మహబూబ్‌నగర్, అక్టోబర్ 21 : విధినిర్వహణలో ప్రా ణాలర్పించిన పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి స్ఫూర్తి నిత్యం మనతో ఉంటుందని జోగుళాంబ జోన్ 7 డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్ అన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎప్పటికీ రుణపడి ఉంటుందని, వారి సంక్షేమానికి అన్నివిధాలా కృషి చేస్తామని తెలిపారు. 30 ఏండ్ల కిందట ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండేదని, గతంలో పోలీసులు విధినిర్వహణలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని కొనియాడారు.
సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ మైదానంలో పోలీస్ ఫ్లాగ్ డే దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరుల స్తూపం వద్ద కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, పోలీసు అధికారులతో కలిసి డీఐజీ నివాళులర్పించారు. అంతకుముందు ఎస్పీ మాట్లాడుతూ ఏడాది కాలంలో దేశంలో అమరులైన 214 మంది పోలీస్ అధికారులు ఉగ్రవాదులు, తీవ్రవాదులతో పోరాడి దేశ రక్షణ కోసం అమరులయ్యారని.. ఈ పోలీస్ అమరవీరుల త్యాగాలను మనమందరం అనుక్షణం స్మరించుకుంటూ దేశ రక్షణ కోసం ప్రతిఒక్కరూ పాటుపాడాలని ఆ కాంక్షించారు. పోలీసులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తారన్నారు. పోలీసులకు విశ్రాంతి అవసరమన్నారు.
జిల్లా నుంచి అమరులైనవారి కుటుంబాలతో డీఐజీ, కలెక్టర్, ఎస్పీ కలిసి ఏమైనా సమస్యలున్నాయా అని తెలుసుకో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన, ఫొటో, వీడియోగ్రఫీ పోటీలు, సైకిల్ ర్యాలీ, రక్తదానం శిబిరం నిర్వహిస్తామన్నారు.
అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాంతి ర్యాలీని డీఐజీ జెం డా ఊపి ప్రారంభించారు. అనంతరం డీఐజీ, ఎస్పీతోపాటు అమరవీరుల కుటుంబ సభ్యులు పాదయాత్రగా వన్‌టౌన్ చౌరస్తాలో ఉన్న పరదేశినాయుడు విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ గౌరవ వందనం స్వీకరించిన తర్వాత అమరవీరుల ఆత్మశాంతి కోసం పోలీసు సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములు, ఎఆర్ ఏఎస్పీ సురేశ్ కుమార్, డీ ఎస్పీ వెంకటేశ్వర్లు, జైలు సూపరింటెండెంట్ వెంకటేశం, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, పో లీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.