మహబూబ్ నగర్ : జిల్లాలోని భూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ( BRS ) కార్యకర్త వెంకటేష్ గౌడ్ పై విచక్షణారహితంగా దాడి చేసిన కాంగ్రెస్ నాయకుల ( Congress Leaders ) పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar Reddy ) ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ రత్నంకు ఫిర్యాదు ( Complaint ) చేశారు
. కాంగ్రెస్ మండలాద్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూపతి రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పెరిగిపోతున్నాయని, పోలీసులు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులతో వేధిస్తున్నారని ,అక్రమ కేసులు పెడితే బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నరసింహ రెడ్డిని 19 రోజులు జైలులో ఉంచారని పేర్కొన్నారు. పథకం ప్రకారం ఫ్రేమ్ చేసి అక్రమకేసులు పెడుతున్నారని విమర్శించారు. ఎస్సై లు వకాల్తా పుచ్చుకొని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, తమ కార్యకర్తను కొడితే పోలీసులు ఫిర్యాదు తీసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాని కోరారు.