మహబూబ్నగర్ : మన -ఊరు మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మన ఊరు- మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ తెలుగు మీడియం ప్రాథమిక పాఠశాలలో రూ.30 లక్షలతో చేపట్టే నూతన భవనం, ఇతర నిర్మాణాలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భూమిపూజ చేశారు.
అనంతరం పాఠశాల భవన నూతన నమూనాలను అధికారులతో కలసి తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఎన్నారైలు, స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థులు అందరూ తాము చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి చేయూత నందించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.