జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పాలన రైతులకు శాపంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన భూపాలపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురువలేదని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై రామప్ప రిజర్వాయర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి గణపసముద్రాన్ని నింపి రైతులకు సాగునీరందించాలని డిమాండ్ చేశారు. దేవాదుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగు, తాగునీ నీటిని అందించాల్సి ఉన్నదని అన్నారు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే అసమర్థత, చేతగానితనంతో గణపురం ఆయకట్టు కింద పంటలు ఎండిపోయే దుస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తంచేశారు.
దీనిపై జిల్లా మంత్రులు సీతక, కొండా సురేఖ ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా నెలకు 6 టీఎంసీలు ఎత్తిపోస్తున్నామని చెప్తున్నా ప్రభుత్వం, ఇప్పటి వరకు కేవలం 4 టీఎంసీల నీరు మాత్రమే పంపింగ్ చేసినట్టు తమకు స్పష్టమైన సమాచారం ఉన్నదని అన్నారు. దేవాదుల ఇన్‌టేక్ వెల్‌లోని 9 పంపులు నడిపిస్తే భీంగణపూర్, రామప్ప, చలివాగు నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ వరకు నీళ్లు వెళ్తాయన్నారు. 20 రోజుల క్రితం దేవాదుల పంప్‌హౌస్‌ను తాను సందర్శించినప్పుడు రెండే పంపులు నడుస్తున్నాయని, వాస్తవానికి 3 పంపులు నడువాల్సి ఉన్నదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ ఏసీ గదుల్లో కూర్చోని ప్రత్యామ్నాయ పంటలు వేయమని చెప్పడం సిగ్గుచేటన్నారు.