ఊట్కూర్, నవంబర్ 22 : జిల్లాలోని మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై మూ డు రోజులుగా మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై స్పందించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఇప్పటికే పాఠశాలకు చెందిన ఇద్ద రు ఉపాధ్యాయులతో పాటు జిల్లా విద్యాధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇదేక్రమంలో కొందరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ బాధ్యులపై విచారణకు ఆదేశించా రు.
సస్పెన్షన్‌కు గురైన హెచ్ఎం స్థానంలో మ రో ఉపాధ్యాయిని కళావతికి ఇన్‌చార్జ్జి బాధ్యతలు అప్పగించారు. జరిగిన ఘటనపై అదనపు కలెక్టర్ బెన్‌షాలం శుక్రవారం ఉదయం 10గంటలకు పాఠశాలకు చేరుకుని మధ్యాహ్నం 12:30 వరకు పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఓ గదిలో కూర్చుని పాఠశాల ఉపాధ్యాయులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం అమలుపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. అదనపు కలెక్టర్ రాకతో పాఠశాల ప్రా ంగణంలోని చెత్తను గ్రామ పంచాయతీ సిబ్బందిచే తొలగించారు.
మాగనూర్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండేందుకు కొద్ది నెలలుగా పురుగులు పట్టిన బియ్యం బస్తాలను వాడుతున్నారు. గురువారం పాఠశాలను తని ఖీ చేసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ పురుగులు పట్టిన బియ్యం బస్తాలను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో ఆర్డీవో రాంచదంర్ను విద్యార్థులకు దగ్గరుండి వంట వండించేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించగా అధికారి పాత స్టాక్‌తోనే బియ్యం వండించినట్లు తెలిసింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ బియ్యం పనికిరావని చెప్పినా సదరు అధికారి వినిపించుకోకుండా రెండు సార్లు కడితే పురుగులు పోతాయని కొత్తగా నియమించిన వంట మనుషులను పురమాయించడంతో విద్యార్థులకు తిరిగి పురుగుల అన్నం వండి వడ్డించారు.
విద్యార్థులకు వడ్డించిన అన్నంలో పరుగులు రావడం చూసి సదరు అధికారికి ఫిర్యాదు చేయగా సహనం కోల్పోయి విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు అన్నం పారబోసి అధికారుల తీరుకు నిరసనగా అదేరోజు సాయంత్రం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. పాఠశాలకు చెందిన కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులను రెచ్చగొట్టి ఆందోళనకు ఉసి గొల్పడంతో సమస్య మరింత తీవ్ర రూపమైంది. ఎస్సై అశోక్‌బాబు ఆధ్వర్యంలో పో లీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను ఇండ్లకు పంపారు. పురుగులు పట్టిన బియ్యం బస్తాలను మార్చి వాటి స్థానంలో కొత్తగా 42 క్వింటాళ్ల బియ్యం మధ్యాహ్న భోజనం కోసం అధికారులు సిద్ధం చేశారు.
మాగనూర్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నాణ్యతగా వడ్డించేందుకు చర్యలు తీసుకోవాలన్న కలెక్టర్ ఆదేశాలతో శుక్రవారం సివిల్ సప్లయ్ డీఎం దేవదానం, ఎస్సీ సోషల్ వెల్ఫేర్ అధికారి ఉమాపతి, ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ, మిడ్డేమీల్స్ అధికారి యాదయ్యశెట్టి, ఇన్చార్జి తాసీల్దార్ సురేశ్ అన్నం, పాలకూర పప్పుతో వంటలు వండించి మధ్యా హ్నం వేళ అధికారులే స్వయంగా విద్యార్థులకు వడ్డించారు. వంట పాత్రలను సైతం కొత్తగా సమకూర్చారు. మక్తల్ ఎమ్మె ల్యే వాకిటి శ్రీహరి మధ్యాహ్నం వేళ పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని ఆదేశించారు. దవాఖానాలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. కాగా, పలువురు విద్యార్థులు ఎమ్మెల్యేను చుట్టుముట్టి అధికారుల నిర్ల క్ష్యం వల్లే తమకు ఫుడ్ సరిగ్గా అందించడం లేదని, ఇందులో పాఠశాల ఉపాధ్యాయుల ప్రమేయం లేదని కంటనీరు పెట్టుకున్నారు. ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని వేడుకున్నారు. ప్రభుత్వ వైఫల్యంతోనే మధ్యాహ్న భోజనం వికటించి తమ పిల్లలు అస్వస్థతకు గురైనట్లు జరిగిన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ, మక్తల్, ఊట్కూర్ మండల కేంద్రాల్లో తపస్ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజనం బాధ్యతలను ఉపాధ్యాయులకు తప్పించి, ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.