జడ్చర్లటౌన్, మే 5 : వరంగల్ గడ్డమీద రైతు డిక్లరేషన్ అంటూ కాంగ్రెస్ పార్టీ రైతులను పచ్చి మోసం చేసిందని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు వరంగల్ గడ్డపై రైతు డిక్లరేషన్ అంటూ కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేయటమే లక్ష్యంగా హామీలిచ్చిందని..ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, ప్రతిపంటకు గ్యారెంటీ ధర, రైతుబంధు, రైతు బీమా ఇచ్చి వారిని బలోపేతం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు పట్టించుకోవటంలేదన్నారు.
అసమర్థ కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, రైతుల నుంచి మొక్కజొన్న పంటను కొనలేని దుస్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పాలన లో రైతులు అప్పు ల్లో మునిగిపోతున్నారని, రుణమాఫీ మాటలకే పరిమితమయ్యింద న్నారు. రైతుల కోసమే వచ్చామంటూ అన్నదాతను నమ్మించి ఓట్లు పొందిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులనే రోడ్డుమీదకు తెచ్చిందని మండిపడ్డారు.
ఇదేనా.. మీ రైతు డిక్లరేషన్ అంటూ కాంగ్రెస్ సర్కారును ప్రశ్నించారు. అసమర్థ కాంగ్రెస్ పార్టీకి అమలుచేయని హామీలు ఇవ్వటం సులువు అని చెప్పారు. రైతు డిక్లరేషన్ పేరిట రైతులను కాంగ్రెస్ చేసిన మోసాలను ఎండగట్టేందుకు ఈనెల 6వ తేదీన వరంగల్ వేదికగానే బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.