అలంపూర్, ఫిబ్రవరి 9 : ఐదో శక్తి పీఠమైన అలంపూరులో బ్రహ్మోత్సవాలకు వేళైంది. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో 10 నుంచి 14వ తేదీ వరకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతి యేటా వసంత పంచమి రోజు అమ్మవారు భక్తులకు నిజరూప దర్శన భాగ్యం కల్పించనున్నారు. పక్కల రాష్ర్టాల నుంచే కాకుండా మన రాష్ట్రం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. గ్రామ దేవతల అలంకరణ, ప్రభోత్సవం, గ్రామోత్సవం ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిల్వనున్నాయి.
* 10వ తేదీన 8 గంటలకు యాగశాల ప్రవేశం, పుణ్యాహవచనం, మహాగణపతి పూజ, రుత్విక్ వరణం, సాయంత్రం అంకురార్పణలో భాగంగా ధ్వజారోహణం.
* 11 నుంచి నాలుగు రోజుల వరకు ఉభయ ఆలయాల్లో అర్చనలు, చంఢీహోమం, మండపారాదన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పం.
* 14న ఉదయం 8 గంటలకు వసంత పంచమి, యాగశాలలో నిత్యహోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, పంచామృతాభిషేకం, సాయంత్రం జోగుళాంబ సహిత బలబ్రహ్మేశ్వర స్వామికి కల్యాణం, చివరి రోజున జోగుళాంబ దేవి నిజరూప దర్శనం. నిజరూప దర్శనంలో ఉన్న అమ్మవారికి అభిషేకం చేసేందుకు కలశాలతో భక్తులు తరలివస్తారు.
ఉత్సవాలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మన్ చిన్న కృష్ణయ్య నాయుడు, ఈవో పురేందర్కుమార్ ఆధ్వర్యంలో అన్ని చర్యలు చేపట్టారు.