నారాయణపేట, ఫిబ్రవరి 20 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలోకి వచ్చే నారాయణపేట జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన తన మానస పుత్రికగా భావించి ఏర్పాటు చేస్తున్న నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పథకం సర్వే పను లు పోలీసుల నిర్బంధంలో కొనసాగడం గమనార్హం. ప్రా జెక్టు ఏర్పాటు వల్ల భూములు కోల్పోయే రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు ఏర్పాటు వల్ల ఒకింత రైతులు సంతోషపడాలో మరో వైపు ప్రాజెక్టు ఏర్పాటు వల్ల భూములు కోల్పోయే రైతులు బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వందల మంది పోలీసులు, రెం డు అంకెల సంఖ్యలో డీఎస్పీ, సీఐ, ఎస్సైల పటిష్ట బందోబస్తు మధ్యన స్వయంగా రైతుల పొలాల్లో రైతులనే దగ్గరికి రాకుండా బలవంతంగా సర్వే చేపడుతూ వస్తున్నారు. ప్రాజెక్టు ఏర్పాటు వల్ల భూములు కోల్పోయే రైతులు, ఎట్టి పరిస్థితుల్లో తమ భూములు ఇచ్చేది లేదని, ఏం డ్ల తరబడి భూమినే నమ్ముకొని తాము జీవనం కొనసాగిస్తున్నామని తెగేసి చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో నారాయణ పేట పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి నుంచి ఏదైనా భరోసా దకుతుందా అని రైతులకు వేచి చూస్తున్నారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగంబండ రిజర్వాయర్ నుంచి నీటి విడుదలలో అంతరాయం కారణంగా మక్తల్ మండల పరిసర గ్రామాలకు చెందిన వరి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంటలు ఎండుతున్నాయని వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రిజర్వాయర్ మీద ఆధారపడి పంటలు వేశామని, అకస్మాత్తుగా నీటి విడుదలలో అంతరాయం ఏర్పడడంతో దికుతోచడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణపేట బహిరంగ వేదిక మీద నుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నారాయణపేట జిల్లాలోని నారాయణపేట మండల పరిధిలోని కోటకొండ, దామరగిద్ద మండలంలోని కాన్కుర్తి గ్రామాలను అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గ పరిధిలోని కోయిల్‌కొండ మండలం గార్లపాడ్ను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని గత ఏడాది నవంబర్ 26న జరిగిన ఎన్నికల ప్రచారంలో నారాయణపేట జిల్లా కేంద్రానికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ హామీ ఇచ్చి 14నెలలు కావస్తున్నా ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి ఆ ఊసే ఎత్తడం లేదు. ఈ విషయంపై ఇటీవల ఆయా మండల నాయకులు ఆందోళన బాట చేపట్టగా, కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి నోటి ద్వారా త్వరలోనే మూడు మండలాల ప్రకటన చేయిస్తామని హామీ ఇచ్చి, ఆందోళనను విరమింపజేశారు. ఇది చెప్పి కూడా నెల రోజులు దాటింది. కానీ మండలాల ప్రకటనపై అతీగతి లేకుండా పోయింది. శుక్రవారం పలు అభివృద్ధి, శంకుస్థాపనల కోసం నారాయణపేట జిల్లా కేంద్రానికి వస్తున్న సీఎం అధికారికంగా మూ డు మండలాలను ప్రకటిస్తారని ఆయా మండలాల ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
శాసనసభ ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో నారాయణపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రెనేజీ ఏర్పా టు చేయాలని అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత స్థానిక శాసన సభ్యురాలు పర్ణికారెడ్డి ఎంతో దూరదృష్టితో ఆలోచించి సభ వేదిక మీద పీసీసీ హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డిని కోరారు. ఆ తర్వాత ప్రసంగం మొదలు పెట్టిన రేవంత్‌రెడ్డి ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న నారాయణపేటలో గత పాలకుల వైఫల్యం కారణంగానే అండర్ గ్రౌండ్ డ్రెనేజీ ఏర్పాటు చేయలేదని ఎద్దేవా చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్నా అండర్ గ్రౌండ్ డ్రెనేజీ హామీ అండర్ గ్రౌండ్‌కు చేరిందని చెప్పవచ్చు. శాసన సభ్యురాలు అడిగిన మొదటి పనికి కూడా ఇప్పటి వరకు ఆచరణకు శ్రీకారం చుట్టలేదు. కనీసం ఈ వేదిక ద్వారానైనా స్థానిక శాసన సభ్యురాలు అడిగిన డిమాండ్ నెరవేరుతుందా అనేది వేచిచూడాల్సి ఉంది.