వనపర్తి, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ) : మొదట్లో ఆయిల్ పాం సాగుబడులకు ఉత్సాహం కనబర్చిన రైతులు ప్రస్తుతం నిరాధారణకు గురువుతున్నారు. ఏడాదిలోపు స్థానికంగా ఆయిల్‌పాం కర్మాగారం ఏర్పాటు చేయిస్తామని స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించి శంకుస్థాపన చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. వెరసి జిల్లాలోని ఆయిల్ పాం రైతుల్లో గందర గోళం నెలకొన్నది. వనపర్తి జిల్లాలో ఆయిల్ పాం సాగుబడికి రైతులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. గత రెండేళ్ల కిందటి వరకు ఆయిల్ పాం తోటలను విస్తారంగా సాగు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్ పాం రైతులపై ప్రత్యేక శ్రద్ధతో సబ్సిడీలిచ్చి ప్రోత్సహించింది. ఈ క్రమంలోనే చిన్న జిల్లా అయినా వేలాది ఎకరాల్లో ఆయిల్ పాం తోటలు పెరగడానికి దారులు పడ్డాయి. దాదాపు 5,776 ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేశారు. అప్పట్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డిలు సహితం భారీ స్థాయిలో ఆయిల్ పాం మొక్కలు నాటడం కూడా రైతులు ముందుకు రావడానికి మార్గదర్శకమైంది. ఇటు ప్రభుత్వం.. అటు నాయకులు అప్పట్లో ప్రత్యేక చొరవ తీసుకోవడంతో రైతులు ఆసక్తి కనబరిచారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన అనంతరం ఆయిల్ పాం రైతులు డీలా పడ్డారు. ప్రతి ఏటా లక్ష్యం నిర్ణయించడమే తప్పా.. వాటిని అందుకునే పరిస్థితులు లేవు. ఇటు ప్రభుత్వానికి.. అటు ప్రజా ప్రతినిధులకు ఆయిల్ పాంపై ప్రాధాన్యత లేనందునా రైతులు ఆసక్తి చూపడం లేదు. ఆయిల్ పాంకు దేశంలో అత్యంత ప్రాధాన్యత ఉన్నది. దేశ ప్రజల అవసరాలకు తగ్గట్టు పాం ఆయిల్ అందుబాటులో లేదు.
కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి ఇతర దేశాల నుంచి పాం ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోనూ రైతులను ప్రోత్సహించి సాగు బడులు పెంచాలన్న లక్ష్యంతో ప్రారంభంలో బాగా సాగు చేసినా ఇటీవలి కాలంలో మాత్రం అమాంతం సాగుబడి లక్ష్యం అల్లంత దూరానికి నెట్టబడింది. ఈ రెండేళ్లలో 6,300 ఎకరాలు లక్ష్యంగా ఉంటే, కేవలం 900 ఎకరాలలోపు మాత్రమే సాగు కావడం ఉద్యానశాఖ పనితీరుకు దర్పణం పడుతున్నది.
జిల్లాలో ఆయిల్ పాం రైతుల ఉత్సాహాన్ని చూసి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రైవేట్‌గా ఆయిల్ పాం కర్మాగారం ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. గత ప్రభుత్వంలోనే అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఈ కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వం మారడంతో మధ్యలో నిర్మాణ ప్రయత్నం నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అదే కర్మాగారానికి మళ్లీ కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి చౌరస్తాలోనే మరోసారి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడి న మంత్రి ఏడాదిలోపు కర్మాగారాన్ని వినియోగంలోకి తెచ్చేలా చేస్తామని చెప్పారు. అయితే పనులు మాత్రం ఊహించినంతగా లేకపోగా నత్తనడకన సాగుతున్నాయి.
మరో రెండేైళ్లెనా పూర్తి అయ్యేలా లేదు. జిల్లాలో ప్రారంభంలో నాటిన ఆయిల్ పాం తోటలన్నీ కాపునకు వచ్చాయి. మూడేళ్లకు పైగా గెలలు తెంపుతున్నారు. ఇక్కడి నుంచి ఖమ్మం జిల్లాకు తరలించారు. ఇటీవల నూతనంగా సిద్దిపేట ప్రాంతంలో ప్రభుత్వ కర్మాగారం ప్రారంభం కావడంతో ఇక అక్కడికే గెలలను తరలిస్తారని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆయిల్ పాం తోటల విస్తీర్ణం ఇప్పటికే దాదాపు 25 వేల ఎకరాల్లో సాగైనట్లు అంచనా ఉన్నది. ఈ క్రమంలో సంకిరెడ్డిపల్లి చౌరస్తాలో ప్రీయూనిక్ సంస్థ ఆద్వర్యంలో నిర్మాణం జరుగుతున్న కర్మాగారాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయడం ద్వారా రైతులు మరింత ఉత్సాహంగా ముందుకు వచ్చే అవకాశం ఉన్నది.
జిల్లాలోని రైతులకు సబ్సిడీతో ఆయిల్ పాం మొక్కలను ప్రభుత్వం అందిస్తున్నది. ఫ్రీ యూనిక్ అనే సంస్థకు మొక్కల పెంపకం.. అలాగే రైతుల నుంచి వచ్చిన ఆయిల్ పాం గెలలను తీసుకోవడం కూడా ఇదే సంస్థకు అప్పగించారు. రైతులకు అనువుగా జిల్లా పరిధిలోని పలుచోట్ల సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల దిగుబడి వచ్చిన గెలలను డంపింగ్ చేసుకుంటున్నారు. రైతులను నష్టాలు లేని సాగువైపు మళ్లించాలని ప్రయత్నించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సఫలమైంది. ఇందుకు వనపర్తి మండల పరిధిలోని కడుకుంట్లలో ఆయిల్ పాం నర్సరీని ఏర్పాటు చేశారు. ఒక మొక్క ఖరీదు రూ.196 ఉంటే.. వీటిలో రూ.176 సబ్సిడీతో కేవలం 20శాతం రైతులు భరించేలా పంపిణీ చేస్తున్నారు.
వీటితోపాటు ఆసక్తి ఉన్న రైతులకు డ్రిప్ సిస్టంను కూడా అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు గతంలో వందశాతం సబ్సిడీ ఉండగా, ఈ ఏడాదిలో 90శాతం సబ్సిడీ, 10శాతం రైతులు భరించేలా మార్పు చేశారు. ఇతర బీసీ, ఓసీ రైతులకు 80శాతం సబ్సిడీతో డ్రిప్ సిస్టంలను అందిస్తున్నారు. 5 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు 70శాతం సబ్సిడీతో ఇస్తున్నారు. ఇలా సబ్సిడీలున్నందునా అన్నదాతలు సాగుబడులకు మొగ్గు చూపుతున్నారు. సుదీర్గకాలంపాటు దిగుబడినిచ్చే ఆయిల్ పాంపై అధికారుల్లో చిత్తశుద్ధ్ది లోపించడంతో లక్ష్యాలను సాధించడం లేదు. అవగాహన పెంచేలా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాతలను సాగు వైపు మళ్లించాల్సిన యంత్రాంగం మొక్కుబడిగా వ్యవహరించడంతో జిల్లాలోని వ్యవస్థ డీలా పడింది.
ఆయిల్ పాం తోటలను పెంచేందుకు రైతులు ముం దుకు రావాలి. ప్రభుత్వం సబ్సిడీతో మొక్కల పంపిణీ చేస్తుంది. ఇతర తోటల కంటే ఆయిల్ పాం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక్కసారి నాటితే 30 ఏళ్ల వరకు పంట దిగుబడి ఉం టుంది. మూడేళ్ల కిందట నాటిన రైతులు పంటను అందుకుంటున్నారు. ఎంత మంది రైతులు ముందుకు వచ్చినా మొక్కల పంపిణీకి ఇబ్బంది లేదు.
– విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి
ఇతర పంటల కంటే ఆ యిల్ పాం సాగు బాగుంది. ఎండ, వాన, చలిల బాధ ఉండదు. అన్నింటినీ తట్టుకుంటుంది. జంతువుల బాధ లు లేవు. 5 ఎకరాల్లో నాటుకున్నా. 30 నెలలకు గెలలు మొదలైంది. ఇప్పటి వరకు 14 టన్నులు అమ్మినా.. వీపనగండ్లలోనే నిలువ సెంటర్ ఏర్పాటైంది. ఈ మద్య ధర పెంచా రు ఒక టన్నుకు రూ.23,200 ఇస్తున్నారు. 20 రోజుల్లోపు డబ్బులు వేస్తున్నారు. కూలీల బెడద తక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయిల్ పాం కు మించింది లేదు.
-పల్లా ధర్మారెడ్డి, రైతు, వీపనగండ్ల
మాకున్న పొలంలో 12 ఎకరాలు ఆయిల్ పాం పెట్టి మూడేళ్లవుతుంది. ఇప్పుడిప్పుడే గెలలు మొదలైనవి. 2 టన్నులు అమ్మాను. ఆత్మకూరులో సెంట ర్ ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌ఫోర్ట్ ఇబ్బంది కూడా లేదు. కంపెనీ యజమాన్యం బాధ్యత తీసుకుంటుంది. కూలీలు, తెగుళ్లు, జంతువులు, దొంగల బాధలు ఏమీ ఉండవు. ఇతర పంటల సాగులో చూపిన శ్రద్ధలో 50శాతం చూస్తే సరిపోతుంది. ఆయిల్ పాం రైతులకు లాభదాయక పంటగా కనిపిస్తుంది.
– కార్తీక్ రెడ్డి, రైతు, అమరచింత