మహబూబ్‌నగర్ విద్యావిభాగం, ఆగస్టు 2 : ఇటీవల పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు వెళ్లేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సభకు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 662మంది ఉపాధ్యాయులు మహబూబ్‌నగర్ బాలుర జూనియర్ కళాశాల నుంచి 14బస్సులు, జడ్చర్ల నుంచి ఒకబస్సు మొత్తం 15 బస్సుల్లో గురుకుల పాఠశాలలు, విద్యాలయాల నుంచి 9 మంది పీజీటీలు, జేఎల్‌లు, ప్రిన్సిపాళ్లు బయలుదేరి వెళ్లగా.. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల నుంచి 568 మంది ఉపాధ్యాయులు బయలుదేరి వెళ్లారు.
జిల్లాలోని 17 మండలాల నుంచి 662 మంది ఉపాధ్యాయులు బయలుదేరి వెళ్లగా ఏకోపాధ్యాయ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలు, ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు సదువు చెప్పె సారోళ్లు లేకపోవడంతో అందుబాటులో ఉన్న సిబ్బంది చిన్నారులకు మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపించారు. చాలా చోట్లా ఇదే పరిస్థితులు నెలకొన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు.
ఎల్బీ స్టేడియంలో సీఎంతో ఉపాధ్యాయుల ముఖాముఖి ఉండడంతో పాలమూరు నుంచి బయలుదేరిన ఉపాధ్యాయులను మొదట ఎల్బీ స్టేడియం సమీపంలోనే బస్సుల్లో వదిలి వెళ్లారు. సభ ముగిశాక బస్సుల కోసం వచ్చిన ఉపాధ్యాయులకు చుక్కలు కన్పించాయి. తమ బస్సు ఎక్కడుందో తెలియకపోవడంతో తీవ్ర ఇ బ్బందులు పడ్డారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇందిరాపార్కు, ఎన్టీఆర్ స్టేడియం వద్ద బస్సులు పార్కింగ్ ఉండడంతో ఉపాధ్యాయులంతా కాలికి పనిచెప్పక తప్పలేదు. సీఎం సభ సాయంత్రం 5గంటలకే ముగిసినా.. ఉపాధ్యాయులు ఎక్కాల్సిన బస్సులు మాత్రం రాత్రి 7:15గంటలైనా కదలలేదు. రాత్రి 7:20 గంటలకు ఇందిరా పార్కు నుంచి పాలమూరుకు బయలుదేరాయి.
సీఎం సభకు వెళ్లిన ఉపాధ్యాయులకు మార్గమధ్యలో టోల్గేట్ల వద్ద కాటన్బాక్సుల్లో తీసుకొచ్చిన బిర్యానీతోపాటు రెండు చపాతీలు, కూరగాయలు, స్వీట్స్‌తో కూడిన భోజనం, వాటర్ బాటిల్స్ అందించారు. సభ ముగిశాక సారోళ్లను ఎవరూ పట్టించుకోలేదని కొందరు వాపోయారు.