మహబూబ్‌నగర్, జూన్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అటవీ శాతాన్ని పెంచాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు కోట్ల మొక్కలను నాటి సంరక్షించడంతో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును 2,087 ఎకరాల్లో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలో ఏర్పాటు చేశారు. 2021లో రెండుకోట్ల విత్తన బంతులు వెదజల్లి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సాధించారు. గ్రామాలు, మండలాలు, బల్దియాల్లోని నర్సరీల ద్వారా ఏటా వానకాలంలో వేలాది మొక్కలు నాటుతున్నారు. రహదారుల వెంట గ్రీనరీ పరుచుకోవడంతో ప్రయాణికులకు ఆహ్లాదకర అనుభూతి కలుగుతున్నది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హరితోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకుగానూ ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రామగ్రామాన మొక్కలు నాటనున్నారు.
కరువు నేల, వలసలకు నిలయమైన పాలమూరు.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో హరితవనంగా మారింది. ఈ పథకంతో ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా గ్రామాలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. యజ్ఞంలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టగా.. అన్ని శాఖలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేయడంతో అవకాశం ఉన్న స్థలాల్లో మొక్కలు నాటారు. దీంతో ఉమ్మడి పాలమూరులో ఎక్కడ చూసినా పచ్చదనం పరుచుకున్నది. నాడు రహదారుల వెంట నాటిన మొక్కలన్నీ నేడు చెట్లుగా మారి నీడనిస్తున్నాయి. పాలమూరు జిల్లాలో 2021లో ఏకంగా రెండుకోట్ల విత్తన బంతులు వెదజల్లి గిన్నిస్ రికార్డు సాధించారు. డ్రోన్ల సహాయంతో విత్తన బంతులు వెదజల్లడంతో ఫత్తేపూర్, నవాబ్‌పేట, ఇతర ప్రాంతాల్లో ఉన్న రిజర్వ్‌ఫారెస్ట్ చెట్లతో దట్టంగా అలుముకున్నది. దీంతో ఈ ఫారెస్ట్‌లో దేశంలోనే అతిపెద్ద ఎకోపార్కుకు రూపకల్పన చేసి జిల్లాకేంద్రం సమీపంలోనే ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించారు. ఈ పార్కులోనే అటవీశాఖ ఆధ్వర్యంలో 13కిలోమీటర్ల జంగల్ సఫారీని అందుబాటులోకి తీసుకొచ్చారు. పాలమూరు జిల్లాకేంద్రంలో రూ.7కోట్లతో 2,087 ఎకరాల్లో కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును అభివృద్ధి చేస్తున్నారు. కేవలం మహబూబ్‌నగర్ జిల్లాలోనే జిల్లా అధికార యంత్రాంగం710.37లక్షల మొక్కలను వివిధ శాఖల ద్వారా నాటించింది.
ఊరూరా నర్సరీలు..
ప్రతి ఏటా హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఊరూరా నర్సరీలను ఏర్పాటు చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి జీపీకో నర్సరీ చొప్పున మహబూబ్‌నగర్ జిల్లాలో 441 జీపీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి పలు రకాల మొక్కలను పెంచుతున్నారు. అటవీశాఖ తరఫున 16 మండలాల్లోని నర్సరీల్లో జిల్లా వాతావరణానికి అనుగుణంగా పెరిగే పెద్ద మొక్కలను పెంచుతున్నారు. మున్సిపాలిటీల్లోనూ ఇదే రకమైన నర్సరీలను నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తంగా 476 నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. గతంలో నాటేందుకు సరిపడా మొక్కలు లేక ఇతర ప్రాంతాల నుంచి ఖరీదు చేసి తీసుకువచ్చి నాటేవారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ ఊరూరా ప్రభుత్వం నర్సరీలను ఏర్పాటు చేసి అక్కడే మొక్కలను పెంచుతున్నది. గ్రామాల్లో ఇండ్ల ఎదుట నాటేందుకు మొక్కలను అందిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మొక్కను బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఫలితంగా పల్లెల్లోని ప్రకృతివనాలు పచ్చదనంతో ఫరిడవిల్లుతున్నాయి.
పార్కుతో మారిన పాలమూరు దశ
మహబూబ్‌నగర్ పట్టణంతోపాటు అప్పనపల్లి, జడ్చర్ల, నవాబ్‌పేట మండలాలకు ఆనుకొని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్‌లో గతంలో మయూరి నర్సరీ పేరిట మొక్కలను పెంచేవారు. తెలంగాణ వచ్చాక మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చొరవతో నర్సరీని పార్కుగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పార్కు సందర్శకులతో కిటకిటలాడుతున్నది. తాజాగా ఈ రిజర్వ్ ఫారెస్ట్‌ను కేసీఆర్ ఎకో అర్బన్ పార్కుగా మార్చగా.. 2,087 ఎకరాల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద పార్కుగా అవతరించింది. తాజాగా ఈ పార్కులో జంగల్ సఫారీకి అనుమతిచ్చి.. అటవీ ప్రాంతంలో నైట్ డిన్నర్ హోటల్‌కు ప్లాన్ చేస్తున్నారు. విత్తన బంతులు వెదజల్లడంతో పార్కు దట్టంగా విస్తరించింది. ఇటీవల ఓ చిరుతపులి గోల్‌బంగ్లా వద్ద సంచరించడంతో జంతువుల ఆవాసానికి పార్కు కేంద్రంగా మారినట్టయ్యింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పలు కార్యక్రమాల వల్ల పాలమూరు జిల్లా హరితవనంగా మారింది. ప్రతిఏటా సమృద్ధిగా వర్షాలు కురుస్తూ.. ప్రకృతి సమతుల్యానికి కేంద్రబిందువైంది.
యజ్ఞంలా హరితోత్సవం..
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఊరూరా చెట్లు నాటే కార్యక్రమానికి ఆయా జిల్లాల అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు. హరితోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నారు.