‘గట్టు’ ఎత్తిపోతల పూర్తయితే జోగుళాంబ గద్వాల జిల్లా వజ్రపు తునకగా మారనున్నది.. పూర్తి స్థాయిలో సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తాం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చాం.. అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి.. అందరూ భాగస్వాములు కావాలి’.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఐడీవోసీ చాంబర్లో కలెక్టర్ వల్లూరు క్రాంతిని, ఎస్పీ ఆఫీస్ చాంబర్లో ఎస్పీ సృజనను, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కూర్చోబెట్టి సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు. కలెక్టరేట్లో అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అనంతరం జరిగిన ప్రగతి నివేదన సభలో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర పాలనలో నడిగడ్డ పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టామని గుర్తు చేశారు. నాడు ఆర్డీఎస్ను ధ్వంసం చేసేందుకు సీమ నేతలు యత్నించారని చెప్పుకొచ్చారు. ప్రజల కష్టాలను చూసి చలించి జోగుళాంబ దేవి సాక్షిగా తెలంగాణ కోసం పాదయాత్ర చేపట్టామ న్నారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక మన బతుకులు బాగుపడ్డాయన్నారు. పాలమూరులో నాడు గంజి కేంద్రాలు కనిపించేవని, నేడు ధాన్యపురాశులు దర్శనమిస్తున్నాయన్నారు. ప్రస్తుతం అభివృద్ధిని చూసి సంబురపడ్తున్నామన్నారు.
మహబూబ్‌నగర్, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఉద్యమ సమయంలో నడిగడ్డ దుస్థితిని చూసి కండ్లల్లో నీళ్లు పెట్టుకున్నాం. ఎంతో బాధపడ్డాం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నాడు గంజి కేంద్రాలు ఉండేవి. ఆర్డీఎస్ కాల్వల్లో నీళ్లు తన్నుకుపోతుంటే చూస్తూ ఉండే పరిస్థితి. తెలంగాణ వచ్చినంక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గంజి కేంద్రాలు పోయి.. ఎక్కడ చూసినా ధాన్యపు రాశులు కనిపిస్తున్నాయి’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, సమీకృత కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్‌లను సోమవారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఆనాటి గద్వాల, అలంపూర్ పరిస్థితులను చూసి చలించిపోయానన్నారు.
ఆర్డీఎస్లోని నీటి వాటా కోసం జోగుళాంబ అమ్మవారి సాక్షిగా ఇక్కడి నుంచే పాదయాత్ర చేపట్టానన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సంస్కరణలో భాగంగా గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేసుకున్నామన్నారు. జోగుళాంబ అమ్మవారి దీవెనలు నడిగడ్డ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని జిల్లాకు జోగుళాంబ గద్వాల అని పేరు పెట్టుకున్నామన్నారు. తెలంగాణ వచ్చాక గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయన్నారు. జిల్లా కేంద్రంలో అన్ని వసతులు ఉండాలన్న ఉద్దేశంతో రాజభవనాలను తలపించేలా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను నిర్మించుకున్నామన్నారు. నెట్టెంపాడు, భీమా, ర్యాలంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. సంక్షేమ పథకాలను అమలుచేసి అన్ని వర్గాల ప్రజలకు ఆదుకుంటున్నట్లు వివరించారు. రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ బిడ్డలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేశామని, వాటిని జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశామన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఉద్యమకారులేనని అన్నారు. నిరంజన్‌రెడ్డి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తే.. శ్రీనివాస్‌గౌడ్ ఉద్యోగాన్ని లెక్క చేయకుండా తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తరఫున పోరాడిన చరిత్ర ఉందన్నారు. మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా ఉద్యమంలో కలిసివచ్చి తన పదవిని త్యాగం చేశారని, ఇలాంటి ఉద్యమకారులు ప్రజా ప్రతినిధులుగా ఉండడంతో ఊహించని రీతిలో అభివృద్ధి జరుగుతుందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి 15 నుంచి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. రైతుబంధు సాయాన్ని అందిస్తూ వ్యవసాయాన్ని పండుగలా చేశామన్నారు.
జిల్లాలో తన కన్నా దొడ్డుగా, ఎత్తుగా, గట్టిగా.. అడ్డం, పొడుగు మాట్లాడేటోళ్లు ఆనాడు మంత్రులుగా ఉండి పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 14 రోజులకోసారి తాగునీళ్లు వచ్చేయని, బిందెలు పట్టుకొని మహిళలు అష్టకష్టాలు పడేవారని, ఇది వాస్తవం కాదా అని అన్నారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లాలను ఏర్పాటుచేసి తాగునీటి కష్టాలను తీర్చిన ఘనత తమదేనన్నారు. గతంలో పాలమూరు జిల్లాలో పనులు, ఉపాధి లేక వలసలుపోయేవారని.. తెలంగాణ వచ్చాక మిర్చి వేయడానికి, పత్తి ఏరడానికి ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు వచ్చే స్థాయికి చేరుకున్నామన్నారు.
పక్కనే ఉన్న బీహార్, ఛత్తీస్‌గఢ్, రాయలసీయ నుంచి కూలీలు ఇక్కడికి వస్తున్నారన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం వల్ల రైతులు ఆనందంగా పంటలు పండిస్తున్నారన్నారు. తుంగభద్ర నది దాటితే ఆంధ్రలో కరెంట్ ఎన్ని గంటలు ఇస్తున్నారో మీరే చూస్తున్నారని.., నది ఇవతల 24 గంటల కరెంట్ ఉంటే.. అవతల కరెంట్ ఎప్పుడు వస్తదో పోతదో తెలవదన్నారు. పాలమూరులో ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే కనబడుతున్నాయన్నారు. హార్వెస్టర్ల మోత మోగుతుందన్నారు. ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సంక్షేమ పథకాలు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, అమ్మఒడి వంటి పథకాలతో ప్రజల కష్టాలు తీర్చామన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న జోగుళాంబ గద్వాల జిల్లాపై సీఎం కేసీఆర్ వరాలజల్లు కురిపించారు. గద్వాల మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, మిగతా మూడు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులను కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలకు రూ.10లక్షల చొప్పున గ్రాంట్స్ రూపంలో ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం నిరంతరం నియోజకవర్గాల అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నారని.., తన వద్దకు ఎప్పుడు వచ్చినా ఫైళ్లు వెంట పెట్టుకొని వస్తుంటారన్నారు. ఎమ్మెల్యే అబ్రహం వంద పడకల దవాఖానను అడిగితే వెంటనే మంజూరు చేశామన్నారు. గద్వాల జిల్లాలో త్వరలో మెడికల్ కళాశాలను ప్రారంభించుకోబోతున్నామన్నారు. గట్టు ఎత్తిపోతల పూర్తయితే జిల్లా స్వరూపమే మారిపోతుందని, మల్లమ్మకుంట ఎత్తిపోతల కావాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అడిగారని, అది కూడా త్వరలోనే పూర్తి చేయిస్తామన్నారు.
తుమ్మిళ్ల ఎత్తిపోతలను పూర్తి చేసి అలంపూర్‌ను సస్యశ్యామలం చేస్తామన్నారు. సమావేశంలో హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్, డీజీపీ అంజనీకుమార్, రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, గద్వాల జెడ్పీచైర్‌పర్సన్ సరిత, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, డాక్టర్ అబ్రహం, డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రాంరెడ్డి, రవీందర్రావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు.
అయిజ, జూన్ 12 : సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే జోగుళాంబ గద్వాల జిల్లా ప్రగతి ప థంలో పయనిస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవా రం జిల్లా కేంద్రంలోని అయిజ రోడ్డులో జరిగిన ప్రగతి నివేదన సభలో ఎమ్మెల్యే బండ్ల అధ్యక్షోపన్యాసం చేశారు. గడిచిన తొమ్మిదేళ్లలో గద్వాల జిల్లాకు సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు విడుదల చేస్తుండడంతో గద్వాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్, ప్రజల ఆశీర్వాదంతో జిల్లా ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు.