కొల్లాపూర్, సెప్టెంబర్ 14 : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి.. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంతో అన్యాయం జరిగిందని.. గుర్తించిన సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈనెల 16న నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్‌లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం కొల్లాపూర్ బొంగురాలమిట్ట వద్ద సీఎం బహిరంగసభ ఏర్పాట్లను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి మంత్రి గురువారం పరిశీలించారు.
అనంతరం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సభా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద మోటర్లను వినియోగించి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించారని, సీఎం కేసీఆర్ విజన్‌కు ఈ ప్రాజెక్టుకు నిదర్శనమన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీరు అందుతుందని వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని, సాక్షాత్తు ప్రధాని మోదీ హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ల పేరిట మోసం చేసిన నాయకులు ఇప్పుడు ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కే లేదని అన్నారు. ఈనెల 16న తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయానికి నాంది పలుకుతుందని మంత్రి అన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిచ బీఆర్ఎస్ నాయకులు రంగినేని అభిలాష్‌రావు, దూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్‌నాయక్, మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి తదితరులున్నారు.