కొల్లాపూర్, సెప్టెంబర్ 7 : ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల ఎన్నో ఏండ్ల కల సీఎం కేసీఆర్ సంకల్ప బలంతో సాకారం కాబోతున్నదని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈనెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించబోతున్న నేపథ్యంలో నార్లాపూర్ కంట్రోల్ రూం, హెలిప్యాడ్, కొల్లాపూర్ ఈదమ్మ వద్ద బహిరంగసభ ఏర్పాట్లను గురువారం ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు పక్కనే కృష్ణమ్మ పరుగులు పెడుతున్నా గుక్కెడు నీటికి నోచుకోని దౌర్భాగ్యపు పరిస్థితి సమైక్య పాలనలో పాలకులు కల్పించారన్నారు. పాలమూరు గడ్డమీదికి ఉన్నదని, నీళ్లు ఎలావస్తాయని నాడు సమైక్య పాలకులు హేళన చేసి వలసల జిల్లాగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ అలంపూర్ ప్రాంతంలో పర్యటించి పాలమూరు గోస చూసి కన్నీరు పెట్టుకున్నారని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు-రంగారెడ్డి పనులను ప్రారంభించి సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంలోనే అత్యంత పెద్ద మోటర్లు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో ఏర్పాటు చేసి నీళ్లను ఎత్తిపోసేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 16వ తేదీన నార్లాపూర్ కంట్రోల్ రూం వద్ద స్విచ్ ఆన్ చేసి సీఎం కేసీఆర్ కృష్ణమ్మకు పూజలు చేయనున్నారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి కలషాలతో కృష్ణానది నీళ్లు తీసుకొని అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు సస్యశ్యామలం కాబోతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును ఆపేందుకు ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ అన్నింటిని పటాపంచలు చేసి పర్యావరణ అనుమతులు సాధించడంతోపాటు ప్రాజెక్టు పనులను వేగవంతంగా చేపట్టారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. సాగునీరు, విద్యుత్‌తో సాగు సంబురంగా మారిందని, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అనేక పరిశ్రమలు తెస్తున్నారని, దీంతో వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరుకు నేడు వివిధ రాష్ర్టాల నుంచి వలస వస్తున్నారని తెలిపారు.
గతంలో బతుకు దెరువు కరువై ఇతర రాష్ర్టాలకు ప్రతి ఏటా 14లక్షల మంది కూలీలు వలసలు వెళ్లారని గుర్తుచేశారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకొని జిల్లా అభివృద్ధి కోసం బ్యాంకు నుంచి నిధులను తెచ్చి నాటి పాలకులే లబ్ధిపొందారని మంత్రి ఆరోపించారు. సమైక్య పాలనలో ఆంధ్రాలో ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేస్తే అక్కడికి వెళ్లి ఇక్కడి మంత్రి హారతి పట్టారని, ఇక్కడి ప్రజల బతుకుల గురించి మాత్రం ఆలోచించిన దాఖలాలు లేవని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు నీటితో మహబూబ్‌నగర్ నడ్డిబొడ్డులో ఉన్న పెద్ద చెరువును నింపుతామన్నారు. అంతేకాకుండా రాబోయే కాలంలో అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలు రూపుదిద్దుకోనున్నాయని తెలిపారు. ఎల్లూరు రిజర్వాయర్‌కు పాలమూరు ప్రాజెక్టు నీటితో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కోరిక మేరకు ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కంట్రోల్ రూం వద్ద పనులు చేస్తున్న ఒడిశా, ఝార్ఖండ్ రాష్ర్టాల కూలీల వద్దకు మంత్రి, ఎమ్మెల్యేలు వెళ్లి పలుకరించి వారికి కృషిని అభినందించారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈలు అమర్‌సింగ్, ప్రవీణ్‌కుమార్ తదితరులున్నారు.