జోగుళాంబ గద్వాల జిల్లాలో నిల్వ ఉంచిన సీఎంఆర్ బస్తాలకు రెక్కలొచ్చాయి. గోదాంలో ఉన్న దాదాపు 300 బస్తాలు అపహరణ గురైనట్లు మిల్లర్ల తరుపు వారు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే మిల్లర్లే బియ్యాన్ని పక్కదారి పట్టించి దొంగతనం జరిగిందని తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి సీజన్లోనూ మిల్లర్ల తీరు ఇదే తరహాలో ఉంటుందన్న విమర్శలు లేకపోలేదు. కస్టమైజ్ చేసిన రైస్ ప్రభుత్వానికి అందించకుండా మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు.
– గద్వాల, డిసెంబర్ 26
ప్రభుత్వం ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి ఆ ధాన్యాన్ని మర ఆడించడానికి మిల్లర్లకు కేటాయింస్తున్నది. కేటాయించిన బియ్యాన్ని అధికారుల సహకారంతో మిల్లర్లు బయటకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయం సివిల్ సప్లయి శాఖ అధికారులకు తెలిసినా ఇందులో వారికి కూడా భాగస్వామ్యం ఉండడంతో వారు పట్టించుకోవడం లేద నే ఆరోపణలు వినిస్తున్నాయి. నిత్యం వందలాది వాహనాలు తిరిగే జాతీయ రహదారి పక్కనే పోలీస్ బెటాలియన్ సమీపంలో ఉండే బీచుపల్లి ఆయిల్ మిల్ గోదాంలో ఉన్న మూడు వందల బస్తాల సీఎంఆర్ ధాన్యాన్ని గోదాంలో దొంగలు అపహరణ చేశారంటే ఇది సినిమా తలపించేలా ఉంది. గోదాంలోని ధాన్యం దొంగలు అపహరించారని బాధితుడు ఫిర్యాదు మేరకు రెండు రోజులుగా పోలీసుల విచారణ చేసినా చివరికి ఫలితం శూన్యం.
పెబ్బేరుకు చెందిన సాయిగోపాల ఇండో టెక్ ప్లాంట్ యజమాని హరినాథ్ బీచుపల్లి సమీపంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి మిల్లు అద్దెకు తీసుకొని వడ్లను మరాడిస్తారు. అతనికే పెబ్బేరు సమీపంలో మరో మిల్లు ఉంది. ప్రభుత్వం ఈ మిల్లులకు సీఎంఆర్ ధాన్యాన్ని కేటాయిస్తే వారు ఆ ధాన్యాన్ని లీజు తీసుకున్న బీచుపల్లి ఆయిల్ మిల్ గోదాంలో రెండేళ్లుగా నిల్వ చేస్తున్నారు. ఈయనతో పాటు సప్తగిరి రైస్ మిల్లుకు చెందిన వారు కూడా విజయ ఆయిల్ మిల్లును 2023లో అద్దెకు తీసుకొని వారు కూడా తమ మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని అందులో నిల్వ ఉంచుతున్నారు. అయితే గోదాంలో ఉన్న సీఎంఆర్ బస్తాలు అపహరణకు గురయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రతి సీజన్లో జిల్లాలోని మిల్లర్ల ది ఇదే తీరు. ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లర్లు ముందుగా బయటకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే బీచుపల్లి విజయ ఆయిల్ మిల్లులో లక్షన్నర బ్యాగులు ఉండగా అందులో అపహరణకు 300బస్తాలు(40కేజీల)గురయ్యాయని ఫిర్యాదు చేశారు. చోరీకి గురైనా ధాన్యం అమ్ముకున్నారా…లేక దొంగలు అపహరించారా అనేది అనుమానాలకు తావిస్తోంది. గద్వాలకు చెందిన ముగ్గురు మిల్లర్లతో పాటు పెబ్బేరుకు చెందిన కొంతమంది మిల్లర్లు ప్రతి ఏడాది ప్రభుత్వానికి అందించాల్సి సీఎంఆర్ బియ్యం ఇవ్వకుండా ఎగవేస్తున్నట్లు తెలిసింది.
మిల్లులకు కేటాయించిన వడ్లను అమ్ముకుని ప్రభుత్వానికి బియ్యం అందించే సమయంలో డీలర్ల నుంచి రేషన్ బియ్యా న్ని కొనుగోలు చేసి వారి మిల్లులో రీసైక్లింగ్ చేసి ప్ర భుత్వానికి బియ్యం అందిస్తున్నారనే ఆరోపణలు ఉ న్నాయి. అయితే బీచుపల్లి విజయ ఆయిల్ మిల్లులో సీఎంఆర్ వడ్లను వాస్తవంగా దొంగలు అపహరించారా లేక అమ్ముకున్నారా అనే దానిపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే తప్పా అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు. గతంలో ఇక్కడ నుంచి సీఎంఆర్ వడ్లు తరలిస్తున్నట్లు తెలిసింది. ఈనెల 24వ తేదీ లారీలోకి వడ్లు ఎత్తే క్రమంలో దీనిని చూసిన కొందరు 100కు సమాచారం అందించడంతో అసలు విషయం బయట పడినట్లు తెలిసింది. దీనికి తోడు జిల్లాలోని అన్ని మిల్లులను విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తే మరిన్ని అక్రమాలు బయట పడే అవకాశం ఉంది.
బీచుపల్లి విజయ ఆయిల్ ప్రాంతంలో ఆయిల్ పాం మొక్కల పెంపకం జరుగుతుంది. అందులోనే ఆయి ల్ మిల్లుకు సంబంధించి గోదాంలు ఉన్నాయి. అయితే మొక్కలకు ఎరువులు వస్తున్నాయని చెప్పి రాత్రి వేళల్లో ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని బయటకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఎర్రపల్లి మండల సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకులను చేరదీసి వారి చేత రాత్రి పూట ధాన్యాన్ని లారీలకు ఎక్కించి బయటకు తరలిస్తున్నట్లు సమాచారం. పెబ్బేరుకు చెందిన యువకుడి వాహనంలో ఈ ధాన్యం బయటకు తరలిస్తున్నట్లు తెలిసింది.
ఒక లారీ లోడు చేస్తే యువకులకు రూ.30వేలు కూలీల కింద ఇస్తున్నట్లు తెలిసింది. వారిని పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. సీఎంఆర్ దందాలో ఇటు గద్వాలకు చెందిన ముగ్గురు మిల్లర్లతో పాటు పెబ్బేరు చెందిన కొంతమంది మిల్లర్ల భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నెలలో ఎర్రవల్లిలోని ఓ మిల్లు నుంచి నేరు గా అయిజ ఎంఎల్ఎస్ పాయింట్‌కు పీడీఎస్ బి య్యం సరఫరా చేసి దానిని సీఎంఆర్‌గా పాస్ చే యాలని మిల్లర్లు అధికారులపై ఒత్తిడి చేసి పాస్ చేయించినట్లు తెలిసింది. ఎర్రపల్లి మండలంలోని ఓ రైస్ మిల్లు నుంచి అక్టోబర్ నెలలో రూ.20లక్షల విలువ చేసే పీడీఎస్ బియ్యం నేరుగా అయిజ ఎంఎల్ఎస్ పాయింట్లో డంప్ చేశారనే ఆరోపణలు అప్పుడు బలంగా వినిపించాయి.
జిల్లాలో సీఎంఆర్ అక్రమాలపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేయిస్తే మిల్లర్ల అక్రమాలు బయట పడే అవకాశం ఉంది. వానకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో ఏ మిల్లుకు ఎంత ధాన్యం కేటాయించారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం మిల్లుల్లో ఉందా? లేక ఎక్కడైనా డంపింగ్ చేశారా? అనే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. ఆ దిశగా విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టాల్సి ఉన్నది.