Kollapur | కొల్లాపూర్, మార్చి 18 : ఓయూలో నిరసనలు, ధర్నాలు చేపట్టొద్దని జారీ చేసిన సర్క్యులర్‌ను ఎత్తివేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఉన్న పీజీ కళాశాలలో బీఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి బి.దాస్, బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు శేఖర్ విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించారు. విద్యార్థులు ధర్నాలు రాస్తారోకాలు చేయవద్దని చేసిన సర్క్యులర్ అప్రజాస్వామికమని వారు అన్నారు. ప్రభుత్వం వెంటనే సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని ప్రభుత్వం విద్యార్థుల గొంతు ఎంత నొక్కితే అంత గట్టిగా గొంతు ఎత్తుతామని అన్నారు. ధర్నాలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని వారు గుర్తు చేశారు.
రెగ్యులర్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం వలన నెట్, సెట్ క్వాలిఫై అయిన విద్యార్థులు ఎంతోమంది పీహెచ్డీ చేయడానికి వీలు లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం వెంటనే విశ్వవిద్యాలయాల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి కావాల్సిన నిధులను కేటాయించకుండా విద్యాలయాలను నిర్వీర్యం చేస్తూ విద్యా పరిరక్షణ కోసం గొంతు ఎత్తే వారిపై కాగితాలతో నిర్బంధిస్తామంటే కుదరదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే యూనివర్సిటీలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో సంస్కరణల పేరుతో బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేస్తుంటే వ్యతిరేకించవలసిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం బిజెపి ప్రభుత్వానికి వంత పాడుతుందని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ పీజీ సెంటర్లలో కూడా విద్యార్థులకు సరైన సౌకర్యాలతో పాటు బోధించేందుకు టీచింగ్ ఫ్యాకల్టీ కూడా లేదన్నారు. దీంతో నాణ్యమైన ఉన్నత విద్య ఎలా వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ అభివృద్ధి కోసం నూతన ఆవిష్కరణలు జరిగే యూనివర్సిటీల పట్ల నిర్లక్ష్యం రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి మంచిది కాదన్నారు. వెంటనే విద్యా వ్యతిరేక విధానాలను పక్కనపెట్టి విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. విద్యా వ్యతిరేక విధానాలను ఇలాగే అవలంబిస్తే విద్యార్థులు ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ పీజీ సెంటర్ విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.