గద్వాల, జూన్ 4 : తుంగభద్ర నది సమీపంలో పచ్చని పైర్లతో కళకళలాడే పచ్చని పొలాలు, పొలాల్లో పచ్చని పైర్లు, ఇప్పుడిప్పుడే పంటలు బాగా పండి రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్న తరుణంలో పచ్చని పల్లెల్లో ఇథనాల్ కంపెనీ నిర్మాణం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అర్ధరాత్రి కంపెనీ యాజమాన్యం దొంగలా పని చేసే ప్రాంతానికి కంటైనర్లు, హిటాచీలు, పరిశ్రమ దగ్గరకు తరలించారు. అంతే కాకుండా పనులు చేయడానికి కూలీలను తీసుకొచ్చి పనులు ప్రారంభించే క్రమంలో రైతుల ఆ క్రోశం కట్టలు తెగింది. ఊర్లకు ఊర్లు కదిలాయి.
మా ప్రా ణాలకు ముప్పు తెచ్చే ఫ్యాక్టరీ నిర్మాణాలు మాకొద్దు అంటూ కట్టలు తెగిన ఆక్రోశంతో అక్కడ ఉన్న కూలీలకు, పరిశ్రమకు సంబంధించిన పరికరాలను ధ్వంసం చేసి తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. ఎక్కడో పట్టణాల్లో ప్రముఖుల దగ్గర ఉండే బౌన్సర్లును ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గరికి యాజమాన్యం ఎందుకు తీసుకొచ్చింది, ఇది రైతులపై దా డి చేయడానికే అన్న సంకేతానికి నిదర్శమని రైతులు భావిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని ఆయా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రజలకు, రైతులకు నచ్చని ఏ పనినైనా ప్రభుత్వాలు చేపట్టకూడదు, చేపడితే ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వస్తుందో అధికారులు, ప్రజా ప్రతినిధులకు లగచర్ల ఘట నే నిదర్శనం. ఇది తెలిసి కూడా పనులు ప్రారంభించడానికి పూనుకున్న యాజమాన్యం ఇక్కడి ప్రజాప్రతినిధుల సహాకారం లేకుండా కంపెనీ యాజమాన్యం పనులు చేయడానికి పూనుకోదు. పరిశ్రమ మాకొద్దూ అంటూ 12 గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్ష చేసిన సమయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేపడుతున్న శిబిరం దగ్గరకు వెళ్లి ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమ ఏర్పాటు కానివ్వం అని చెప్పిన వారు, ఇప్పుడు కంపెనీ యాజమాన్యం దొంగ చాటున పనులు మొదలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలో వారు ఎందుకు మాట్లడడం లేదని ప్రజలు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.
ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపడుతున్నా వారు పట్టించుకోక పోవడంతో, ఇది తెలిసిన 12 గ్రామాల ప్రజలు దానిని అడ్డుకున్నారు. అడ్డుకున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం అప్పుడు దీక్ష దగ్గరకు వచ్చిన ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారి మౌనం దేనికి సంకేతమని పెద్దధన్వాడ గ్రామస్తులతోపాటు ఇతర గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికార రాజకీయ పార్టీ మద్దతు లేనిదే యాజమాన్యం ఇంతటి దౌర్జన్యానికి ఒడిగట్టే ప్రసక్తే లేదనేది ప్రజల వాదన.
మా పచ్చని పొలాలను నాశనం చేసే ఫ్యాక్టరీ మాకొద్దని ఫ్యాక్టరీ నిర్మాణమైతే 12 గ్రామాల్లో సుమారు 10వేల ఎకరాల్లో పచ్చని పొలాలు నీటి కలుషితం వల్ల బీడు భూములుగా మారే ప్రమాదం ఉండడంతోపాటు, ప్రజలు ప్రమాదకరమైన రోగాల భారిన పడే అవకాశం ఉందని, ఫ్యాక్టరీ నిర్మాణం ఆపాలని ప్రజలు కోరుతుంటే రెవెన్యూ అధికారులు పదే పదే ప్రజల్ని ఒప్పించడానికి ప్రయత్నించడం చూస్తుంటే కంపెనీ నిర్మాణంపై వారికి ఎందుకు అంతప్రేమ ఉందో అర్థం కావడం లేదు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు, కంపెనీకి అండగా నిలబడడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ప్రజలకు మద్దతు ఇస్తున్నారా లేక యాజమాన్యానికి మద్దతు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ సమస్యపై జిల్లా ప్రజాప్రతినిధులతోపాటు జిల్లా యంత్రాంగం స్పందించక పోతే పనులు చేపట్టే ప్రతిసారి ప్రజల ఆగ్రహాం చవిచూడాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది.
పచ్చని పైర్లను నాశనం చేసే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఆపాలని ప్రజలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, బీఆర్ఎస్వి నాయకడు కుర్వ పల్లయ్యలను అయిజ, గద్వాల పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజలకు మద్దతు తెలిపిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు గొంగళ్ల రంజిత్‌కుమార్‌ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. వీరు ఇథనాల్ ఫ్యాక్టరీకి నిర్మాణాన్ని వ్యతిరేకించడంతోపాటు ప్రజలు చేస్తున్న ఆందోళన దగ్గరకు వెళ్లే క్రమంలో వారిని ముందస్తు అరెస్ట్‌చేశారు.
అధికార పార్టీ ముఖ్య నేతల అండతోనే ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం అరాచకం చేస్తుంది. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా మండలంలోని రైతాంగం పోరాడుతున్న యాజమాన్యం యథేచ్ఛగా పనులను మొదలు పెట్టడం వెనుక అధికార పార్టీ పెద్దల అండదండలే కారణం. రైతుల ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని తక్షణమే, ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దుపై స్పష్టమైనా అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలి. రైతులతో చెలగాటం ఆడి లగచర్లలో చేతులు కాల్చుకున్న రేవంత్ సర్కార్‌లో మార్పు రాకపోవడం దారుణం. రైతులపై రౌడీయిజం దారుణం. పోలీసులు అదుపులో తీసుకున్న రైతులు, ప్రజలను వెంటనే విడుదల చేయాలి. రైతుల మనోభావాలను గాయపర్చిన ఇథనాల్ యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలి. రాజోళి మండల రైతులకు నడిగడ్డలోని అన్ని వర్గాల అండగా నిలుస్తాయి.
– ఆంజనేయగౌడ్, సాట్ మాజీ చైర్మన్
పాలమూరు జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పగబట్టినట్లు ఉన్నాడు. కార్పోరేట్ కంపెనీలకు భూములుదారదత్తం చేయడానికి కుట్ర జరుగుతుంది. అక్కడ లగచర్ల, ఇక్కడ పెద్దధన్వాడ. అక్రమ అరెస్ట్‌లతో ప్రజా పాలన చేయలేరు. తక్షణమే ఇథనాల్ ప్యాక్టరీ రద్దు చేయాలి. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల పర్యావరణం ధ్వంసమై ప్రజలందరూ ఇబ్బందులు పడతారు. ఫ్యాక్టరీ వద్దంటున్న ప్రజలు, రైతుల పక్షాన ప్రజాప్రతినిధులు, అధికారులు నిలవాలి. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడే ప్రజలు, రైతులకు బీఆర్ఎస్ మద్దతు ఎప్పుడూ ఉంటుంది. రైతులు, ప్రజలను అరెస్ట్ చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తాం..ప్రజలకు నష్టం కలిగించే ఈ ఫ్యాక్టరీ నిర్మాణ ఉత్తర్వులు ప్రభుత్వం రద్దు చేయాలి.
– కుర్వ పల్లయ్య, బీఆర్ఎస్వీ నాయకుడు