మహబూబ్‌నగర్ కలెక్టరేట్, డిసెంబర్ 25 ; మాటలు కోటలు దాటుతాయి.. కానీ చేతలు మాత్రం గడప దాటవు.. విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు చూస్తే ఈ నానుడే గుర్తొస్తుంది. ప్రభుత్వ వర్సిటీల్లో కాంట్రాక్టు అధ్యాపకులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చింది. ఆ తర్వాత చెప్పిన మాటకు చేతలకూ ఎక్కడా పొంతన కనిపించడం లేదు. దీంతో ఒప్పంద అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు.
దగాపడ్డ ‘వర్సిటీ ఒప్పంద అధ్యాపకులు’
ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఒప్పంద అధ్యాపకులు దగాపడ్డారు. ఉన్నత విద్య, విద్యార్థి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తూ వారు మాత్రం చీకట్లో మగ్గుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని పే ర్కొంది. కానీ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో దిక్కుతోచని దుస్థితిలో ఒప్పంద అధ్యాపకులు కొట్టుమిట్టాడు తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 ప్రభుత్వ విశ్వ విద్యాలయాల్లో 1,445 మంది ఒప్పంద అధ్యాపకులు విధులు నిర్వర్తిస్తున్నారు. చాలా వరకు వర్సిటీల్లో చేతులమీద లెక్కించే స్థాయిలో ప్రభుత్వ ఆచార్యులను మినహాయిస్తే మిగతా బోధన సిబ్బంది అంతా ఒప్పంద ఉద్యోగులే. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది దాటినా.. శాశ్వత ఉద్యోగులుగా గుర్తింపు ప్రక్రియలో మాత్రం పురోగతి లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆందోళనకు సిద్ధం
క్రమబద్ధీకరణ చేయాలంటూ ఒప్పంద అధ్యాపకులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యా పకులు.. ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేని ఫెస్టోలో తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తా మంటూ ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 13న ప్రజాభవన్‌లో ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేసేందుకు సుమారు 300 మందికిపైగా అధ్యాపకులు తరలి వెళ్లారు. ఈ నేప థ్యంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వారితో చర్చలు జరిపి త్వరలో ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హామీలన్నీ నీటి మూటలుగానే మారుతుండటం, ప్రజా పాలన ప్రభు త్వం కొలువుదీరి ఏడాది కాలం పూర్తయి విజయో త్సవాలు జరుపుకొన్నా.. తమను పట్టించు కోవడం లేదంటూ కాంట్రాక్టు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రా క్ట్ లెక్చరర్లను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వర్సిటీల్లో బోధనకు తిప్పలు
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 60 శాతానికిపైగా పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఒప్పంద, అతిథి అధ్యా పకులే దిక్కయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 3,259 వర్సిటీ అధ్యాపక పోస్టులు ఉండగా.. వాటిలో 60 శాతాని కిపైగా ఖాళీగా ఉన్నాయి. పీయూలో 95 మందికి కేవలం 20 మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ చేస్తున్నా.. కొత్త నియామకాలు చేపట్టడం లేదు. ఒప్పంద అధ్యా పకులతోనే నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 105 మంది విధులు నిర్వర్తిస్తున్నారు.
యూజీసీ నిబంధనలు ఎక్కడ?
విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిబంధనల ప్రకారం ఒక్కో వి భాగానికి కనీసం ఒక అచార్యుడు, ఇద్దరు అసోసియేట్ ఆచార్యు లు, నలుగురు సహాయ ఆచార్యులు ఉండాలి. ప్రస్తు తం రాష్ట్రంలోని అన్ని వర్సిటీ ల్లోనూ ఈ స్థాయిలో అధ్యాప కులు లేరు. 20 మంది విద్యార్థు లకు అధ్యాపకుడు ఉండాలి. పాఠాలు బోధించేందుకు రెగ్యూలర్ అధ్యాపకులు ఉండాలనే నిబంధన అమలు కావడం లేదు. న్యాక్ గుర్తింపు లభించాలంటే మొత్తం పోస్టుల్లో 75 శాతం భర్తీ అయి ఉండాలి. దీని ఆధారంగా కేంద్ర సంస్థలు నిధులిస్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించాల్సి ఉన్నది.
అరకొర వేతనాలతో అవస్థలు
వర్సిటీల ప్రారంభం నుంచి అరకొర జీతాలతో పనిచేస్తున్నాం.. బోధనతో పాటు ఎన్నో అదనపు డ్యూటీలు చేస్తున్నాం. అనేక పర్యాయాలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చట్ట సభల్లో ప్రస్తావించినా.. మేధావులు, విద్యావేత్తలు వివిధ వేదికలపై చెబుతున్నా.. మా సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి పరిష్కారానికి కృషి చేయాలి.
– ఏ.సుదర్శన్‌రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, పీయూ
ఉద్యోగ భద్రత కరువు
విశ్వవిద్యాలయాలు భావిభారత పౌరులను ఉన్నతంగా తీర్చిదిద్దే కేంద్రాలు. సమాజంలోని అభివృద్ధికర మార్పులకు పురుడు పోసే ప్రదేశాలు. వీటిలో ఎంతో విశిష్టమైన గురుతర బాధ్యతను నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు ఏండ్ల తరబడి సేవలందిస్తూ భద్రత లేని ఉద్యోగం, చాలీచాలని జీతం. ప్రభుత్వం ఆలోచించి రెగ్యులరైజ్ చేయాలి.
– డాక్టర్ ఎన్.వేణు, అసిస్టెంట్ ప్రొఫెసర్, జువాలజీ డిపార్ట్మెంట్, పీయూ
7వ పీఆర్సీ అమలు చేయాలి
ఉద్యోగ భద్రతతో కూడిన 7వ పీఆర్సీ అమలు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఒప్పంద అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి. మా సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందంటున్నా.. పట్టించుకోకపోవడం దారుణం. మాపై కనికరం చూపి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రా క్ట్ అధ్యాపకులు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి.
– మాధురి మోహన్, అసిస్టెంట్ ప్రొఫెసర్,సోషల్ వర్క్ డిపార్ట్మెంట్, పీయూ
సత్వర పరిష్కారం చూపాలి
గతంలో ఒప్పంద అధ్యాపకులను త్రిసభ్య కమిటీ ద్వారా నియమించారు. నెట్, సెట్, పీహెచ్డీ, పీడీఎఫ్ అర్హతలు ఉన్నప్పటికీ చాలీచాలని జీతంతో 20 ఏండ్లుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు వెంటనే 7వ పీఆర్సీ అమలు చేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలి. తమ సమస్యలకు పాలకులు సరైన పరిష్కారాలు చూపాలి. దస్త్రం ముందుకు కదలకపోవడంతో కాంట్రాక్టు అధ్యాపకులకు తీవ్ర నష్టం జరుగుతోంది.
– డాక్టర్ రవికుమార్, పీయూ ఒప్పంద అధ్యాపకుల సంఘం నాయకులు