గద్వాల, ఏప్రిల్ 5 : జిల్లాకు కొత్తగా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన రిజ్వాన్‌బాషా తన విధుల్లో దూకుడు పెంచడంతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. కలెక్టర్‌గా విధుల్లో చేరిన నాటి నుంచే తనదైన శైలిలో ప్రతి కార్యాలయాన్ని అకస్మికంగా సందర్శిస్తూ, తనిఖీ చేస్తుండడంతో అవినీతి అధికారులు, విధులపై అలసత్వం వహించే అధికారులు హడలెత్తిపోతున్నారు. తను తనిఖీ చేసిన కార్యాలయాల్లో విధుల పట్ల అలసత్వం వహిస్తున్న అధికారులను హెచ్చరిస్తూ పనిలో నిర్లక్ష్యం వహించే అధికారులకు మెమోలు జారీ చేస్తుండడంతో ఏప్పుడు ఏశాఖకు వచ్చి కలెక్టర్ తనిఖీ చేస్తాడో అని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
కలెక్టర్‌గా విధుల్లో చేరిన తర్వాత మొదట ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రక్షాళన చేయడానికి పూనుకున్నాడు. అందులో భా గంగా గతంలో మాదిరిగా కాకుండా రౌండ్ టేబుల్స్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారుల అక్కడే కూ ర్చునే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదులు చేయడానికి వచ్చే వారికి గతంలో పని చేసిన వారు సౌకర్యాలు కల్పించకపోవడంతో వరుసలో గంటల తరబడి నిలబడి తమ ఫిర్యాదులు ఇచ్చేవారు. అయితే దానిని పూర్తిగా మార్చేశాడు. ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించి వారు తమ దరఖాస్తులు అధికారులకు ఇచ్చే వరకు ప్రశాంతంగా కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేశాడు. ఇలా తన పరిధిలో ఉన్న అన్ని శాఖలపై రోజు వారీగా తనిఖీలు చేస్తూ ఆయా శాఖలను పర్యవేక్షణ చేస్తున్నారు.
కలెక్టర్ ప్రస్తుతం విద్యా, వైద్యం, రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజావాణికి ఎందుకు ఎక్కువ ఫిర్యాదు లు వస్తున్నాయి, వాటిని ఎందుకు అధికారులు పరిష్కరించడం లేదనే వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులపై తాసీల్దార్లతోపాటు ఇతర అధికారులు ఎప్పటికప్పుడు స్పందించి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
తమ పరిధిలో పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశిస్తూ నే, సమస్య ఎందుకు పరిష్కారం కాలేదో ఫిర్యాదు దారులకు వివరించాలని సూచించారు. ప్రతి సోమవారం తాసీల్దార్, ఎంపీడీవోలు తమ కార్యాలయా ల్లో ఉంటూ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో జిల్లా, రాష్ట్రస్థాయిలో 21వ స్థానంలో ఉండగా దానిని 3వ స్థానానికి తీసుకువచ్చారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగం గా గద్వాల జిల్లా దవాఖానలో గత నెలలో జిల్లా దవాఖానకు ఓ మహిళ పురుడు కోసం రాగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల శిశువు చనిపోయిన విషయం తెలుసుకున్న కలెక్టర్ దవాఖానను సందర్శించి వివరాలు తెలుసుకొని సంబంధిత ఘటనపై కమిటీ వేశారు. కారణాలు నివేదిక రూపంలో ఇవ్వాలని సంబంధిత సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఆ ఘటన మరువక ముందే అయిజ మండల కేంద్రంలోని పీహెచ్‌సీని సందర్శించి లీవ్ లెటర్ ఇవ్వకుండా విధులకు గైర్హాజర్ కావడం, సంతకం పెట్టి విధులు నిర్వహించకుండా ఇంటికి వెళ్లడం ఇలా విధులపై నిర్లక్ష్యం వహించిన 9మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
అదే విధంగా జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నైజ్ సిస్టం)హాజరు విధానం సక్రమంగా నిర్వహించడక పోవడం వల్ల ఒకే సారీ 76 మంది విద్యాశాఖ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ ఎఫ్‌ఆర్‌ఎస్‌ను పరిశీలించగా పలు చోట్ల ఉపాధ్యాయులు ఇతర సిబ్బం ది యాప్‌లో సక్రమంగా ఎఫ్ఆర్ఎస్ నమోదు చేయకపోవడం గమనించిన ఆయన జిల్లా పరిధిలో 61 పాఠశాలల్లో 76 మంది బోధన, బోధనేతర సిబ్బందిపై చర్యలకు పూనుకున్నారు.
సంబంధిత సిబ్బంది మూడు రోజుల లోపు సంజాయిషీని సమర్పించుకోవాలని ఆదేశించారు. మల్దకల్ తాసీల్దార్ ఝన్షీరాణి జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దర్వేష్బాబుకు డ్రైవర్ బాధ్యతలు అప్పగించడాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే భూ సంబంధ సమస్యలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో కొందరు తాసీల్దార్తోపాటు రెవెన్యూ అధికారులు ఇష్టారీతిలో వ్య హరించారు. ప్రస్తుత కలెక్టర్ వారి ఆగడాలకు చెక్ పెట్టారు. ప్రతి దరఖాస్తు త్రూ ఛానల్ ద్వారానే పరిష్కరించాలని ఆదేశించడంతో ఇన్నాళ్లు ఇష్టారీతిలో వ్యవహరించిన వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. భూ సంబంధ సమస్యలపై కలెక్టర్ సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది.
జిల్లాలో అధికార పార్టీ నాయకులు అధికారులు ఇసుక అక్రమ దందాను నడిపించారనే విషయం తెలుసుకున్న కలెక్టర్ ఇసుక అక్రమ రవాణపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా గట్టు మండ లం చమన్‌ఖాన్‌దొడ్డి సమీపంలోని అడవిలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేయించారు. దీం తోపాటు పులికల్, రాజాపూర్, రాజోళి తదితర ప్రాంతాల్లో కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు ఇసుక డంప్‌లను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సరఫరా చేస్తుండడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాయలసీయ, కర్ణాటక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తెలంగాణ ప్రాంతంలో డంప్ చేసి ఇక్కడ విక్రయించి దళారులు సొమ్ము చేసుకున్న విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడికక్కడ ఇసుకను సీజ్ చేయిస్తుండడంతో ఇది అధికార పార్టీ నాయకులకు నచ్చడం లేదు. గట్టులో డంప్ చేసిన ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేస్తే అధికార పార్టీ నాయకుడు అధికారులపై చిందులు వేసినట్లు తెలిసింది. వీటితోపాటు రేషన్ దుకాణాలను తనిఖీ చేస్తూ ప్రజలకు రేషన్ సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా వచ్చిన కొద్ది రోజుల్లోనే జిల్లాలో తనదైన శైలిలో అన్ని శాఖలను పర్యవేక్షిస్తూ అవినీతి అధికారులకు చెమటలు పట్టిస్తూ ప్రజలకు మేలు జరిగేలా చేయడంపై ప్రజలు అభినందిస్తున్నారు.