కామారెడ్డి, ఫిబ్రవరి 20 : వ్యాపారాల పేరుతో కొందరు కేటుగాళ్లు భారీగా అప్పులు చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. అమాయక ప్రజలను నమ్మించి డబ్బులు తీసుకుని ఉడాయిస్తున్నారు. దివాళా తీశామంటూ ఐపీ పెట్టి జనానికి కుచ్చుటోపీ పెడుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. అప్పులు ఎగ్గొట్టి పరారవుతున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. కడుపు మాడ్చుకుని, కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముతో మోసగాళ్లు ఉడాయిస్తుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
కామారెడ్డి జిల్లాలో తరచూ మోసాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలోనే ఇలాంటివి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అమాయకులను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు భారీగా దండుకుని ఉడాయిస్తున్నారు. దందాల పేరిట నమ్మించి, అధిక వడ్డీ ఆశ చూపి ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. స్థానికంగా ఉంటూ నమ్మకం కల్పించి జనం నుంచి రూ.కోట్లలో డబ్బులు తీసుకుని పరారవుతున్నారు. బీర్షేబా సంస్థ మొదలుకుని ఎన్నో చిట్‌ఫండ్ సంస్థలు, ఎంతో మంది వ్యాపారులు ఇలా అమాయకులను బురిడీ కొట్టించారు.
కామారెడ్డి కేంద్రంగా జరిగిన మోసాల్లో మొదటి స్థానంలో నిలిచేది బీర్షేబా సంస్థ. జిల్లా కేంద్రంలోని స్నేహపురి కాలనీలో బీర్షేబా పేరుతో ఓ సంస్థను నెలకొల్పారు. రూ.30 వేలు కడితే నెలకు రూ.10 వేల చొప్పున పది నెలల్లో రూ.లక్ష ఇస్తామని నమ్మించారు. ఇందుకోసం స్థానికులనే ఏజెంట్లుగా పెట్టుకున్నారు. తెలిసిన వారే కావడంతో కామారెడ్డితో పాటు చుట్టుపక్కల మండలాల్లో చాలా మంది వారిని నమ్మి పెట్టుబడి పెట్టారు. మొదట్లో ఒకటి, రెండు నెలలు రూ.10 వేల చొప్పున నిర్వాహకులు చెల్లించడంతో జనంలో నమ్మకం కలిగింది.దీంతో దవాఖానల ఖర్చు కోసం, పిల్లల చదువుల కోసం, బిడ్డల పెండ్లిల కోసం దాచుకున్న డబ్బులు సైతం వారికి ముట్టజెప్పారు. కామారెడ్డి జిల్లా సహా పలు జిల్లాల్లో 20 వేల మంది సుమారు రూ.200 కోట్ల దాకా పెట్టుబడి పెట్టారు. భారీగా డబ్బులు సేకరించిన బీర్షేబా నిర్వాహకులు బిచాణా ఎత్తేశారు. విషయం తెలిసి బాధితులు లబోదిబోమంటూ ఠాణాల చుట్టూ తిరిగాల్సి వచ్చింది. పోలీసులు నిర్వాహకులను అరెస్టు చేసినప్పటికీ, బెయిల్ పొంది హైదరాబాద్‌కు మకాం మార్చారు. నాలుగేండ్లు దాటుతున్నా బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు.
పలు సంస్థలు, వ్యాపారులు ఎరవేసే వడ్డీకి ఆశపడి అమాయకులు మోసపోతున్నారు. ఎంతో కొంత కలిసొస్తుందన్న ఆశతో డబ్బులు ఇచ్చి చేతులు కాల్చుకుంటున్నారు. అప్పు చెల్లించాలని వ్యాపారులపై కాస్త ఒత్తిడి తెస్తే బెదిరింపులు ఎదురవుతుండడంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము, కడుపు మాడ్చుకుని రూపాయి రూపాయి పోగేసిసుకున్న డబ్బు మోసగాళ్ల పాలు కావడంతో భరించలేక పోతున్నారు. వడ్డీ కలిసొస్తుందన్న ఆశకు పోతే అసలుకే ఎసరు వస్తుండడంతో లబోదిబోమంటున్నారు. మరోవైపు, బాధితులు పోలీసుల చుట్టూ తిరుగుతున్నా వారికి న్యాయం దక్కడం లేదు. దివాళా తీశామంటూ కేటుగాళ్లు ఇన్సాల్వేన్సీ పిటిషన్ (ఐపీ) వేస్తుండడంతో బాధితులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు.
కామారెడ్డి కేంద్రంగా వెలిసిన చిట్‌ఫండ్ సంస్థలు సైతం ప్రజల నుంచి డబ్బులు సేకరించి బోర్డు తిప్పేశాయి. గతంలో వీక్లీ మార్కెట్లో ఎస్వీ కట్మీట్ షాపు యజమాని రూ.1.50 కోట్ల వరకు అప్పులు చేసి రాత్రికి రాత్రి ఉడాయించాడు. అంబికా కిరాణ షాపు ఓనర్ రూ.కోటిగా పైగా ముంచి పరారయ్యాడు. ఇటీవల హబీబ్ అనే వ్యక్తి సైతం ఇలాగే అమాయకులను ముంచాడు. బస్టాండ్ సమీపంలో మెగా మార్ట్ సూపర్ మార్కెట్‌తో పాటు వడ్డీ వ్యాపారం పేరిట రూ.2 కోట్ల దాకా అప్పులు చేసి మాయమయ్యాడు. 40 రోజులుగా షాపు తెరువక పోవడం, హబీబ్ అడ్రస్ లేకపోవడంతో మోసపోయిన బాధితులు షాపు ముందర ధర్నాకు దిగారు. ఇలాంటి ఉదంతాలెన్నో కామారెడ్డి కేంద్రంగా చాలా ఉన్నాయి.
కామారెడ్డి పట్టణంలో చాలా మంది వ్యాపారులు ప్రజలను నమ్మబలికి డబ్బులు దండుకుంటున్నారు. పెట్టిన దానికి రెట్టింపు వస్తాయని నమ్మబలికి జనం సొమ్ముతో ఉడాయిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తేరగా డబ్బులు వస్తాయని అనుమతి లేని సంస్థలో డబ్బులు పెట్టడం, మిత్తీ ఎక్కువ వస్తుందని అప్పుగా ఇవ్వడం మానుకోవాలి.
– చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ, కామారెడ్డి