గుండెల నిండా.. గులాబీ జెండానే.. పల్లెల నుంచి వచ్చే దారులన్నీ సభ వైపే సాగాయి.. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల శంఖారావాన్ని సీఎం కేసీఆర్ పూరించగా.. గులాబీదళం గర్జించింది. సమరానికి సై అన్నది.. ప్రజా ఆశీర్వాద సభ జనజాతరైంది. మహిళలు బతుకమ్మలతో ర్యాలీగా వచ్చి ఆటాపాటలతో అలరించారు.. యువత ఈలలు, డ్యాన్స్‌లతో హోరెత్తించింది.. జై కేసీఆర్ అంటూ నినదించారు.. వేలాదిగా తరలొచ్చిన ప్రజలు, నాయకులతో జడ్చర్ల గులాబీమయమైంది.. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితోపాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సాగుజలాల రాకతో రైతుల మొఖాలు ఇప్పుడిప్పుడే తెల్లగవుతున్నాయన్నారు. ఇదంతా కేవలం తొమ్మిదేండ్లలోనే చేసి చూపించామని చెప్పారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల వద్ద మోటర్లు బిగిస్తున్నారు.. మూడు, నాలుగు నెలల్లో నీళ్లను కండ్ల చూస్తామని, దీంతో కరువన్నది కన్నెత్తి చూడకుండా చూస్తామని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో సాగునీరు పారించి పాలుగారే జిల్లాగా మార్చుతామని స్పష్టం చేశారు. సీఎం ప్రసంగాన్ని జనం ఆసక్తిగా తిలకించారు.
జడ్చర్ల, అక్టోబర్18 : ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం జడ్చర్లలో ని ర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో జడ్చర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. పాలమూర్,రంగారెడ్డి ప్రాజెక్టులో ముంపుకు గురైన నిర్వాసితులకు ఎన్నికలు ముగిసిన వెంటనే నష్టపరిహారాన్ని అందించటం జరుగుతుందని హా మీ ఇచ్చారు. అలాగే పోలేపల్లి సెజ్‌లో మరిన్ని పరిశ్రమలు తీసుకరావటంతో పాటు జడ్చర్లను ఐటీ హాబ్‌గా తీర్చిదిద్దే బాద్యత నాదేనని సీఎం కేసీఆర్ హమీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జడ్చర్లలో ట్రాఫీక్, రూరల్ పోలీసుస్టేషన్ల ఏర్పాటుకు జి.వో ఇస్తానని హమీ ఇచ్చారు. పాలమూర్ ప్రాజెక్టు పూర్తి చేసి పాలమూర్ను పాలుగారే జిల్లాగా మారుస్తానని చెప్పారు. రాబోవు రోజుల్లో పాలమూర్ జిల్లా రూపురేఖలు మారి లక్ష్మీ అమ్మవారు తాండవం చేసినట్లు ఉంటుందన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు ఇస్తూ జడ్చర్లకు వరాలు కురిపించటంతో బీఆర్ఎస్ పార్టీలో ఉత్సాహం రెట్టింపైంది. బీఆర్ఎస్శ్రేణులు ఆనందంతో సభ ప్రాంగణం చప్పట్లు, కేరింతలు మారుమ్రోగాయి.