హనుమకొండ సబర్బన్, ఆగస్టు 8 : ‘గొడ్లెన్ని సచ్చుడు కాదు.. వడ్లెన్ని పండినవనేదే ముఖ్యం’ వ్యవసాయ రంగంలో అనాది నుంచి వస్తున్న ఈ నానుడిని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన రైతు అల్లకొండ రాజు నిజం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. అల్లకొండ రాజు తనకున్న 20 ఎకరాల్లో ప్రతి సీజన్లో వరి సాగు చేస్తాడు. ఇదే తరహాలో ఈసారి కూడా ఇరవై ఎకరాల్లో తన సొంత భూమితో పాటు పక్కన ఉన్న ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని వారి నాట్లు వేశాడు. మూడు వ్యవసాయ బావులు, 12 బోరు బావులు ఉండగా వీటితో ఎలాంటి ఇబ్బంది లేకుండా పొలం పారేది.
దీనికితోడు కాకతీయ కాలువ దిగువ భాగంలో ఇతని పొలం ఉండటంతో ఏనాడు ఎండిన దాఖలాలు లేవు. కాళేశ్వరం పంపులు ఆన్ చేసి కాకతీయ కాలువకు నీళ్లు వదలుతారని రైతులు భావించారు. అయితే ఇందుకు విరుద్ధంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో వేసిన కొద్దిపాటి పొలాలన్నయినా పండించుకోవాలనుకుంటున్న రైతులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సాగునీటి సమస్య నెలకొనడంతో రాజు మరో ఐదు బోర్లను వేసి మోటర్లను బిగించాడు. దీంతో ప్రస్తుతం ఇతడి వ్యవసాయం 20 ఎకరాలు, 20 మోటర్లుగా మారింది. ప్రస్తుతం పంటలను రక్షించుకునేందుకు అన్నదాతల అగచాట్లు అసాధారణంగా మారాయి. తెలంగాణ రాక ముందు బోరు బండ్లు ఎలా గిరాగిరా తిరిగేవో ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొన్నది.