మూసాపేట/దేవరకద్ర రూరల్(చిన్నచింతకుంట), నవంబర్ 10 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో వెలసిన కురుమూర్తి వేంకటేశ్వరస్వామిని ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. రూ.110 కోట్లతో కురుమూర్తి స్వామి కొండపైకి ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గుట్టపైకి కాలినడకతో వెళ్లి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు.
కురుమూర్తి స్వామి సాక్షిగా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. కొడంగల్, నారాయణపేట, మక్తల్, మహబూబ్‌నగర్, దేవరకద్ర నియోజకవర్గాలను పసిడి పంటలతో కళకళలాడేలా చేస్తానన్నారు. పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలను పెంచుతానన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని జాతర ఆలయాలను గుర్తించి.. అభివృద్ధి, వసతులపై నివేదికలివ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. కురుమూర్తి ఆలయ అభివృద్ధి కోసం కావాల్సిన నివేదికలను వెం టనే ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాలన్నారు. పల్లెలు, తండాలకు బీటీ రోడ్డు కోసం అవసరమైన నివేదికలివ్వాలన్నారు. కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జెడ్పీ మాజీ చైర్పర్సన్లు స్వర్ణసుధాకర్‌రెడ్డి, సరిత, సీతాదయాకర్‌రెడ్డి, కలెక్టర్ విజయేందిరబోయి, ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.