మహబూబ్‌నగర్ నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామ ంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి (85) శుక్రవారం సాయంత్రం కల్వకుర్తిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం ఐదు గంట ల సమయంలో గమనించిన కొందరు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ దవాఖానకి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఉదయం 7గంటల ప్రాంతంలో ఇంట్లోనే పురుగుల మందు తాగుతూ ఉండగా కుటుంబ సభ్యులు గమనించి అడ్డుకున్నారు. అతని జేబులో ఉన్న సూసైడ్ నోట్‌ను చూసారు. ఈ విషయం గ్రామంలో దావనంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న వంగూరు పోలీసులు హుటాహుటినా ఇంటికి చేరుకొని బలవంతంగా కుటుంబ సభ్యుల నుంచి సూసైడ్‌నోట్‌ను తీసుకెళ్లి మాయం చేశారు.
కొంతమంది ఫోన్లో సూసైడ్ నోట్‌ను ఫొటో తీసుకోవడంతో సోషల్ మీడియాలో ఇది చక్కర్లు కొడుతోంది. తన మరణానికి కారణం సీఎం ఏనుముల రేవంత్‌రెడ్డి బ్రదర్స్ కారణమంటూ పేర్కొన్నారు. మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం సృష్టిస్తోంది. ఇదే గ్రామంలో 6 నెలల కిందట గురువారెడ్డి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పట్లో సీఎం కుటుంబ సభ్యులపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడడంతో కొండారెడ్డిపల్లిలో అసలు ఏం జరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన సాయిరెడ్డి కొండారెడ్డిపల్లి గ్రామానికి రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. గ్రామ అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలో ఆ పార్టీకి చెందిన ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడడం.. సాక్షాత్తు సీఎం కుటుంబంపై ఆరోపణలు చేస్తూ మరణవాంగ్ములం ఇవ్వడం తీవ్ర సంచలనానికి దారితీసింది.
కొండారెడ్డిపల్లిలో తన ఇంటికి అడ్డంగా పశువైద్యశాల ప్రహరీ కడుతుండడంతో సాయి రెడ్డి అడ్డుకున్నారు. జేసీబీకి అడ్డంగా పడుకున్నారు. అక్కడే ఉన్న పంచాయతీ సిబ్బంది, వంగూరు పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. బలవంతంగా బెదిరించి ఆయ న్ను ఇంటికి పంపించారు. రెండుసార్లు గ్రామానికి సర్పంచ్‌గా ఉండి ఇంటికి గోడ అడ్డం కడుతున్న ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నానంటూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దౌర్జన్యంగా జేసీబీ తీసుకొచ్చి పునాదులు తవ్వారు.
ప్రహరీని కండ్లముందే కడుతుండడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 7గంటలకు లేచి తలుపులు మూసుకొని పురుగుల మందు తాగుతుండగా కుటుంబ సభ్యులు గమనించి తలుపులు బద్ధలు కొట్టి అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులంతా సముదాయించారు. అనంతరం కల్వకుర్తికి వెళ్లి వస్తానంటూ ఇంటి నుంచి వచ్చారు. మధ్యాహ్నం మూ డు గంటల సమయంలో పెస్టిసైడ్ షాపులో పురు గుల మందు కావాలని అడుగగా అనుమానం వచ్చిన వ్యాపారి ఇవ్వలేదు.
ఓ మెడికల్ షాప్‌కు వెళ్లి నిద్రమాత్రలు కావాలని అడిగారు. చివరకు ఓ దుకాణంలో పురుగుల మందు డబ్బా తీసుకొని బస్టాండ్ సమీపంలోని రఘుపతిపేట రహదారిలోని కల్లు కాంపౌండ్ పక్కన ఖాళీ ప్రదేశంలో కూర్చున్నాడు. అక్కడే బండరాయిపై కూర్చొని పురుగుల మందు తాగి కుప్పకూలారు. అటుగా వెళ్తున్న కొందరు కింద పడి ఉండటానికి గమనించి ఎవరని ఆరా తీయగా కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ అని చెప్పడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన సాయిరెడ్డిని ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
కొండారెడ్డిపల్లిలో గురువారం మాజీ సర్పంచ్‌కు ప్రైవేట్ సైన్యానికి ఘర్షణ జరిగింది. గోడ కట్ట వద్దని ఎంత అడ్డుకున్నా దౌర్జన్యంగా కట్టడంతో తీవ్ర ఆవేదనకు గురై ఇంటికి వెళ్లి సూసైడ్ నోట్ రాశారు. మరణ వాంగ్ములమంటూ మొదలుపెట్టి.. సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి బ్రదర్స్ తనపై కక్ష కట్టారని.. ఆ నోట్లో రాశారు. గోడ కట్టవద్దని చెబుతున్నప్పటికీ కడుతుండడంతో ఇక బతికి ఏం లాభం అని చనిపోతున్నానని నేను దేవుని పార్టీ.. ఆ దేవుండ్లకు నా చావు అంకితం.. అంటూ ముగించారు.
కాగా శుక్రవారం ఉదయమే మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం గ్రామంలో పాకింది. అలాగే సూసైడ్‌నోట్ రాసి పెట్టుకున్నాడని చెప్పడంతో కలకలం రేగింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిమిషాల్లోనే వంగూరు పోలీసులు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి బలవంతంగా మాజీ సర్పంచ్ రాసుకున్న సూసైడ్ నోటును తీసుకెళ్లిపోయారు. ఇక వివాదం సద్దుమణిగింది అనుకున్న టైంలో కల్వకుర్తికి చేరుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అప్పటికే కొంతమంది ఈ సూసైడ్ నోట్ సెల్ ఫోన్లో ఫొటో తీసుకోవడంతో సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లికి చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సొంత గ్రామానికి చెందిన వ్యక్తి సీఎం కావడంతో తమ బతుకులు మారుతాయి అని ఊహించినా తలకిందులైంది. ఆరు నెలల కిందట ఇదే రకంగా అప్పుల విషయంలో గురువారెడ్డి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
దీన్ని కూడా పోలీసులు బయటికి రాకుండా కప్పిపుచ్చారు. అప్పట్లో సీఎం కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తమయ్యా యి. ఇప్పుడు ఏకంగా మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడడం.. తనపై సీఎం బ్రదర్స్ కక్ష కట్టారంటూ మరణవాంగ్ములం రాయడం సంచలనం కలిగిస్తున్నది. కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు బాధ్యత వహించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
నిన్నటి సంధి మా ఇంటికి పోకుండా గోడ అడ్డం పెట్టనికే ఇబ్బంది పెడుతుంటే.. చాలా కలత చెందాడు. ఊర్లో గ్రామపంచాయతీ వాళ్లు వంగూరు పోలీసులను తీసుకొచ్చి ఆయనను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా కొట్టారు.. సచ్చే వరకు తీసుకొచ్చారు. ఇందు లో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు.. సూసైడ్ నోట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఏమో.. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు..
– మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ కొడుకు, కొండారెడ్డిపల్లి, వంగూరు మండలం