మాత్రమే తూకం వేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలోని కొనుగోలు సెంటర్లకు కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల నుంచి కొంతమంది దళారులు ధాన్యం తెచ్చి సెంటర్ల నిర్వాహకులతో కుమ్మకై అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.
ధాన్యం అమ్మకాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ సంతోష్‌కు అందజేశారు. ఈ ఆందోళనలో నాయకులు వెంకట రాములు ,మగ్బూల్, శేఖర్, ఆంజనేయులు ,దస్తగిరి రాఘవ, గోవిందు తదితరులు పాల్గొన్నారు.