– సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు మువ్వా వెంకటేశ్వరరావు
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 16 : సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు మువ్వా వెంకటేశ్వరరావు (లడ్డా) డిమాండ్ చేశారు. సారపాకలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం సీపీఐ జిల్లా సమితి సభ్యుడు పేరాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన మండల కౌన్సిల్ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి ఆ పోరాటంలో కీలకపాత్ర పోషించిన కమ్యూనిస్టుల త్యాగాలను భావితరాలకు తెలియచేయాలన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటం ఫలితంగా లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత సీపీఐకి ఉందన్నారు. చారిత్రక వాస్తవాలను పక్కనపెట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు.
నిజమైన చరిత్రను ప్రజలు, యువతకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు ఆనాడు జరిగిన పోరాటంలో వేలాది కమ్యూనిస్టులు చనిపోయాక 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన జరిగిందని, ఆనాడు కమ్యూనిస్టుల నాయకత్వంలో 24 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని, దేశంలోనే పెద్ద పోరాటం తెలంగాణ సాయుధ పోరాటమని దీనిని పాఠ్యాంశాల్లో చేర్చి భవిష్యత్ తరాలకు చరిత్రను అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచనదినంగా ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి సబ్కం నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి పాండవుల భిక్షం, సిద్ధార్థ సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు బర్ల వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ అధ్యక్షుడు ఎండి సాజిద్, జహీర్, సీపీఐ నాయకులు చారి, ప్రజానాట్య మండలి కాటూరి రాము, వార్డు సభ్యులు గుగులోత్ బీమా, పేరం వెంకటేశ్వరరెడ్డి, వహీదు, తోకల శ్రీను, వేణు పాల్గొన్నారు.