నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 13 : ఆయన పదవీలో లేడు కానీ అన్ని తానై నడిపిస్తాడు. ఆయన మాటకే ఇక్కడి అధికారులు వత్తాసు పలుకుతారు. ఆయన మాట వినని అధికారులను బదిలీ చేయించడం, లేదా వారితో బేరాలు కుదిరించుకొని ముడుపులు తీసుకోవడం ఆ నేత నైజం. రా్రష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నడిగడ్డ కాంగ్రెస్ నేతకు కాసుల పంట కురుస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జిల్లాలో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులను రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయించాడు. 60 శాతం మాత్రమే బదిలీలు చేయాల్సి ఉండగా తన పలుకుబడితో ఆ నేత మొత్తం 100 శాతం బదిలీలు చేయించినట్లు తెలిసింది. పంచాయతీ కార్యదర్శులు ఆందోళన సిద్ధమవుతున్న తరుణంలో కొంత మందిని వారు కోరుకున్న స్థానాలకు బదిలీ చేశారు. అప్పుడు ఆ నేత తీరును పంచాయతీ కార్యదర్శులు దుయ్యబట్టారు. అయితే ఆ నేత తీరును ఇదేమని ప్రశ్నించే వారే కరువయ్యారు.
పదవులు, బదిలీలు, పోస్టింగ్‌ల్లో పెద్ద మొత్తంలో ఆ నేత చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారతిమాల రోడ్డుకు తనగల గట్టు నుంచి ఎర్రమట్టిని తరలిస్తే తన అనుచరుల ద్వారా మట్టి తరలింపును అడ్డుకొని అప్పుడు ఆ నడిగడ్డ నేత వార్తల్కోకి ఎక్కాడు అయినా ఆ నేత తీరు మారలేదు. మళ్లీ నడిగడ్డలో తాను గెలుస్తానని అనుకున్నాడో.. లేక ఓడిపోతా అనుకున్నాడో ఏమో.. ఇప్పుడు అధికారం ఉంది కదా అని అందినకాడికి దండుకుందాం అనుకున్నాడో ఏమో.. ఆ అధికార పార్టీ నేత తనపై ఎన్ని అభియోగాలు, ఆరోపణలు వచ్చినా అవేమీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకొని వెళ్తూ నడిగడ్డ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాడు. కొంత మంది జిల్లా స్థాయి అధికారులను తన పలుకు బడితో జిల్లాకు కేటాయింప చేసుకొని వారి ద్వారా తన వ్యవహారాలు యథేచ్ఛగా నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టకపోతే కార్యకర్తలు సైతం ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు.
నడిగడ్డలోని అధికార పార్టీకి చెందిన ఆ నేత అనుమతి లేనిదే ఏది జరగదు. జిల్లాకు పోస్టింగ్ పొందిన ఇద్దరు జిల్లా అధికారులు జిల్లాకు బదిలీపై రాగానే ఆయన దర్శనం చేసుకున్నారంటే నడిగడ్డలో ఆయన హవా ఎంత ఉందో తెలుస్తుంది. కొంతమంది జిల్లా అధికారులను అడ్డం పెట్టుకొని తన కార్యకలాపాలు కొనసాగిస్తుండడంతో మిగతా జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నడిగడ్డలో ఏ పని జరగాలన్నా ముందు ఆ అధికార పార్టీ నేతకు ముడపులు ముట్టాల్సిందే. లేదంటే ఆయన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. లేదంటే తన అనుచరుల ద్వారా ఆ పనులకు అడ్డంకులు కల్పించడం ఆయన నైజం. దీంతో నడిగడ్డలో ఏదైనా పని చేయాలంటే ఆ నేత తీరును చూసి భయపడుతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఆయన మార్క్ కనిపిస్తుంది. ఇలా నడిగడ్డలో ఏ పని జరిగినా ఆ అధికార పార్టీ నేతలకు తెలిసి జరగాలి లేదంటే.. ఏ పనులైనా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందగా ఆగిపోవాల్సిందే.
అందుకు ఉదాహరణ తుమ్మిళ రీచ్ దగ్గర నుంచి వచ్చే ఇసుక రవాణాను అడ్డుకోవడం. నడిగడ్డకు చెందిన అధికార పార్టీ నేత తుమ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక తరలించాలంటే తనకు ముడుపులు ముట్టజెప్పాలని లేనిపక్షంలో ఇసుక సరఫరా చేయనీయమని తన అనుచరుల ద్వారా గత నాలుగు రోజులుగా టిప్పర్లు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఆ నేత డిమాండ్‌ను అంగీకరించని సదరు కాంట్రాక్టర్ నేరుగా ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ పంచాయతీ సీఎం పేషీకి చేరగా సీఎంవో వర్గాలు ఆరా తీసినట్లు తెలిసింది. అయినా ఆ నేత తీరులో మార్పురావడం లేదు. తనకు ఇచ్చే ముడుపుల విషయంలో సదరు కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో రోడ్లు దెబ్బతింటున్నాయని తన అనుచరుల ద్వారా ఇసుక వాహనాలను వెళ్లనీయకుండా బెదిరింపులకు పాల్పడ్డట్టు సమాచారం. ప్రజా అవసరాలకు ఇసుక సరఫరా చేసే క్రమంలో రోడ్డు దెబ్బ తిం టాయి వాటిని ప్రభుత్వం మర మ్మతులు చేస్తుంది.
కానీ ఆ అధికార పార్టీనేతకు, అతని అనుచరులకు రోడ్లపై అంత ప్రేమ ఎందుకు పుట్టు కొచ్చిందో అర్థం కావడం లేదు. అంతకు ముందు తన అనుచరులు ఇసుక రవాణా చేస్తే దెబ్బతినని రోడ్లు, ఇప్పుడు కాంట్రాక్టర్ ఇసుక రవాణా చేస్తే రోడ్లు దెబ్బతింటాయని చెప్పడం బట్టి చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులు చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే పాపం.. అన్న రీతిలో ఆ నేత తీరు ఉండడం విడ్డూరంగా ఉందని పలువురు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా నడిగడ్డ అధికార పార్టీ నేత తన తీరు మార్చుకోక పోతే నడిగడ్డ అభివృద్ధి విరోధకుడిగా మిగిలి పోవడంతో పాటు వారి ఆగ్రహానికి గురయ్యే అవకాశం లేక పోలేదు. ఆ నేత తీరు వల్ల ఎవరు కూడా ఇక్కడి అభివృద్ధి పనులు చేయడానికి ముందుకు రావడం లేదని తెలుస్తుంది. నడిగడ్డ అధికార పార్టీ నేత తన తీరు మార్చుకొని జిల్లా అభివృద్ధికి సహకరించాలని నడిగడ్డ ప్రజలు కోరుతున్నారు.