మక్తల్, ఏప్రిల్ 07 : రాష్ట్రంలో నిరుపేదల ఆత్మగౌరవ పథకమే సన్నబియ్యం పథకం అని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నర్వ మండలం లంకల గ్రామంలో సోమవారం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..సన్న బియ్యం పథకం ఎంతో గొప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు.రేషన్ కార్డు దారులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
స్థానిక ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయిందని ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు మాత్రమే కాకుండా, ప్రజలకు సన్న బియ్యం పథకం సైతం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రతి ఒక్కరు ఇట్టి పథకం లో వచ్చే బియ్యాన్ని అమ్ముకోకుండగా తామే వాడుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, నర్వ మండల ప్రత్యేక అధికారి హర్యానాయక్తో పాటు తదితరులు ఉన్నారు.