గద్వాల అర్బన్, మార్చి 28 : జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ ఆలయంలో ఆలయ అధికారులు, అర్చకులు గత కొంత కాలంగా అవినీతికి పాల్పడుతున్నట్లు పత్రికల్లో పెద్ద మొత్తంలో కథనాలు వెల్లువడుతున్నట్లు మండలి సభలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ప్రస్తావించిన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అలంపూర్ దేవస్థానంలో అవినీతి వ్యవహారం నడవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మండలి సభలో మంత్రి కొరారు. గత కొంత కాలంగా ఆలయంలో ఏం జరుగుతుందో.. అసలు తెలియడం లేదు.. దాతలు, భక్తులు ఇచ్చే విరాళాలు, కానుకలు, చెక్కులకు సంబంధించిన లెక్కలు, వివరాలు సరిగ్గా లేవని వివరించినట్లు సమాచారం. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించి ఆలయంలోని అక్రమార్కులపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి చేసిన ఫిర్యాదుపై ప్రభుత్వం అప్రమత్తమై అవినీతి వ్యవహారంపై దేవదాయ శాఖ అధికారులతో సమాచారం తీసుకొని అక్రమ వ్యవహారాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.