మహబూబ్‌నగర్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం జడ్చర్లలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు రానున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల పట్టణంలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. గత ఎన్నికల్లో ఓటర్లు పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ పక్షం వహించి ఏకపక్ష తీర్పును అందించారు. పార్టీ వర్గాలు అదే సీన్ మళ్లీ రిపీట్ అవుతుందనే ధీమాతో ఉన్నాయి. పార్టీ శ్రేణులు ఈ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దగ్గరుండి సీఎం సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వారం రోజులుగా నియోజకవర్గం అంతటా పర్యటించి మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి సీఎం సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి మండలం నుంచి పెద్ద సంఖ్యలో జనాలను తరలించేలా నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. జడ్చర్ల పట్టణం నుంచి వార్డుల వారీగా భారీ ర్యాలీలతో సభకు తరలిరావాలని ఎమ్మెల్యే సూచించారు. జడ్చర్ల మండలంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా సీఎం సభకు పాదయాత్రగా చేరుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల తొలి ప్రచార సభ కావడంతో పార్టీ నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, పార్టీ అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వడం, ఆ వెంటనే సీఎం కేసీఆర్ ప్రచార సభలు ప్రారంభం కావడంతో విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో సగం సీట్లకే టికెట్లు ప్రకటించింది. ఇంకా అభ్యర్థులు దొరకక బీజేపీ డైలమాలో ఉంది. కారు మాత్రం టాప్ గేర్‌లో దూసుకుపోతుండడంతో బీఆర్ఎస్లో జోష్ కనిపిస్తోంది. కాగా సీఎం సభా ప్రాంగణం, జడ్చర్ల పట్టణం మొత్తం గులాబీమయమైంది. ముఖ్యమంత్రి సభకు పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కేసీఆర్ వెంటే లక్ష్మన్న..
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచార పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ వెంటే లక్ష్మారెడ్డి నడుస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కోసం తొలి రాజీనామా సమర్పించిన జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి కేసీఆర్ వెన్నుదన్నుగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమమే లేదని అప్పట్లో చులకన చేసి మాట్లాడిన విపక్షాలకు 2009లో కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించడంలో లక్ష్మారెడ్డి కీలకపాత్ర వహించారు. పాలమూరు ఎంపీగా ఉంటూనే కేసీఆర్ తెలంగాణ సాధించడంతో లక్ష్మారెడ్డికి రాష్ట్రం ఏర్పడ్డాక ఏర్పాటైన ప్రభుత్వంలో మంత్రి పదవి లభించింది. అప్పటి నుంచి సీఎం కేసీఆర్ కొన్ని సంక్షేమ పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో జడ్చర్ల సభ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కేసీఆర్ సంకల్పించారు.
జన సమీకరణకు..
వచ్చే నెలలో ఎన్నికల నేపథ్యం లో ఉమ్మడి జిల్లా లో ఎన్నికల తొలి ప్ర చార సభకు జ డ్చర్ల వేదికైంది. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వా ద సభను విజయవంతం చేయడానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కంకణం కట్టుకున్నారు. ఎన్నికల ప్రచార సభ ఖరారు కాగానే కార్యరంగంలోకి దూకారు. మండలాల వారీగా కార్యకర్తల సన్నాహక సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహించి సీఎం సభను విజయవంతం చేసేందుకు సంసిద్ధులయ్యారు. నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని కార్యకర్తలు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. విపక్షాలు కూడా జడ్చర్ల సభపై దృష్టి పెట్టడంతో కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు రేయింబవళ్లు పాటుపడుతున్నాయి.
గులాబీమయమైన జడ్చర్ల
సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం నేపథ్యంలో జడ్చర్ల పట్టణం కేసీఆర్ ఫ్లెక్సీలతో నిండిపోయింది. సభా ప్రాంగణమంతా గులాబీమయమైంది. సభకు భారీ ఎత్తున జనం వస్తుండడంతో ఇబ్బందులు లేకుండా కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. మహిళలను ప్రత్యేక గ్యాలరీల్లో ఉంచనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కేసీఆర్ వస్తుండడంతో సభా ప్రాంగణం వెనుక హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. స్వాగతం అనంతరం సీఎం కేసీఆర్ నేరుగా వేదికపైకి వస్తారు. సభకు జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందబస్తు ఏర్పాటు చేసింది.
700 మంది పోలీసులతో పహారా..
జడ్చర్ల, అక్టోబర్ 17 : జడ్చర్లలో బుధవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద బహిరంగసభకు
సీఎం కేసీఆర్ హాజరు కానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జడ్చర్ల సమీపంలోని కల్వకుర్తి రోడ్డులో శివాలయం పక్కన బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్లో రానున్నారు. ఈక్రమంలో సభతోపాటు హెలీప్యాడ్, కాన్వాయ్, పార్కింగ్, సభాప్రాంగణం, వీఐపీ, ప్రధాన రహదారులు, తదితర ప్రాంతాల్లో దాదాపు 700 మందికిపైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ముగ్గురు ఏఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 16మంది సీఐలు, 45 మంది ఎస్సైలతోపాటు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. అదేవిధంగా అగ్నిమాపక శాఖ ఫైర్ఇంజిన్తోపాటు సిబ్బందిని ఏర్పాటు చేసింది.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యే
జడ్చర్లలో ఈనెల 18న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను మంగళవారం ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. సభాస్థలికి కొంత దూరంలోనే ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్‌ను మంత్రి పరిశీలించారు. జనం భారీగా హాజరయ్యే అవకాశం ఉన్నందునా ఏర్పాట్లు, భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సా ధించిన ఉద్యమనేత, సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని, ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. మ్యానిఫెస్టో ప్రకటించంగానే ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా.. ప్రతిపక్షాల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ మాట ఇస్తే తప్పడని, గ తంలో హామీ ఇవ్వని ఎన్నో సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించిన గొప్ప నాయకుడన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను దేశమంతా అనుసరిస్తున్నదని, ఇందుకు మనం గర్వపడాలన్నారు. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు గుర్తుకొస్తారని, వారిని ఎట్టిపరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేదన్నారు. వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణలో ఉన్న పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇవ్వని వారు ఇక్కడికొచ్చి ఏదో చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాలమూరు ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని, త్వరలోనే సస్యశ్యామలం చేస్తామన్నారు.
కాంగ్రెస్, బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి
ఓట్ల రాజకీయం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ బుధవారం జడ్చర్లకు రానున్నారని, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేసే ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదని, ఇక వారు మ్యానిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారెంటీల అమలుకు ఏమాత్రం సాధ్యం కావన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల మనసెరిగిన నేత అని, అడగకుండానే అన్నీ ఇస్తార న్నారు.