మరికల్, ఏప్రిల్ 18: వారంతా ఒకే బడిలో చదివారు. ఏండ్లుగా ఒకే ఊరిలో ఉంటున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా తమ స్నేహితుడు మృతిచెందాడు. ఆప్త మిత్రుడిని కోల్పోవడంతో ఆ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా మరికల్ (Marikal) మండల కేంద్రానికి చెందిన యువ క్రీడాకారుడు వడ్ల బాలరాజ్ ఇటీవల మృతి చెందాడు. ఆర్థికంగా అండగా ఉండే అకాల మరణంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. దీంతో విషయం తెలుసుకున్న బాలరాజు బాల్యమిత్రులు, స్నేహితులు ఆ కుటుంబానికి ఆసరాగా ఉండాలని నిర్ణయించారు.
అంతా కలిసి రూ.లక్ష పోగు చేశారు. అదేవిధంగా మరికల్ యువకమండలి సభ్యులు కూడా మరో రూ.50 వేలు జమచేశారు. మొత్తం రూ.1.50 లక్షలను బాలరాజు కుటుంబానికి అందజేశారు. అందరి మధ్య చిరునవ్వుతో ఉంటూ క్రీడాకారులను ప్రోత్సహించే బాలరాజు మరణం తీరనిలోటు అని, బాలరాజు కుటుంబానికి అండగా ఉంటామని స్నేహితులు, యువకుమండలి సభ్యులు హామీ ఇచ్చారు. వివిధ ప్రాంతాలకు క్రీడాకారులతో కలిసి వెళ్లి వాళ్లను ఉత్సాహపరిచి విజేతలుగా నిలవడంలో బాలరాజు ముందుండేవాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువకుమండలి అధ్యక్షుడు నెల్లికొండి శ్రీకాంత్ రెడ్డి, మిత్ర బృందం రవి గౌడ్, ఫోటో స్టూడియో శ్రీకాంత్, మరికల్ వికాస సమితి అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత కాటకొండ ఆంజనేయులు, వారి మిత్ర బృందం పాల్గొన్నారు.