మాగనూరు జూలై 8 : మాగనూరు మండలంలో వడ్వాట్, ఓబులాపూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన కాల్వ పూడికను రైతులు సొంత నిధులతో తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓబులాపూర్, వడ్వాట్ గ్రామస్తులు మాట్లాడుతూ సంగంబండ రిజర్వాయర్ లెఫ్ట్ లో లెవెల్ కెనాల్లో సంగంబండ నుంచి మాగునూరు మండలం ఓబులాపూర్, అడవి సత్యారం, వడ్వాట్ గ్రామాల మీదుగా వెళ్తుందని అయితే ఈ కాల్వలో మట్టి బాగా పేరుకుపోయి తుంగ పెరిగిపోవడంతో కాల్వలో సాగునీరు ముందుకుపోవడం లేదన్నారు.
కాల్వలో పూడిక తీయాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే సొంత నిధులతో దాదాపు ఐదారు కిలో మీటర్ల పొడవునా జేసీబీని అద్దెకు మాట్లాడుకొని కాల్వలో మట్టి,తుంగను తొలగించుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.లక్ష వరకు రైతులు సొంత ఖర్చులు పెట్టుకొని పూడిక తీసుకుంటున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి పూడిక తీత పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.
దీనిపై ఇరిగేషన్ ఏఈ సురేశ్‌ను వివరణ కోరగా రైతులు, తాము కలిసి కాల్వ పూడిక తీస్తున్నామని చెప్పారు. అయితే రైతులు ముందు సొంత డబ్బులు పెట్టుకొని పనులు చేపడితే బిల్ చేసి రైతులకు డబ్బులు అందజేస్తామని వివరించారు. అయితే రైతులు మాట్లాడుతూ రైతుల నుంచి డబ్బులు పడకుండా చూసుకుంటే చాలని చేసిన పనులకే డబ్బులు రాక కాంట్రాక్టర్లు పనులు తీసుకోవడం లేదని ఇక మామూలు రైతులం మాకు ఎలా డబ్బులు వస్తాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.