నారాయణపేట రూరల్, జనవరి 23 : నారాయణపేట జిల్లా దవాఖానలో ప్రసవ సమయంలో ఓ చిన్నారి మృతి కి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ వారిపైన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు దవాఖాన సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట వారు ఆందోళన నిర్వహించారు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామానికి చెందిన బాబమ్మకు ధన్వాడకు చెందిన రాజేశ్‌తో వివాహం జరిగింది. బాబమ్మ గర్భవతి కావడంతో ప్రసవం కోసం తల్లిగారి ఇంటికి వచ్చింది. నెలలు నిండడంతో ఈ నెల 18వ తేదీన జిల్లా దవాఖానలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు 22వ తేదీన ఉదయం ప్రసవం కోసం ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి మళ్లీ వెనకి పంపించారు.
తిరిగి సాయంత్రం మళ్లీ ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి సీజేరియన్ చేసి ప్రసవం చేసారు. కానీ ప్రసవంలో పుట్టిన మగబిడ్డ చనిపోయారని తెలపడంతో బాబమ్మ కుటుంబ సభ్యులు ఒకసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. అలా ఎలా జరిగిందని వైద్యులను ప్రశ్నించగా, ఉమ్మ నీరు మింగి ఉండడం వల్లనే శిశువు మృతి చెంది ఉండవచ్చని చెప్పారు. అయితే తమకు ముందే చెప్పి ఉంటే ప్రైవేట్ దవాఖానకు వెళ్లే వారమని, పైగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సిజేరియన్ ఎలా చేస్తారని నిలదీశారు. అంతటితో ఆగకుండా శిశువు మృతదేహాన్ని తాము తీసుకోబోమని చెప్పడంతో మృతదేహాన్ని దవాఖాన మార్చురీలో ఉంచారు. శుక్రవారం జాజాపూర్ గ్రామస్తులు, మృతుడి బంధువులు పెద్ద ఎత్తున దవాఖానకు చేరుకొని సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ జరిగిన ఘటనపై 48 గంటల విచారణకు ఆదేశిస్తున్నామని, నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అంత వరకు డ్యూటీలో ఉన్న డాక్టర్ సెలవుపై వెళ్లాలని ఆదేశించినట్లు చెప్పారు. అసలే దవాఖానలో మొత్తంలో కేవలం ముగ్గురే వైద్యు లు ఉన్నారని మీరే చెబుతున్నారు, తమ కోసం అందులో ఒక డాక్టర్‌ను సెలవుపై పంపితే మిగతా రోగులు ఇబ్బందులు పడతారని భావించిన మృతుడి బంధువులు బాధ లో కూడా పెద్ద మనస్సు చేసుకొని డ్యూటీ డాక్టర్‌ను అప్పు డే సెలవుపై పంపవద్దని, విచారణ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను కోరారు. అనంతరం జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకొని శిశువు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.