నాగర్‌కర్నూల్, మార్చి 3 : జిల్లాలోని దోమలపెంట ఎల్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పదో రోజు బృందాలచే సహాయక చర్యలు కొనసాగాయి. జీపీఆర్ ద్వారా గుర్తించిన అనుమానిత ప్రాంతాల్లో రెస్క్యూ టీంలు తవ్వకాలు చేపడుతున్నాయి. చెలిమల ద్వారా ఊటనీరు పెరిగి బురదగా మారి టన్నెల్లోకి చేరుతోంది. దీంతో సహాయక చర్యలకు సైతం ఆటంకంగా మారింది. టన్నెల్‌లోని 13.5 కిమీటర్ వద్ద ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు రోబోలను వినియోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పది రోజులుగా టన్నెల్లో అన్ని రెస్క్యూ టీమ్‌లతో తనిఖీలు చేస్తున్నా తప్పిపోయిన ఎనిమిది మంది కార్మికుల జాడ బ యటపడలేదు. ఊరుతున్న నీటిని హెవీ మోటర్ల ద్వారా ఎప్పటికప్పుడు బయటకు తరలిస్తున్నా రు అయినా బురదను తరలించడం సవాల్‌గా మారి ంది. కన్వేయర్ బెల్ట్‌కు మరమ్మతులు చేపడితే మట్టితోపాటు చిన్నరాళ్లు, ఇతర వ్యర్థాలను బ యటకు తరలించడం ఈజీ మార్గంగా గుర్తించారు.
దీంతో కన్వేయర్ బెల్ట్‌ను బాగు పనిలో సోమవారం అధికారులు నిమగ్నమయ్యారు. లోకో ట్రెయిన్ ద్వా రా బురదనీటిని తోడుతున్నా ట్రెయిన్ ఒక్కసారి బయటకు వచ్చిపోయే సరిగి రెస్క్యూ టీమ్ తోడిన బురద, నీటికి పదింతలు మళ్లీ పెరుగుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇదిలా ఉండగా.. ఓ వైపు టన్నెల్లో ఇరుక్కుపోయిన తమ వారి కోసం కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ ఎదురు చూస్తున్నారు.
హైరిస్క్‌గా రెస్క్యూ
టన్నెల్లో కార్మికులు చిక్కుకొని పది రోజులు కావస్తున్నా.. ఊట నీరు, బురద కారణంగా కార్మికులను బయటకు తీయడం రెస్క్యూ టీమ్‌కు సవాల్‌గా మారింది. పది రోజులు కావస్తున్నా.. టన్నెల్లోకి నీరు చేరకుండా అధికారులు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోకపోవడంతో రెస్క్యూ టీమ్ చేస్తున్న కష్టానికి ఫలితం లేకుండాపోయింది. టన్నెన్లో చిక్కుకున్న వారిని ఎలా బయటకు తీయాలని సమీక్ష నిర్వహిస్తూ పనులు చేపడుతున్న అధికారులు ఉబికి వస్తున్న నీటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
ప్రమాదం జరిగిన టన్నెల్‌లోని 13.5 కిలోమీటర్ వద్ద మట్టిదిబ్బలు కూలిపడడంతో అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలపై అధికారులకు స్పష్టత రాలేదు. ఆధునికమైన పరికరాలను ఉపయోగించి సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం లేకపోతోంది. 12 సంస్థలకు సంబంధించిన బృందాల అధికారులతో సలహాలు, సూచనలు తీసుకుంటూ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో సొరంగంలో మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు మీడియాకు వివరించారు.
సొరంగంలోకి ఇరువైపులా నుంచి నీరురాకుండా అలాగే సొరంగంలో ఇప్పటికే నిలువ ఉన్న నీటిని తొలగించే ప్రక్రియను వేగవంతం చేశామని దీనికోసం ప్రత్యేకంగా యంత్రాలు నిరంతరం పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం టన్నెల్ సొరంగం వెళ్లిన ప్రాంతం మల్లెలతీర్థం వరకు ఉంటుందని సర్వే బృందాలు పేర్కొంటున్నాయి. అయితే టన్నెల్ నిర్మాణం భూమిపై నుంచి లోపలికి 650 మీటర్లు వరకు ఉండగా టన్నెల్పైనా 450మీటర్ల ఎత్తులో నుంచి భూగర్భలోంచి జలం నీటి ఊటగా టన్నెల్లోకి వస్తుందని సర్వే బృందం అంచనా వేస్తున్నది.
రెస్క్యూ టీమ్‌తో ఉన్నతాధికారుల సమీక్ష
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో పాలుపంచుకున్న రెస్క్యూ టీమ్‌తో అధికారులు సమీక్ష నిర్వహించారు. సోమవారం ఎస్ఎల్బీసీ ప్రమాద ప్రదేశంలో ఉన్న మట్టిని తొలగించేందుకు కన్వేయర్ బెల్ట్‌కు మరమ్మతులు చేసినట్లు వెల్లడించారు. బెల్ట్ సహాయంతో మట్టిని తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. డీవాటరింగ్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతుందని, రె స్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకున్న బృందాలతో అధికారులు.. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ ప్రమాద ప్రదేశంలో జరుగుతున్న సహాయక చర్యలు, ఎదురవుతున్న సమస్యలపై విశ్లేషించారు.
పాల్గొంటున్న సంస్థలకు సంబంధించిన బృందాలతో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేకాధికారులతో సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో సొరంగంలో మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎస్ఎల్బీసీ సొరంగంలోకి మీద నుంచి, ఇరువైపుల నుంచి నీరు రాకుండా చూడడంతోపాటు ఇప్పటికే నిల్వ ఉన్న నీటిని తొలగించే ప్రక్రియను వేగం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా యంత్రాలు నిరంతరం పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు.