వనపర్తి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : రైతుబంధు ఇవ్వకుంటే ఊకుందామా..? ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని ఉరికిద్దామా..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రైతు రుణమాఫీ పథకానికి రేషన్‌కార్డు నిబంధన విధించిన సీఎం రేవంత్‌రెడ్డికి రైతుల ఉసురు తగులుతుందన్నారు. ప్రజలు ఇంకా మౌనంగా ఉంటే.. రాష్ట్రంలో ఏ ఒక్క పథకం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించదన్నారు. గతంలో అమలు చేసిన హామీలు నిలిపి వేసిన రేవంత్ సర్కార్ కాంగ్రెస్ హామీలను సహితం 11 నెలలు గడుస్తున్నా అమలు చేయకపోవడంపై ప్రజలు అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం వనపర్తిలోని మర్రికుంటలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన రైతుల నిరసన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హరీశ్‌రావుతోపాటు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, నవీన్‌కుమార్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కు మార్, మాజీ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, అంజయ్యయాదవ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 42లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 20 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని, సగానికి సగం కూడా మాఫీ చేయకుండానే సీఎం రేవంత్ తనను రాజీనామా చేయమని పదే..పదే అడగడం విడ్డూరం గా ఉందన్నారు. అసంపూర్తి రుణమాఫీ అనేక రైతు కుటుంబాల్లో ఆరని చిచ్చుపెట్టిందని, కొందరు రైతులు ఆత్మహత్య కూడా చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం లేని నిబంధనను పెట్టి రైతులను అవస్థలపాలు చేసిన రేవంత్‌రెడ్డి సర్కార్‌కు రైతులే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు అన్ని విషయా లు అర్థమయ్యాయని, మౌనంగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలను నిలిపివేస్తుందన్నారు. ఇప్పటికే రైతుబంధు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్టు, చేప పిల్లల పంపిణీ లాంటివన్నింటినీ నిలిపి వేసిందని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలు ఏవీ అమలు చేయడం లేదన్నారు.
గతంలో పథకా లు కొనసాగాలన్నా.. కొత్త హామీలు అమలు చేయాలన్నా పోరాటం చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు ఉద్యమాలు పోరాటాలు కొత్తకాదని, మౌనంగా ఉండడం వల్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అవస్థలను మరింతగా ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కేవలం బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నందునే అరకొరగా రుణమాఫీ చేశారని, వృద్ధులకు రూ.4వేల పింఛన్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, మహిళలకు రూ.2500, పది, ఇంటర్, డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు రూ.10వేలు, 15 వేలు, 25 వేలు ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు అమలు చేయడం లేదన్నారు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి వృద్ధుడికి రూ.20 వేలు, ప్రతి మహిళకు రూ.25 వేలు, ఆటోవారికి రూ.12 వేలు రేవంత్‌రెడ్డి సర్కార్ బాకీ పడిందన్నారు.
కోత లు.. కొర్రీలతో కాంగ్రెస్ ప్రభుత్వం మొండికేసిందని, దేవుళ్లపై ఒట్టుపెట్టి మాట తప్పడం వల్ల రాష్ర్టానికి మంచిది కాదని, అరిష్టమని చెబుతున్నారని ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయాలని హ రీశ్‌రావు డిమాండ్ చేశారు. నాడు వలసలకు నిలయమైన వ నపర్తిని నేడు వరి కోతలకు ఆలవాలంగా మార్పు చేసిన ఘ నత సింగిరెడ్డి నిరంజన్రెడ్డిదేనన్నారు. మెడికల్ కళాశాల, జేఎన్టీయూ, ఫిషరీష్, అగ్రికల్చర్ బీఎస్‌స్సీ, నర్సింగ్‌లాంటి వి ద్యా వ్యవస్థలను ఏర్పాటు చేసి వనపర్తిని సరస్వతీ నిలయం గా నిరంజన్‌రెడ్డి మార్చారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో ఇంతలా అభివృద్ధి పనులు జరిగితే.. ఏడాది కాంగ్రెస్ ప్ర భుత్వంలో ఒక్క రూపాయి పని అయినా జరిగిందా అని హ రీశ్‌రావు ప్రశ్నించారు.
ఆరు గ్యారెంటీల అమలు లేకపోవడం వల్ల ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని, లక్ష ఉద్యోగాలంటూ కేవ లం 20 వేలు కూడా ఇవ్వలేదన్నారు. ఆ ఉద్యోగాలు సహితం గత కేసీఆర్ ప్రభుత్వం సిద్ధం చేసినవేనని, ఇలా అనేక విషయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ యార్డుల్లో రైతులు ధా న్యం విక్రయాలకు గుమిగూడుతారని, ప్రభుత్వ మోసాలపై మార్కెట్లలో చర్చ పెట్టాలని హరీశ్‌రావు పార్టీ నాయకులు, కా ర్యకర్తలకు సూచించారు. లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ నేత శ్రీధర్‌రెడ్డి హత్య జరిగిన నాలుగు నెలలైనా హంతకులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్పర్సన్ రజనీసాయిచంద్, అభిలాష్ రావు, ఇంతియాజ్ ఇసాక్, శ్రీనివాస్యాద వ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకుడు గులాంఖాదర్ పాల్గొన్నారు.
ముందుగా పట్టణంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మం త్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పూలమాలలు వేసిన అనంతరం మోటర్ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి దాదాపు కిలోమీటరు మేర సభాస్థలి వరకు ర్యాలీ నిర్వహించారు.
కాంగ్రెస్ హామీలకు మో సపోయి గోసపడుతున్న ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అం టే నమ్మకం ఉంది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. కాం గ్రెస్ పాలనలో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నా రు. అసంపూర్తిగా చేసిన రుణమాఫీపై తెలంగాణ భవన్‌కు 1.60 లక్షల రైతుల ఫిర్యాదులు వచ్చాయి. తెలంగాణ భవన్‌కు ప్రభుత్వ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో రాష్ట్రంలో గందరగోళం నెలకొన్నది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తున్నదని, నిత్య విద్యార్థిలా మాజీ మంత్రి హరీశ్‌రావు చురుకుగా తన పాత్రను అలుపులేకుండా పోషిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై తనదైన ముద్రవేసిన నిరంజన్‌రెడ్డి.. అన్యాయాలపై సదస్సు ఏర్పాటు చేసి రైతు పక్షపాతిగా నిలిచారు.
– రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీ
పాలమూరు బిడ్డ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండి చేసిందేమిటి.? గతంలో కేసీఆర్ పాలమూరు ఎంపీ గా ఉండి తెలంగాణను సాధించి పెట్టారు. నేడు సీఎం గా ఉన్న రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాకు ఏం చేశారో చె ప్పడానికి కూడా ఏమీ లేదు. రైతులు, ప్రజలను మో సం చేసిన కాంగ్రెస్‌ను స్థానిక ఎన్నికల్లో బొందపెట్టాలి. ఇంతలా మోసం చేసినప్పటికీ ప్రజలు ఇంకా కం డ్లు తెరవకపోతే రానున్న రోజుల్లో మరిన్ని కష్టాల్లోకి వెళ్లాల్సి వస్తుంది. అయితే జిల్లా కేంద్రంలో నూతన కార్యాలయాలు నిర్మాణం చేసే దశలో అక్కడి భూ ముల్లో కొంతమంది పేద రైతులుంటే వాళ్లకు నచ్చచెప్పి కొన్ని ప్లాట్లు ఇచ్చాం. వాటి విషయంలో కొందరు నాయకులు చేరి వాటిని గందరగోళం చేసే పని చేస్తున్నట్లుగా తెలుస్తున్న ది. అలా చేసి రైతులను మోసం చేస్తే మాత్రం రణరంగం సృష్టిస్తాం. అవసరమైతే అదే రైతులకు ప్రభుత్వం నుంచి ఎన్వోసీ తీసుకొచ్చి తోడ్పాటునందించాలి. అధికారం చేతిలో ఉందని ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే ఊరుకునేది లేదు. పక్క నియోజకవర్గంలో ఉన్న మంత్రి ఇక్కడ మేము తీసుకొచ్చిన కళాశాలలు, ఇతర కార్యాలయాల్లో వారి నియోజకవర్గానికి చెందిన వారిని నియమిస్తుంటే, ఇక్కడున్న అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు. మంత్రి హోదాలో మీరు గొప్ప అభివృద్ధిని తీసుకుని వచ్చి ఉపాధి కల్పిస్తే సముచితంగా ఉంటుంది. ఒకటి కాదు.. రెండు కాదు 20 ఏండ్లకు పైగా అధికారంలో ఉంటూ పక్క నియోజకవర్గంలో వేలు పెట్ట డం సమంజసం కాదు. అయితే అన్ని విషయాలు తెలిసిన చిన్నారెడ్డి ఎందుకు మౌ నంగా ఉన్నారో అర్థం కావడం లేదు. నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలపై స్పందించాలి. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను కేటీఆర్, హరీశ్‌రావు విజయవంతంగా నిర్వహిస్తున్నారని, ప్రభుత్వానికి నిద్రలేకుండా చేస్తున్నారు.
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, పెడుతున్న కేసులకు ఎవరూ బెదరొద్దు. బీ ఆర్ఎస్ పార్టీ మీకు ఎల్లవేళలా అండగా ఉంటుంది. సర్కారు చేస్తున్న అన్యాయాలపై ప్రశ్నించినా, సోషల్ మీడియాలో పెట్టినా కేసులు పెడుతున్నారు. మహబూబ్‌నగర్‌లో పేదల ఇండ్లను కూల్చి వేశారని ప్రశ్ని స్తే కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఎవరి సంతో షం కోసం కేసులు పెడుతున్నారో.. కొంత మంది పోలీసుల వ్యవహారశైలితో అందరికీ చెడ్డపేరు వస్తుంది. ఎన్ని కేసులు పెట్టినా ఎవరూ భయపడొద్దు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది. ధర్మపోరాటంలో మనమే గెలుస్తాం. ఉమ్మడి పాలమూరు గడ్డ పౌరుషానికి నిదర్శనం. మోసపోతే గోసపడతామని కేసీఆర్ ముందే చెప్పారు. చివరకు అదే జరిగింది. ఇక పోరాటం తప్పా మరొకటి లేదు.
– శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి
రాష్ట్రంలో ఇటు రైతులు అటు పోలీసులు సంతోషంగా లేరు. రైతులకు గతంలో అందిన పథకాలతోపాటు కొత్త హామీల అమలు అస్తవ్యస్తంగా ఉన్నందు నా రైతు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. అ లాగే పోలీసు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి స్పెషల్ పోలీసుల కుటుంబాల్లో ఆరని చిచ్చు పెట్టారు. జై జ వాన్.. జైకిసాన్ అన్న నినాదానికి కాంగ్రెస్ సర్కార్ పెద్ద మచ్చ తీసుకొచ్చింది. పోలీసు కుటుంబాలను పోలీసులతోనే కొట్టి.. కేసులు పెట్టించడం ఎంత దు ర్మార్గమో ఆలోచించాలి. రాష్ట్రంలో గూండాగిరి కొనసాగుతుంది. గద్దెదింపుతాం. స్వయంగా స్పీకర్ నోటి నుంచి గాంధీ దవాఖానకు వెళితే చనిపోతావనే మాటలు వస్తున్నాయంటే కాంగ్రెస్ పాలన ఎలా ఉందో అర్థమవుతుంది. రాష్ట్రంలో గురుకులాలకు ఓనర్లు తాళాలు వేసే పరిస్థితిని గడిచిన పదేండ్లలో ఎప్పుడైనా చూశామా? నేడు గురుకులాల్లో కనీసం మంచి భోజనం కూడా అందడం లేదు.
– ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నేత
మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతలా మోసం చేస్తుందని రైతులు ఊహించలేదు. నిత్యం హరీశ్‌రావుపై విమర్శలు చేస్తున్న మంత్రి జూపల్లి, అతని హయాంలో కొల్లాపూర్‌లో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నారా? 20 ఏండ్లకు పైగా అధికారంలో ఉండి చేసిన పనులు.., నేను ఐదేండ్లు ఎమ్మెల్యేగా ఉండి చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధం కావాలి. ఓట్ల కోసం రైతులను మోసం చేసిన ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తగిన శాస్తి చేయబోతున్నారు.
– బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా కక్ష పూరితంగా కొనసాగుతుంది. రైతులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఇలా ఒక్కొక్క చోటా.. ఒక్కొక్కతీరుతో భయానక పరిస్థితులను కల్పించి కాలం గడుపుకోవాలని రేవంత్ సర్కార్ చూస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే బెదిరింపులకు భయపడేది లేదు. మరింత సంఘటితంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తాం. కార్యకర్తలను బెదిరించి ఎంతకాలం మనుగడ సాగించలేరని త్వరలో తగిన గుణపాఠం ప్రజలే ఇస్తారు.
– గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు మళ్లీ కష్టాల్లో పడ్డారు. గత పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతులంతా సంతోషంగా గడిపారు. సాగునీరు, కరెంట్, ట్రాన్స్ఫార్మర్లు, ఎరువులు తదితర సమస్యలు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. పది నెలలు గడుస్తున్నా రైతుభరోసా వేయకుండా కాంగ్రెస్ సర్కార్ నట్టేట ముంచింది. రైతుల కష్టాలు తొలగాలంటే కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలి.
– అంజయ్యయాదవ్, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే