నవాబ్‌పేట, మే 12 : మండలంలోని వివిధ గ్రామాల్లో ఏ ర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీల కొరతపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవా రం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన గన్నీ బ్యాగుల కొరతతో అన్నదాతల పడిగాపులు..అనే కథనానికి కలెక్టర్ విజయేందిర బోయితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశానుసారం డీఎస్వో శ్రీనివాస్, నవాబ్‌పేట తాసీల్దార్ శ్రీనివాస్, ఏపీఎం జీవరత్నం నవాబ్‌పేట, కొల్లూరు, లింగంపల్లి, చౌడూర్‌లో ధాన్యం కేంద్రాలను పరిశీలించారు.
డీఎస్వో ఆయా కేంద్రాల వద్ద పరిస్థితులను పరిశీలించి, రైతులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడారు. గన్నీ బ్యాగుల కొరత ఉందని రైతులు, నిర్వాహకులు తెలపడంతో నవాబ్‌పేటకు 11వేల బ్యాగులు, గురుకుంటకు 11వేలు, చౌడూర్కు 11వేల బ్యాగులు తెప్పించి అందజేశారు. అలాగే కొల్లూరు, లింగంపల్లి కేంద్రాలకు ధాన్యం లిఫ్టింగ్ చేసేందుకు లారీలు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా డీఎస్వో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి కొరత ఏర్పడిన తక్షణమే తమకు సమాచారం అందజేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.