గద్వాల, అలంపూర్ 19 : ప్రజాస్వామ్యం పరిణతి చెందాలే.. మనకు కావాల్సింది ఫ్యాక్షనిస్టులు, దాదాగిరి, గుండాగిరి కాదని, ఒకరినొకరు చంపుకునే సంస్కృతి మనది కాదని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అలంపూర్ నియోజకవర్గంలోని శాంతినగర్‌లో ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థి విజయుడు, ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అలంపూర్ ప్రాంతంలో అష్ట్టదశ శక్తి పీఠాల్లో ఐదో శకి పీఠమైన జోగుళాంబ దేవీ వెలిసిన పవిత్ర స్థానం. అక్కడ నుంచే దండం పెట్టి గతంలో అలంపూర్ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మీద 2002లో అలంపూర్ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేశానన్నారు. ప్రజలకున్న ఆయుధం ఓటు కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే మంచి జరిగే అవకాశం ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన అన్యాయం మీకు తెలుసన్నారు. రైతాంగం ఏ విధంగా నష్టపోయిందో, మహబూబ్‌నగర్ జిల్లా ఎటువంటి దురవస్థలకు గురైందో మీరందరూ చూశారు. ఉద్యమ సమయంలో నేను నడిగడ్డ ప్రాంతానికి వచ్చినా.. ఇక్కడ సభ పెట్టి ప్రజల దుస్థితి చూసినా.. నేను కూడా కండ్ల నుంచి నీళ్లు తీసినా.. ఇంత అన్యాయం ఎవరి మీద జరిగినా ఊరుకోరు అని చాలా బాధపడ్డం. ఇక్కడి బాధలు వర్ణనాతీతం, ముంబైకి వలసలు యావత్ భారతదేశం ఎక్కడా చూసిన పాలమూరు బిడ్డలే.
చాలా ఘోరమైన పరిస్థితులు మనం చూసినం అని సీఎం గుర్తు చేశారు. మీరందరినీ నేను కోరేది ఏందంటే, తొమ్మిదేండ్ల కిందట తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడెంట్లుందో గమనించాలే. పరిస్థితులల్లా ఎంత మార్పు వచ్చిందో చూడాలే. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంతాన్ని ఆంధ్రాలో కలపడం వల్ల 58 ఏండ్లు గోస పడ్డాం. ఎవరూ మన బాధను తీర్చలే. ఇక్కడున్న కల్వకుర్తి నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను పట్టంచుకోకుండా పెండింగ్ ప్రాజెక్టులు అని పేరు పెట్టిండ్రు. చేతులు ముడుచుకున్నరు గాని ఎవ్వడేం చేయలే అని సీఎం కేసీఆర్ విమర్శించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే 25, 30 వేల ఎకరాలకు సాగునీరు పారిచ్చుకుంటున్నం. మలిదశలో పనులన్నీ పూర్తి చేసుకొని చివరి ఆయకట్టు వరకు పారించుకుందాం. గతంలో బోయలను బీసీల్లో కలిపింది. గత పాలకులే కదా. ఈ సారి పోరాటం చేసి ఢిల్లీ మెడలు వంచైనా బోయలను ఎస్టీ జాబితా కలిపే బాధ్యత నాది. ఆర్డీఎస్ వద్ద బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బాంబులు పెట్టి షట్టర్లు బద్ధలు కొడతామంటే, మేము కూడా సుంకేసుల వద్ద బాంబులు వేసి బారెజ్ బద్ధలు కొడతామన్నం. పాలమూరు జిల్లాలో బాంబులేసే మొగోడు ఇంతవరకు పుట్టలేదు. నీవు పుట్టావని పాలమూరు ప్రజలు సంతోష పడ్డారన్నారు. తూములు బద్ధలు కొట్టి ఆర్డీయస్ నీటిని పారించుకుపోతుంటే పట్టించుకునేనాథుడు లేరు. కాంగ్రెస్ నాయకులు చేతులు ముడుచుకొని చూస్తుండిపోయారు.
50 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులు ఏం చేశారో గుర్తుంచుకోవాలన్నారు. ఆనాడు చేసింది చాలదా ఈ నాడు మళ్లీ కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారు. ఏం ఉండే ఇందిరమ్మ రాజ్యంలో అంతా ఆకలి బతుకులు, ఎవడు ఆదుకున్నోడే లేడు. పేదలను పట్టించుకున్నోడు లేడు, వారి ఆకలి కడుపులు నింపినోడు లేడు. రైతుల పొలాలకు నీరిచ్చినోళ్లు లేరు. తెలంగాణను ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులే. అంతా ఎండిచచ్చినం. ఏది కూడా చేమయలే.. ఎన్టీ రామరావు వచ్చి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చినా మనవి ఆకలి బతులే కదా. రైతు బంధు, రైతు బీమ వంటి సంక్షేమ పథకాలు ముందు ముందు రావాలంటే రాబోయో ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయుడును గెలింపించాలి. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, విజయుడు నాయకత్వంలో అలంపూర్ ప్రాంతానికి ఏమేమి కావాలో అన్ని చేస్తా, ఎమ్మెల్సీ చల్లా ఎంత పట్టుదల ఉన్న వ్యక్తో మీకు తెలుసు, వారి కుటుంబం గతం నుంచి కూడా ప్రజలకు సేవ చేసిండ్రు తప్పా, ప్రజలనుంచి ఏమి ఆశించునోళ్లు కాదు. మంచి కుటుంబం మచ్చలేని కుటుంబం. రాజకీయంతోనే పెనవేసుకున్న కుటుంబం. మొన్నటికి మొన్న వర్షాలు లేక పంటలు ఎండుతున్నయని పట్టుబడితే ఇరిగేషన్ అధికారులతో నేను మాట్లాడి నీరు వదిలించినా.. రాబోయే కాలంలో కరువులనేదే రాకుండా చేస్తాం అని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గట్టు తిమ్మప్ప, మున్సిపల్ చైర్‌పర్సర్ మనోరమావెంకటేశ్, కరుణాసూరి, దేవన్నతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.