రోడ్డెక్కిన అన్నదాతలు
నారాయణపేటరూరల్, సెప్టెంబర్ 16 : నారాయణపేట జిల్లా కేంద్రంలో యూరియా పంపిణీ సరిగా లేకపోవడంతో విసుగు చెందిన రైతులు మంగళవారం పేట బస్టాండ్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం కాసేపటి తర్వాత అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని పెద్దఎత్తున రైతులు రాస్తారోకో చేపట్టారు. వీరికి అఖిల భారత రైతు సంఘం నేతలు మద్దతు ప్రకటించారు. పెద్ద ఎత్తున రైతులు ధర్నాకు తరలి రావడంతో సుమారుగా గంటన్నర పాటు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం యూరియా పంపిణీలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రైతులు నెల రోజులుగా యూరియా కోసం నిద్రాహారాలు మాని ఆయా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా అధికారులు యూరియా పంపిణీ చేయడం లేదన్నారు.
ఇచ్చేది కూడా ఒక్క బస్తా ఇస్తుండడంతో అవి ఎందుకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విష యం తెలుసుకున్న జిల్లా వ్యవసాయాధికారి జాన్ సుధాకర్ అక్కడికి చేరుకొని బుధవారం నుంచి యూరియా పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. అనంతరం ఫైర్ స్టేషన్లో ఎస్సై రాముడు ఆధ్వర్యంలో రైతులకు టోకెన్లు పంపిణీ చేశారు.
12 రోజులుగా ఎదురుచూపులు
వనపర్తి (నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 16 : వనపర్తి మండలంలోని పెద్దగూడెం సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులు యూరియా కోసం ఆందోళన చేపట్టారు. మంగళవారం సొసైటీ కార్యాలయానికి చేరుకున్న రైతులు మధ్యాహ్నం వరకు యూరియా రాక పోవడంతో ధర్నాకు దిగారు. 12 రోజులుగా మా ఆధార్ కార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్నారని ఇంతవరకు యూరియాను తెప్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వాట్సాప్ గ్రూప్‌లో రైతులు మంగళవారం రావాలని మెసెజ్ పెట్టారన్నారు.
ఈ ప్రకారమే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి చూసినా యూరియా రాలేదని రైతులు వాపోయారు. మరో రెండు గంటల తర్వాత యూరియా వస్తుందని అధికారులు చెప్పడంతో ఆందోళన విరమించారు. సొసైటీకి 550 మంది రైతులు రాగా సాయంత్రం 300 బస్తాల యూరియా వచ్చిందని, 227 మందికి బస్తాలు ఇచ్చిన తర్వాత సర్వర్ పనిచేయకపోవడంతో మిగతా వారికి ఎరువులు అందజేయలేదు. ఇంకా చాలా మంది రైతులు మిగిలిపోవడం యూరియా బస్తాలు తక్కువగా ఉండటం వల్ల రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు.
రైతన్న ఆక్రోశం
భూత్పూర్, సెప్టెంబర్ 16 : యూరియా కోసం గత పది, పదిహేను రోజుల నుంచి పీఏసీసీ ఎస్‌కు వస్తున్నా అధికారులు యూరియా అందించడం లేదని మంగళవారం రైతులు మహ బూబ్‌నగర్ రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈనెల 5వ తేదీన టోకెన్లు ఇచ్చినా ఇప్పటి వరకు యూరియా అందించడం లేదని, దీంతో రోజూ పీఏసీసీఎస్కు వచ్చిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొంతమంది కాంగ్రెస్ నాయకులు పీఏసీసీఎస్కు రాకున్నా వారు క్యూలో నిల్చోకున్నా అధికారులు యూరియాను దొంగతనంగా పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.
గత పదేండ్లలో రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులు రోడ్లపైకి సైతం రాలేదని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత వారు యూరియా దొంగతనంగా తీసుకు పోవడం, ఇతర రాష్ర్టాలకు తరలించడం మూలంగానే కొరత ఏర్పడిందని మండిపడ్డారు. అయితే రైతులు దాదాపు మూడు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపైనే రైతులు భోజనాలు చేశారు. భూత్పూర్ సీఐ రామకృష్ణ, ఏవో మురళీధర్, ఎస్సై చంద్రశేఖర్ రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. అనంతరం రైతులతో వ్యవసాయాధికారులను మాట్లాడించి గురువారం నుంచి యూరియా పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.