మద్దూరు (కొత్తపల్లి), ఏప్రిల్ 14 : భూగర్భ జలాలు అడుగంటడంతోపాటులో ఓల్టేజీ సమస్యలతో ఎండిన పంటలకు ఎకరాకు రూ.40 వేల నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం కొత్తపల్లి మండలం గొర్లోనిబావిలో ఎండిన పంటలను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి మాజీ మంత్రి పరిశీలించి రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకోకపోవడం దారు ణం అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యతోపాటు భూగర్భ జలాలు అడుగంటి చేతికొచ్చిన పంటలు ఎండిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఇప్పటికైనా స్పందించి ఎండిన పంటలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొత్తపల్లి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు రైతులు పాల్గొన్నారు.